Ugadi 2022 Telugu Panchangam Subhakruth Nama Samvatsara Rasi Phalalu - Sakshi
Sakshi News home page

Ugadi 2022: శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర (2022 – 23) రాశిఫలాలు

Published Sat, Apr 2 2022 7:05 AM | Last Updated on Sun, Apr 3 2022 2:57 PM

Ugadi 2022 Telugu Panchangam Subhakruth Nama Samvatsara Rasi Phalalu - Sakshi

మేష రాశి    

ఆదాయం–14 వ్యయం–14 రాజయోగం–3 అవమానం–6
అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)
భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (లాభం)లోను తదుపరి మీనం (వ్యయం)లోను సంచరిస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (దశమం)లోనూ మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (ద్వితీయం) కేతువు వృశ్చికం (అష్టమం)లోను తదుపరి రాహువు మేషం (జన్మం) కేతువు తుల (సప్తమం)లో సంచరిస్తారు. 2022 ఆగుస్టు 10 నుండి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (ద్వితీయం)లో స్తంభనం. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. గతంలో కంటే ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉంటాయి. శని మకరంలో ఉన్నప్పటి కంటే కుంభంలో సంచరించే సమయంలో బాగా అనుకూలిస్తాడు. శుభకార్యముల నిమిత్తం తరచుగా ధనవ్యయం అవుతుంటుంది. ఇతరుల మీద ఆధారపడని వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అనవసరమైన సలహాలు తీసుకొని, చికాకులు పడుతుంటారు. అందువలన ఈ సంవత్సరం ప్రతిపనీ స్వయంగా చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో నష్టాలు ఉండవుగాని, మనస్పర్థలకు అవకాశం ఎక్కువ. ఆర్థిక వనరులు వచ్చే మార్గం చిన్నదిగాను ఖర్చు అయ్యే మార్గం పెద్దదిగా ఉన్న కారణం చేత ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు పడతారు. ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలాకాలం పుణ్యకార్యాచరణ లేదా పుణ్యక్షేత్ర సందర్శన మీద దృష్టి ఉంచే అవకాశం ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో నమ్మకద్రోçహానికి గురవుతారు. ఉద్యోగంలో స్థానచలన ప్రయత్నాలలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వ్యాపారులకు సంవత్సరం అంతా హెచ్చుతగ్గులు తప్పవు. లాభాలు తక్కువ. ఉద్యోగాల్లో స్థిరం తగ్గుతుంది. ప్రమోషన్‌లు దగ్గరకు వచ్చి మిస్‌ అవుతాయి. మీకు శ్రమకు తగిన లాభం, శ్రమకు తగిన గుర్తింపు అందవు.

అధికారుల నుంచి సహకారం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులేవీ ఉండవు. అయితే మానసిక రుగ్మతలు ఉన్నవారు తరచుగా యిబ్బందులకు లోనవుతారు. మిగిలిన వారు గురువు వ్యయం దృష్ట్యా  స్వల్ప జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటింపకపోతే మోసపోయే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగకపోవడం వల్ల నిరుత్సాహ పడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చాలా ఇబ్బందులతో పనులు పూర్తి అవుతాయి. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు ఈ సంవత్సరం మే నుంచి చాలా చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం కంటే ఇతర వ్యవహారాలు ఎక్కువై విద్యాభంగం పొందుతారు. రైతులకు శ్రమ ఎక్కువ అవుతుంది. గర్భిణీస్త్రీలు మే నెల నుంచి బహు జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ.


అశ్వినీ నక్షత్రం వారికి శుభపరిణామాలు ఎక్కువ. బాగా కృషి చేస్తారు. వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకుంటారు. జన్మ రాహువు, వ్యయ గురువుల ప్రభావం ఈ నక్షత్రం మీద తక్కువ అనే చెప్పాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరికీ సాయం చేస్తూ మంచి ఫలితాలు, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు.

భరణీ నక్షత్రం వారికి అనవసర ఆలోచనలు, వృథా కాల క్షేపాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. రాహువు భరణీలో సంచారం వల్ల మానసిక రుగ్మతలు తలెత్తుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వుంటాయి. ధనవ్యయం ఎక్కువగా వుంటుంది.


కృత్తికా నక్షత్రం వారు ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించి, వేగంగా పూర్తి చేసుకుంటారు. అన్ని అంశాలలోనూ అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో చికాకులు వుంటాయి. తెలివిగా సరి చేసుకుంటారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పదిమందికీ సాయంచేసి సంఘంలో మంచిపేరు తెచ్చుకుంటారు.
శాంతి : ఏప్రిల్‌ 12 తరువాత రాహు, కేతు గురువులకు శాంతి చేయించండి. రోజూ ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి దుర్గా సప్తశ్లోకీ 11 సార్లు పారాయణ చేయడం వలన చాలావరకు దుష్ఫలితాలు తొలగుతాయి. పంచముఖ రుద్రాక్షలు ధరించడం శ్రేయస్కరం.

ఏప్రిల్‌: ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. కుటుంబ విషయాల్లో మంచి పరిణామములు చోటు చేసుకుంటాయి. అలంకరణ వస్తువుల కొనుగోలు, ప్రయణాల కోసం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాహుకేతు శాంతి చేయించండి. ఉద్యోగం ఒత్తిడితో ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా ఉంటాయి.

మే: క్రమక్రమంగా పని ఒత్తిడి పెరుగుతుంది. శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ అవుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు విషయంలో ధనవ్యయం ఎక్కువవుతుంది. అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. అనవసర విషయాల వలన మానసిక చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు ఏమీ చేయవద్దని సూచన.
జూన్‌: సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తారు. కుటుంబ విషయాలు చాలావరకు మంచి ఫలితాలతో ఉంటాయి. ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారం అంతా సాధారణ స్థాయి ఫలితాలతో ఉంటాయి. అభివృద్ధిపథంలో ప్రయాణం సాగుతుందనే చెప్పాలి.

జూలై: ఎంత లాభదాయకంగా ఉన్నా, లేకున్నా వ్యాపారులు చాలా జాగ్రత్తలు వహిస్తూ వ్యాపారాలు చేయాలి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి తరచుగా చికాకులు వస్తుంటాయి. మితభాషణ మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.
ఆగస్టు: చాలావరకు సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయోగాలేవీ చేయవద్దని సూచన. శుభ వార్తలు వింటారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ కార్యాలు, పుణ్యకార్యాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు.

సెప్టెంబర్‌: చాలా ప్రశాంతంగా ఉంటుంది. 15వ తేదీ నుంచి 24 వరకు కాలం మరింత అనుకూలం. అందరూ బాగా గౌరవిస్తారు. ధనవ్యయం అధికంగానే ఉన్నా, అవసరానికి తగిన ఋణం లభిస్తుంటుంది. కుటుంబం, ఉద్యోగం రెండు అంశాలనూ చాలా ఓర్పుగా నేర్పుగా సాగించుకుంటూ ముందుకు వెడతారు.
అక్టోబర్‌: గురు, బుధ, శుక్ర సంచారం అనుకూలం తక్కువ. ప్రయాణాలలో వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతుంది. బంధు మిత్రులు కలిసినప్పుడు వ్యవహార విషయాల మీద చర్చలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. అలంకరణ వస్తువుల కొనుగోలులో ధనవ్యయం అధికం అవుతుంది. వృత్తి సౌఖ్యం బాగానే ఉంటుంది.
నవంబర్‌: కనబడుతున్న అన్ని అంశాలూ నిజం కాదు అని గ్రహించండి. ప్రతి విషయంలోనూ స్వయం శోధన అవసరం. ఈ నెలలో వృత్తి వ్యవహారాలు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడితే ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలహం పెరిగినా వారితోనే ఎక్కువ సమయం కేటాయించండి.


డిసెంబర్‌: క్రమంగా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజూ అధిక శ్రమ ఉంటుంది. అయితే శ్రమకు తగినట్లు లాభదాయకంగా ఉంటుంది. ప్రధానంగా మీ విజ్ఞానం మీకు గౌరవం తెచ్చి పెడుతుంది. మిత్రలాభం చేకూరుతుంది. అనుకోని లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు, అలంకరణ వస్తువుల కొనుగోలులో ఖర్చు పెరుగుతుంది.

జనవరి: శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. వృత్తిరీత్యా ఇబ్బందులు వుండవు. అన్ని వ్యవహారాల్లోనూ మీకు అందరూ సహకరిస్తారు. ధనం వెసులుబాటు బాగుంటుంది. ప్రత్యేక జాగ్రత్తలతో కాలం సానుకూలం చేసుకుంటారు. ఎవరి మీదా ఆధారపడకుండా చేసే పనులు మిమ్మల్ని విజయపథంలోకి తీసుకువెడతాయి.
ఫిబ్రవరి: చాలా మంచి కాలం. క్రమంగా ఓర్పుతో సర్వకార్యసాధన చేస్తారు. ప్రధానంగా కుటుంబ విషయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. రాహు, కేతు, గురువులు బాగాలేని ఈ కాలంలో కూడా మిగిలిన గ్రహాల అనుకూలత దృష్ట్యా ఆర్థిక, ఆరోగ్య విషయాలలో మంచి అనుకూలస్థితి సాధిస్తారు. ఋణ సదుపాయం బాగుంటుంది.
మార్చి: పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేక బాగా చికాకుకు గురి అవుతారు. బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా ఏ సలహాలూ తీసుకోవద్దు. ఓర్పు చాలా అవసరం. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాల్లోనూ కలుగజేసుకోవద్దని ప్రత్యేక సూచన.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.

వృషభ రాశి
ఆదాయం–8  వ్యయం–8 రాజయోగం–6 అవమానం–6
కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ)
రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)
మృగశిర 1,2 పాదములు (వే,వో)

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (దశమం)లోనూ తదుపరి మీనం (లాభం)లోనూ సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (భాగ్యం)లోనూ మిగిలినకాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (జన్మం), కేతువు వృశ్చికం (సప్తమం)లోనూ తదుపరి రాహువు మేషం (వ్యయం), కేతువు తుల (షష్ఠం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (జన్మం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా శోధింపగా లాభాలు బాగా ఉంటాయి. కార్య సానుకూలత బాగుంటుంది. అయినా చికాకులు వెంబడిస్తూనే ఉంటాయి. ఇదొక విచిత్రమైన కాలమనే చెప్పాలి. ఏ విధమైన నిర్ణయాలైనా త్వరగా తీసుకోలేకపోతారు. తరచుగా భయాందోళనలకు గురవుతుంటారు. గురువు లాభ సంచారం, శని అనుకూల సంచారం మీకు గొప్ప వరమనే చెప్పాలి. ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు ఉన్నా, ప్రమోషన్‌ అందుకుంటారు. సర్వత్రా మీ ప్రణాళికలు విజయం అందిస్తాయి. గౌరవం తెస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్నా, ఈ ఏడాది ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు. అనవసర విషయాల పట్ల ఆకర్షితులైనవారు ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఏ పరిస్థితిలోనైనా కుటుంబసభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అయితే మీరు కుటుంబసభ్యులతోనూ, మిత్రులతోనూ అనుమాన ధోరణితో సంచరిస్తారు. ఈ సంవత్సరం అతి జాగ్రత్త, మితభాషణ శ్రేయస్కరం. కొత్త వ్యవహారాలు, వ్యాపారాలు మిమ్మల్ని ఎంత ఆకర్షించినా, మీరు ఏమాత్రం ఆకర్షితులు కాకండి. మీ స్థితిని గమనించుకొని ప్రవర్తించండి. వ్యాపారులకు సంవత్సరం అంతా లాభాలు ఉంటాయి. అయితే పక్కనే సమస్యలు కూడా ప్రయాణం చేస్తాయి. ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా మెలగాలని సూచన. ఇతరుల మీద ఆధారపడిన ప్రతి పనిలోనూ సమస్యలు వస్తుంటాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం శ్రేయస్కరం. నేత్ర సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కువవుతాయి.

సహజంగా గురుబలం దృష్ట్యా సమస్యలు రాకూడదు కానీ ఆగస్టు తరువాత మీకు కానీ మీ కుటుంబసభ్యులకు కానీ సంబంధించి వైద్య ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు కోసం ధనం సమకూరుతుంది. లోన్‌లు, ప్లాన్‌లు వంటివి తేలికగా సమకూరుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే విషయంలో పాత ఉద్యోగం మానివేసి, కొత్త ప్రయత్నం చేయడం మంచిదికాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రత్యేక సూచన ఏమిటి అంటే ధనవ్యయం. మోసం మీ వెంట ఉంటాయి జాగ్రత్త. షేర్‌ వ్యాపారులకు ఫైనాన్స్‌ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉంటుంది. విచిత్ర సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం చెడకొట్టే ఇతర అంశాలు ఎక్కువవుతాయి. రైతులకు శ్రమ ఎక్కువ ఉన్నా, ఫలితాలు అనుకూలం. పంటలకు సంబంధించిన రోగాలకు ఖర్చులు పెరుగుతాయి. గర్భిణులు బహుజాగ్రత్తలు పాటించాలి. 


కృత్తికా నక్షత్రం వారు ఇబ్బందులు లేని జీవితం గడుపుతారు. కానీ ఏ స్థాయి వారికి ఆ స్థాయి మానసిక సమస్యలు వుంటాయి. ప్రధానంగా అభద్రతాభావం వెంబడిస్తుంది. అయితే కచ్చితంగా అన్ని విషయాల్లోనూ సానుకూలత ఎక్కువగా వుంటుంది. అందరూ సహకరిస్తారు. ఆర్థికంగా బలపడతారు. రోహిణీ నక్షత్రం వారికి నేత్ర సమస్యలు ఎక్కువ కాగలవు. జీర్ణ సంబంధ, చర్మ సంబంధ సమస్యలు వున్న ఈ నక్షత్రం వారు ఎక్కువగా చికాకులు పొందుతారు. స్థిరాస్తి సమస్యలను త్వరగా సెటిల్‌మెంట్‌ చేసుకోకపోవడం శాపంగా మారుతుంది.

మృగశిర నక్షత్రం వారికి క్రమంగా శుభపరిణామాలు పెరుగుతాయి. ఆదాయం బాగా వుండి ధనవ్యయం అధికంగా చేస్తుంటారు. పిల్లల విద్య వివాహ ప్రయత్నాలు, ఉద్యోగంలో సక్సెస్‌ వార్తలు ఆనందం కలిగిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు, దాన ధర్మాలు చేస్తారు. 

శాంతి: ఏప్రిల్‌లో రాహుకేతు శాంతి చేయించండి. ఆగస్టులో కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ దుర్గ, గణపతి, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయాలి. ‘గజేంద్రమోక్షం ఘట్టం’ రోజూ పారాయణ చేయడం చాలా అవసరం. త్రిముఖి, షణ్ముఖి రుద్రాక్ష ధరించడం వలన మంచి జరుగుతుంది.

ఏప్రిల్‌: తరచుగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. అన్ని పనులూ సక్రమంగా జరుగుతాయి. కొన్ని అంశాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారులు తరచుగా ఆగ్రహిస్తారు. ఎవరినీ నమ్మి పనులు చేయవద్దు. మితభాషణ అవసరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్ని పనులూ స్వయంగా చేసుకోవడం మంచిది.

మే: కొన్ని సందర్భాలలో ధైర్యంగా బుద్ధిని ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు అధైర్యంగా ఉంటారు. భోజనవసతి, రోజువారీ పనులు చక్కగా ఉంటాయి. మితభాషణ, ఓర్పు, స్నేహం ప్రదర్శించి తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు బాగా ఉంటాయి. గురువులను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

జూన్‌: కోర్టు వ్యవహారాల్లో సెటిల్‌మెంట్‌ ధోరణి చాలా లాభం. తరచుగా బుద్ధిమాంద్యానికి లోనవుతారు. వీలయినంత వరకు దూరప్రాంత ప్రయాణాలను విరమించడం శ్రేయస్కరం. పనులు వాయిదా వేసే లక్షణాలు విడనాడండి. భోజనం, స్నానం వంటి నిత్యకృత్యాలు కూడా కాలంతో సంబంధం లేకుండా ఉంటాయి.

జూలై: కుజుడు వ్యయంలో సంచారం ప్రారంభించారు. మూడు మాసాలు అనుకూలత తక్కువ. కలహాలు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. గురు, శుక్ర సంచారం బాగుంది. అందువలన తెలివితేటలు ప్రదర్శించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

ఆగస్టు: ఈ నెల నుంచి కుజస్తంభన, వృషభరాశిలో ఉండి ఇబ్బందికరంగా ఉంటుంది. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ధనవ్యయం అధికం అవుతుంది. పిల్లలతో మనస్పర్థలు ఎక్కువ అవుతాయి. ఈ నెల నుంచి ఆరోగ్యం, ఋణ విషయంలో జాగ్రత్తలు పాటించండి. మనశ్శాంతిగా ఉండడం కోసం ప్రత్యేక సాధన అవసరం.

సెప్టెంబర్‌: కుజుడు జన్మంలో సంచారం అనుకూలం కాదు. అయితే గురు శుక్ర బుధ గ్రహసంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందువలన ఎంతటి సమస్యలనైనా సులువుగా దాటవేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది.

అక్టోబర్‌: తరచుగా శుభవార్తలు వింటారు. 15వ తేదీ తరువాత కుజుడి మార్పు వల్ల మంచి మార్పులు కొన్ని ప్రారంభం అవుతాయి. ద్వితీయార్ధంలో రవి కుజుల సంచారం పూర్తిగా అనుకూలంగా ఉన్నందున వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 15వ తేదీ వరకు కుజుడు, తరువాత శుక్రుడు అనుకూలంగా లేనందున కుటుంబ విషయంలో జాగ్రత్తలు అవసరం.

నవంబర్‌: కోపం, ఆవేశం, మానసిక ఆందోళనలు జయించడానికి మెడిటేషన్‌ వంటి వాటిని ఆశ్రయించండి. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేక దృష్టి అవసరం. దూర ప్రాంత ప్రయాణాలను, ఒంటరి ప్రయాణాలను విరమించుకోవడం శ్రేయస్కరం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోరాదని సూచన.

డిసెంబర్‌: అన్ని కోణాల్లోనూ జాగ్రత్తలు అధికంగా పాటించాలి, ప్రధానంగా ఇతరుల విషయంలో కలగజేసుకోవద్దు. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే ప్రయత్నంలో సఫలం కాలేరు. ఫలితంగా కుటుంబ కలహాలు ఉంటాయి. వాహనాలు తరచుగా రిపేర్‌కు వస్తాయి. అవయవ ప్రతికూలతలు అధికంగా ఉంటాయి.

జనవరి: తెలివి, ఓర్పు ప్రదర్శించి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఋణం కావలసిన సమయానికి వెంటనే దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సానుకూలత ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఒత్తిడిని జయిస్తారు. చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.


ఫిబ్రవరి: జన్మకుజుడు వ్యయరాహువులు సహజంగా ఇబ్బంది కలుగచేసే గ్రహాలు. అయితే మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని విషయాల్లోనూ తెలివిగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఎలర్జీలు, ఎముకల సంబంధ సమస్యలు ఉన్నవారు కొంత ఇబ్బంది పడతారు. ఆదాయ వ్యయాలు, ఋణాలు సమతూకంగా వుండవు. జాగ్రత్త అవసరం.

మార్చి: ఏ పనీ సరిగా పూర్తి చేయలేరు. చాలా పనులు మొదలుపెడుతుంటారు. ఎవరి సహకారమూ అందదు. పని ఒత్తిడి పెరుగుతుంది. తరచు కోపావేశాలు ప్రదర్శిస్తారు. వృథాగా సంచారం చేస్తూ ఉంటారు. రోజువారీ పనుల్లో సైతం సంతుష్టి లేకుండా కాలం గడుపుతారు. సాంఘిక కార్యకలాపాలు అగౌరవం తెచ్చే అవకాశం ఉంది.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచానాకి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.
 ∙∙
 మిథున రాశి

ఆదాయం–11  వ్యయం–5  రాజయోగం–2 అవమానం–2
మృగశిర 3,4 పాదములు (కా, కి)
ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)
పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)
 

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (భాగ్యం)లోను తదుపరి మీనం (రాజ్యం)లోనూ సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మళ్లీ జూలై 12 నుంచి 2023 జూలై 17 వరకు మకరం (అష్టమం)లోనూ మిగిలిన కాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (వ్యయం) కేతువు వృశ్చికం (షష్ఠం)లోనూ తదుపరి రాహువు మేషం (లాభం) కేతువు, తుల (పంచమం)లోను సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (వ్యయం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా గ్రహచారం అనుకూలిస్తుంది. గత కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఈ కాలంలో సమయం వృథా చేయకుండా కృషి చేసేవారు సత్ఫలితాలు అందుకుంటారు. వృథా కాలక్షేపం చేసేవారికి ఈ గ్రహచారం ఎంతో కొంత జ్ఞానాన్ని అందిస్తుంది. చతుష్పాద జంతువులు, ఆటోమొబైల్‌ వ్యాపారములు వృత్తులలో వున్నవారు,

కులవృత్తిలో వున్నవారు ఈ సంవత్సరం చాలావరకు సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గాలను తెలుసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో గతంలో చేసిన పొరపాట్లు గుర్తించి, వాటిని సరిచేసుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అన్ని కోణాల్లోనూ పురోభివృద్ధి వైపు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఆనందంగా ఉంటారు. రోజువారీ పనులు చక్కగా పూర్తవుతాయి. భోజన వస్తు అలంకరణ విషయాలలో చాలావరకు సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. అన్ని సందర్భాల్లోనూ కుటుంబసభ్యులు ప్రోత్సాహం ఉంటుంది. భార్యాపుత్రుల విషయంలోను, కుటుంబంలోని పెద్దల అరోగ్య విషయంలోను అనుకూల స్థితి ఉంటుంది. బంధు సహకారం చాలా బాగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు.

వ్యాపారులకు సంవత్సరం అంతా పనివాళ్లతో ఇబ్బందులు ఉంటాయి. అయితే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. అధికారుల నుంచి సహకారం బాగా ఉంటుంది. అంతా అనుకూలమైన కాలమనే చెప్పాలి. ఆరోగ్యపరంగా గత సమస్యలకు మంచి వైద్యం లభిస్తుంది. అయితే ఎముకలు, చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారికి అనుకూలత తక్కువ. ఈ సంవత్సరం కొత్తకొత్త పరిచయాలు పెరుగుతాయి. ధర్మకార్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. గురు అనుగ్రహం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ఇబ్బందులు లేకుండా లాభదాయకంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగవంతమవుతాయి. స్నేహితులు, బంధువులు మంచి ప్రోత్సాహం ఇస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అంతా శుభసూచకమే. 

విద్యా నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలం. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు గురుబలం, రాహుబలం బాగా అనుకూలించి లాభం పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. మంచి సలహాలు సమయానికి అందుతాయి. గర్భిణిలు ఈ సంవత్సరం ఆగస్టు తరువాత ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి.

మృగశిర నక్షత్రం వారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. క్రమంగా కొన్ని సమస్యలు తీరుతున్నట్లుగా గోచరిస్తుంది. కానీ ఆగస్టు నుంచి 2023 జూన్‌ వరకు బహు జాగ్రత్తలు తీసుకుంటూ వుండవలసిన కాలం. ముఖ్యంగా వ్యవహార సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు వున్నాయి. వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్ళేందుకు సిద్ధపడండి. ఆరుద్ర నక్షత్రం వారికి అదృష్టం కలిసి వచ్చేలాగా కాలం గోచరిస్తోంది. అయితే అవరోధం లేకుండా ఏ పనీ పూర్తి అవ్వదు. తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అనే కోరికలు ఎక్కువ అవుతాయి. భార్యాపిల్లల ఆరోగ్యం, విద్య, వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. గత పొరపాట్లు ఇప్పుడు కనువిప్పునిస్తాయి.
పునర్వసు నక్షత్రం వారు అలంకరణ వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. సంతుష్టిగా భోజనం చేసే విషయంలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. తరచుగా పుణ్య కార్యాలు చేస్తుంటారు. చతుష్పాద జంతువుల పెంపకం మీద ఆసక్తి వున్నవారికి, పాడి పరిశ్రమలో వున్నవారికి లాభదాయకంగా వుంటుంది.

శాంతి : శనికి తరచుగా శాంతి చేయించడం. ఆగస్టు తరువాత కుజుడి శాంతి చేయించడం చాలా అవసరం. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ చేయడం ద్వారా తరచుగా శుభాలు జరుగుతాయి.

ఏప్రిల్‌: ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రతి పనీ శ్రమతో పూర్తవుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుజగ్రహ శాంతి అవసరం. ఆరోగ్య విషయంలో పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు అవసరం.

మే: అంతా శుభసూచకంగా ఉంటుంది. వాక్పటిమతో అన్ని పనులూ సాధిస్తారు. కొన్ని సందర్భాలలో అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. భార్యాపిల్లలు బాగా సహకరిస్తారు. కొత్త ఆలోచనలు ఈ నెలలో అమలులోకి వస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఋణ సౌకర్యం లభిస్తుంది.

జూన్‌: తెలివితేటలు బాగా ప్రదర్శించి కార్యజయం సాధిస్తారు. అయితే పనులన్నీ శ్రమతో మాత్రమే పూర్తవుతాయి. చివరి వారంలో అనవసర కలహాలు వస్తుంటాయి. తరచుగా ఈ నెలలో శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాకపోకలు సరదా కాలక్షేపాలతో కాలం గడుపుతారు. వాహన ప్రమాదం జరగకుండా చూసుకోండి.

జూలై: మంచి ధైర్యం ప్రదర్శిస్తారు. మొదటి రెండు వారాలు ప్రయాణాల్లో చికాకులు ఎదురవుతాయి. మొత్తం మీద నెల రోజులు అనుకూల కాలమే. అన్ని పనులూ చివరి రెండు వారాల్లో తేలికగా పూర్తవుతాయి. కుటుంబసభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. స్నేహపూర్వక ధోరణితో పనులు పూర్తి చేసుకుంటారు.

ఆగస్టు: ఇక్కడి నుంచి కుజుడు అధికకాలం యోగించని స్థానంలో సంచరిస్తారు. అయితే మిగిలిన గ్రహచారం అనుకూలత దృష్ట్యా పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ ఆరోగ్య ఋణ వ్యవహారాలు సమస్యలకు దారి తీయకుండా జాగ్రత్తలు పడాలి. రానున్న ఆరునెలలు వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్తపడండి.

సెప్టెంబర్‌: గతం కంటే కొంత మంచి మార్పులు ఈ నెలలో ద్వితీయార్ధంలో ఉంటాయి. అనవసర వ్యవహారాలను ముందుగా గుర్తించి, తగిన జాగ్రత్తలు పాటించి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యా విజ్ఞాన వినోద కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. నూతన వ్యవహారాలకు సానుకూలం కాదు.

అక్టోబర్‌: బుధ శుక్రులు అనుకూలం అయినా, కుజ శని సంచారం వలన ఈ నెలలో అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా స్నేహితులతో కలిసి ఏ వ్యవహారాలూ చేయకండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. అవకాశం చూసుకొని ఋణ విషయాల్లో సెటిల్‌మెంట్‌ ధోరణిని అవలంబించండి.
నవంబర్‌: కొద్దిరోజులు అనుకూలంగా కొద్ది రోజులు ప్రతికూలంగా ఫలితాలు ఉంటాయి. తరచుగా కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటారు. మీ ఉద్యోగ విధి నిర్వహణలో అధికారుల ఒత్తిడి పెరిగి క్రమంగా చివర్లో లాభిస్తుంది. పుణ్యకార్యాలపై దృష్టిపెడతారు.

డిసెంబర్‌: ఉద్యోగ విషయంలో ఎవరిమీదా ఆధారపడవద్దు. వ్యాపారస్తులు ధైర్యంగా ఉంటారు. కానీ సంతృప్తికరంగా వ్యాపారం చేసే అవకాశం లేదు. తరచుగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ధనం సర్దుబాటు కావడం కష్టమే. భోజనం వంటి రోజువారీ కార్యక్రమాలు సరిగా నడవక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

జనవరి: ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటించవలసిన కాలం. ఎవరి మీదా ఆధారపడకూడని కాలం. మీ వ్యవహారాలు మిత్ర భేదానికి, బంధు వైరానికి తావివ్వకుండా చూసుకోండి. చివరి వారంలో కుటుంబ సౌఖ్యం చేకూరుతుంది. వృత్తి సౌఖ్యం తక్కువ అనే చెప్పాలి.

ఫిబ్రవరి: ప్రధానంగా కుజ, రవి సంచారం ఫలితంగా 15వ తేదీలోగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో చికాకులు అధికంగా ఉంటాయి. తరువాత సాధారణ స్థాయిలో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక వనరులు బాగానే సమకూరతాయి. ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్త అవసరం.

మార్చి: ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి. అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రయాణాలు చేయండి. ప్రత్యేక ఇబ్బందులు ఉండవుగాని, జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. రోజువారీ కార్యక్రమాలు సైతం అకాలంలో పూర్తవుతాయి. వృత్తి విషయాలలో అందరితోనూ స్నేహంగా ఉండటం అలవరచుకోవాలి.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.

 కర్కాటక రాశి

ఆదాయం–5  వ్యయం–5  రాజయోగం–5  అవమానం–2

పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)
ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (అష్టమం)లోను తదుపరి మీనం (భాగ్యం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (సప్తమం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (లాభం) కేతువు వృశ్చికం (పంచమం)లోను తదుపరి రాహువు మేషం (దశమం), కేతువు, తుల (చతుర్థం)లోను సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (లాభం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ప్రతి వ్యవహారంలోనూ ఆలస్యం జరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అనుకూల స్థితిని అందుకోగలుగుతారు. కుటుంబసభ్యులు సహకారంగా ఉన్నా, వారికీ మీకు మధ్య అవగాహన లోపం వస్తూనే ఉంటుంది.

మిత్రులలోనూ బంధువులతోనూ కూడా కొన్ని సందర్భాలలో అనుకూలత, కొన్ని సందర్భాలలో ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. కుజస్తంభన ఈ రాశివారికి ఇబ్బందికరం కాదు. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. భోజనం, వస్త్రధారణ వంటి విషయాల్లో స్వేచ్ఛాప్రవర్తన కలిగి ఉంటారు. ఉల్లాసవంతంగా విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో కాలక్షేపం చేస్తారు. ఋణములు అవసరం ప్రకారం అందుకుంటారు. అదేరీతిగా మీరు తీర్చవలసిన ఋణములు కూడా అనుకూలమే. సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిరీత్యా వృద్ధి, గత సమస్యలు పరిష్కారమవుతాయి. సుఖ జీవనం సాగిస్తారు. వ్యాపారులకు పనివాళ్లతో సమస్యలు ఎదురవుతాయి. స్వయం నిర్ణయాలు, వ్యవహారాలు చేసే వ్యాపారులకు సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు.

ఉద్యోగులకు తోటివారితోనూ, కింద పనిచేసేవారితోనూ అనుకూలత తక్కువ. అధికారుల అండదండలతో అన్నివిధాలా మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. వాత, నాడీ, చర్మ సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. శని సంచార ప్రభావంతో చిన్న చిన్న సీజనల్‌ ఇబ్బందులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో గురువు మీనంలో సంచరించే కాలం అనుకూలం. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి మంచి సలహాలు, సహకారం లభిస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి కాలం. విద్య ఉద్యోగం రెండు అంశాలలోను కాలం అనుకూలం. షేర్‌ వ్యాపారులకు ఫైనాన్స్‌ వ్యాపారులకు గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ జాగ్రత్త అవసరం. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. అనవసర ఆందోళనలు పొందవద్దు. రైతులకు శ్రమ ఎక్కువ అయినా.. లాభదాయక ఫలితాలు ఉంటాయి. గర్భిణిలకు శని సంచారం అనుకూలం కాకున్నా, గురుబలం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.

పునర్వసు నక్షత్రం వారికి చాలా అద్భుతమైన వృత్తిలాభాలు అందుతాయి. సహజంగా అష్టమశని ప్రభావంగా ఇబ్బందులు రావాలిగాని, ఈ నక్షత్రం వారు ఇబ్బందులను దాటి చివరకు లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలు పూర్తి సానుకూలంగా సాగుతాయి.

పుష్యమి నక్షత్రం వారు ప్రతి అంశం బాగా ఆలోచించిన తర్వాతే ప్రారంభించాలి. విశేషం ఏమిటంటే ప్రయత్నించిన ప్రతి పనీ లాభదాయకంగా పూర్తి చేసుకుంటారు. కొన్నిసార్లు డబ్బునిల్వలు తగ్గి ఇబ్బంది పడతారు.

ఆశ్లేష నక్షత్రం వారు మానసిక ఒత్తిడి పొందుతారు. విశ్రాంతి కరువవుతుంది. పనులు పూర్తి చేసేలోపుగా కలçహాలు తలెత్తుతాయి. అయితే, చివరకు సత్ఫలితాలనే అందుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో అదుపు సాధించి,  గౌరవ మర్యాదలు అందుకుంటారు. గత సమస్యలు ఇంకా కొన్ని వుంటాయి.

శాంతి: శనికి శాంతి చేయించండి. రోజూ ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామి చుట్టూ రామనామం జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయడం ద్వారా శనిదోషం తగ్గి పనులు వేగం పుంజుకుంటాయి. ‘గౌరీశంకర’ రుద్రాక్ష ధరించండి.

ఏప్రిల్‌: ద్వితీయార్ధంలో శని కుజ శాంతి చేయించండి. ప్రతిపనీ ఆలస్యంగా పూర్తవుతుంది. కోపం నియంత్రించుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి విషయంలోనూ సమయపాలన చేయలేని స్థితి ఉంటుంది. ఋణ చికాకులు ఉంటాయి.

మే: బహు జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా జరగవు. ఈ నెల ద్వితీయార్ధం అనుకూలం. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం బాగుంటుంది. ఆర్థికంగా నెలాఖరులో అనుకూలం. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి.

జూన్‌: సరైన సమయానికి అన్నవస్త్రాలు కూడా సమకూరని స్థితి ఉంటుంది. ప్రతి విషయంలోనూ శ్రమ ఎక్కువ. వ్యవహార భయం వెంబడిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధనం వెసులుబాటు బాగుంటుంది. విద్యార్థులకు రైతులకు అనుకూలత తక్కువ.


జూలై: చక్కటి కాలం. అష్టమ శని, సప్తమ శని ఉన్నా, కుజ గురు శుక్రుల అనుకూలత వల్ల పనులు చక్కగా పూర్తవుతాయి. చివర్లో కొంచెం చికాకులు ఎదురైనా, మొత్తం మీద పనులు వేగంగా సానుకూలంగా పూర్తి కాగలవు. సమయం వృథా చేయకుండా ముందుకు వెళ్లండి. అనవసర ఆందోళనలు వద్దని సూచన.

ఆగస్టు: మనశ్శాంతిగా ఉంటారు. కోరికలకు తగిన విధంగా ప్రవర్తించుకునే అవకాశాలు ఉన్న కాలం. అన్నింటా విజయం సాధిస్తారు. ప్రత్యేకంగా గత సమస్యలకు ఈ నెలలో పరిష్కార మార్గాలు లభిస్తాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం.

సెప్టెంబర్‌: 15వ తేదీ వరకు తెలివి, ఓర్పు ప్రదర్శనతోనూ, ఆ తదుపరి ధైర్యంతోనూ పనులు సానుకూలం చేసుకుంటారు. సమస్యలను ముందుగా గుర్తిస్తారు. 15వ తేదీ తర్వాత కొత్త ప్రయోగాలు చేయకండి. వృత్తి విషయాలలో కిందివారి సహకారం సరిగా ఉండదు కాని, అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది.

అక్టోబర్‌: అవకాశం కోరిక ఉంటే స్థానచలన ప్రయత్నాలు ఈ నెల 15వ తేదీ నుంచి చేయండి. శని దోషంతో పాటు అనుకూలించే గ్రహాల ప్రభావం వల్ల ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా క్రమంగా కుటుంబ, ఆర్థిక సమస్యలు నెమ్మదిగా సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. శని కుజులకు ఈ నెలలో శాంతి అవసరం.

నవంబర్‌: 13వ తేదీ నుంచి పనులు వేగంగా సాగుతాయి. శనిదోషం ఉన్నప్పటికీ మిగిలిన గ్రహచారం అనుకూలంగా ఉన్నందున పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆసక్తికర అంశాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అంతా సానుకూల వాతావరణమే ఉంటుంది. మొత్తం మీద ఈ నెల అంతా మంచికాలమే.

డిసెంబర్‌: పనులు ఆలస్యమైనా, ఇబ్బంది లేకుండా సాగుతాయి. తెలివిగా ప్రతి పనిలోనూ లబ్ధి పొందుతారు. 15వ తేదీ నుంచి రవి అనుకూలత, నెలంతా కుజుడి అనుకూలత వల్ల ధైర్యంగా ఉంటారు. స్నేహితులతో జాగ్రత్తలు వహించాలి. ప్రయత్నం చేసినా ప్రతి పనిలోనూ ఏదో ఒక రూపంగా లాభమే ఉంటుంది.

జనవరి: పరిస్థితి ఎలా ఉన్నా, చాలా విషయాల్లో 15వ తేదీ వరకు బాగా ధైర్యంగా ఉంటారు. ఆ తర్వాత చిన్న చిన్న అధైర్య లక్షణాలు బయటపడతాయి. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఏ పనీ చేయవద్దు. ఎవరికీ ఏ విధమైన హామీలు ఇవ్వవద్దు. కొత్త ఋణాలు చేయవద్దు.

ఫిబ్రవరి: అంతా బాగున్నట్లు గోచరిస్తుంది కాని, ఏవో తెలియని సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. ఏ పని మీదా దృష్టి సారించలేరు. భోజన వస్త్రధారణ విషయాల్లో పరిస్థితులు మీ కోరికకు తగినట్లుగా ఉండవు. ఉద్యోగ భద్రతపై తెలియని భయం ఉంటుంది.

మార్చి: కోర్టు గొడవలు ఉన్నవారు చాలా విచిత్ర సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో ధన సమస్య ఎదురవుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు బాగా చికాకులు కలిగించేవిగా ఉంటాయి. అందరితోనూ విభేదాలు ఉంటాయి. వాహన అసౌకర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం.

మీ జాతకానికి ఈ గోచారం మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.

సింహ రాశి

ఆదాయం–8 వ్యయం–14  రాజయోగం–1  అవమానం–5
మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)
పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)
ఉత్తర 1వ పాదము (టే)

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (సప్తమం)లోను తదుపరి మీనం (అష్టమి)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (షష్ఠం)లోను మిగిలిన కాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (రాజ్యం) కేతువు వృశ్చికం (చతుర్థం)లోనూ తదుపరి రాహువు మేషం (భాగ్యం) కేతువు తుల (తృతీయం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (దశమం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా అనుకూల ప్రతికూల ఫలితాలు మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి. మకర శని సంచారం కుంభ గురు సంచార కాలం అనుకూలం. ఈ సంవత్సరం ఏ పని అయినా స్వయంగా చేసుకుంటే సానుకూలం. ఇతరుల మీద ఆధారపడితే ప్రతికూలం.

ప్రధానంగా ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోగలిగిన వారికి కాలం అనుకూలం. లేకుంటే, ఇబ్బందికరం. కావలసిన కొత్త ఋణాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో పాత ఋణాలు తీర్చే ప్రయత్నాలు ఇబ్బందికరంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు ప్రత్యేకంగా ఏమీ ఉండవుగాని, తెలియని అవగాహన లోపాలు వెంబడిస్తుంటాయి. ఏప్రిల్‌ నుంచి మూడు నెలల కాలంలో వస్తువులు చోరీకి గురవడం, అనుకోని భయం, తరచుగా దేశాంతరం వెళ్ళవలసి రావటం వంటివి ఉంటాయి. కొన్ని సందర్భాలలో మౌనం చాలా శుభప్రదంగా ఫలిస్తుంది. గృహనిర్మాణ, శుభకార్య ప్రయత్నాలకు మంచి సూచనలు, సలహాలు అందుతాయి.

చతుష్పాద జంతువుల ద్వారా చికాకులు రాగలవు. తరచుగా ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులను, ప్రభుత్వంలో పెద్దలను కలుసుకుంటారు. వ్యాపారాల్లో అనవసర పోటీలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమ ఒత్తిడి ఉంటుంది. అయినా, కాలం కలసివస్తుంది. ఉద్యోగులకు అధికారులతో పాటు తోటివారి సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ప్రమోషన్‌ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఆరోగ్య విషయంలో పెద్ద ఇబ్బందులు ఉండవుగాని, శని, గురువుల ప్రభావం వల్ల మే జూన్‌ నెలల్లో తరచుగా ఉష్ణప్రకోపానికి లోనవడం, పాత రుగ్మతలు పునరావృతం కావడం వంటివి ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలుకు మే, జూన్‌ మాసాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. మిత్రులు సహకరిస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు సునాయాసంగా సాధ్యపడతాయి. షేర్‌ వ్యాపారులకు ఫైనాన్స్‌ వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉన్నా, దూకుడుగా వ్యవహరించరాదు. విద్యార్థులకు శ్రమ చేసే కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి. పోటీ పరీక్షలలో రాణిస్తారు. రైతులకు మంచి ఫలితాలు దక్కుతాయి. గర్భిణీస్త్రీలు నిత్యం అనవసర ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.
మఘ నక్షత్రం వారికి హామీలు నిలబెట్టుకోలేని స్థితి వుంటుంది. ప్రయాణాల్లో చికాకులు, వాహనాల రిపేర్‌ల కారణంగా అధిక ఖర్చులు వుంటాయి. ప్రతిపనీ ఆలస్యమవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా, చివరకు కొంతలాభం పొందుతారు. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి.

పుబ్బ నక్షత్రం వారికి అంతా ఆలస్యమయంగా ఉంటుంది. ఈ నక్షత్ర గర్బిణిలు చాలా చికాకులు పొందే అవకాశం వుంటుంది. ఈ సంవత్సరం ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడే పనులు త్వరగా పూర్తి చేసి లాభాలు అందుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు చాలా తేలికగా సత్ఫలితాలనిస్తాయి.

ఉత్తరా నక్షత్రం వారికి తరచుగా విశ్రాంతి తీసుకోవాలనే కోరిక పెరుగుతుంది. అనవసర బాధ్యతలు పెరుగుతాయి. అందరికీ ఉపయోగపడే పనులు చేయడంలో ఎక్కువగా శ్రమిస్తారు. తరచుగా పూజ్యులను, పెద్దలను, ప్రభుత్వ పదవుల్లోని పెద్దలను దర్శించుకోవడం జరుగుతుంది.

శాంతి: నాలుగు ముఖాల రుద్రాక్ష ధరించడం ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది. మే మొదటివారంలో శని జపం చేయించండి. ప్రతిరోజూ ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి, లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ప్రశాంతత లభిస్తుంది.

ఏప్రిల్‌: ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఏ పని ప్రారంభించినా, పూర్తయ్యేదాకా చాలా దక్షతతో వ్యవహారిస్తారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యయాల మీద పట్టు సాధిస్తారు. ఆరోగ్య విషయమై శ్రద్ధ పెంచాలి. ద్వితీయార్ధంలో శనికి జపం చేయించండి. ఎవరి మీద ఆధారపడవద్దు.

మే: అన్ని అంశాల్లోనూ తెలియని అసంతృప్తి ఉంటుంది. పనులు వేగంగా సాగవు. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయ, వ్యయాలు నియంత్రణలో ఉండవు. బంధువుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. వృథా కాలక్షేపాలు, వృథా ప్రయాణాలు, వృథా ఖర్చులు ఉంటాయి. పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.

జూన్‌: పనులకు అవాంతరాలు అధికమవుతాయి. దేశాంతరం వెళ్ళాలనే కోరిక ఎక్కువ అవుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే ప్రకరణంలో అవమానాలకు అవకాశం ఉంది. స్థానచలన, ప్రమోషన్‌ ప్రయత్నాల్లో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల రాకపోకల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చూసుకోండి.

జూలై: చాలా అద్భుతమైన గోచారం అనే చెప్పాలి. సమయం వృథా చేయకుండా నడుచుకుంటే, అంతా ఆనందదాయకంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రధానంగా వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. 

ఆగస్టు: సమస్యలు ఉన్న పనులను వదిలేసి, సమస్యలు లేని పనులు చేయడం ద్వారా కొంత సుఖపడతారు. అయితే పని ఎగవేసే ధోరణి సరి కాదని గమనించుకోండి. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలి. పనిముట్ల వాడకం ఇబ్బందికరం. ప్రయాణ చికాకులు ఎక్కువ.

సెప్టెంబర్‌: పనుల ఎగవేత ధోరణిని విడనాడాలి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యం ఎదురైనా, ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి. ప్రతి విషయంలోనూ ధనవ్యయం అధికం అవుతుంది. సరైన సమయానికి డబ్బు వెసులుబాటు కాదు. అయితే ఋణ విషయాలు, ఖర్చులు, ఈ నెలలో కొంత చికాకు కలిగిస్తాయి.

అక్టోబర్‌ : ప్రారంభంలో కొన్ని ఇబ్బందులున్నా క్రమంగా అన్నీ తీరిపోయి మంచి ఫలితాలు వస్తాయి. 15వ తేదీ తరువాత వృత్తి సౌఖ్యం చాలా బాగుంటుంది. చాలా తెలివి ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాలలో చికాకులను క్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ నెలలో స్నేహితులు బంధువుల సహకారం బాగుంటుంది.

నవంబర్‌: మాసారంభం నుంచి చక్కటి ఫలితాలు ఉంటాయి. అన్ని గ్రహాలు ఈ నెలలో అనుకూలిస్తాయి. శుభకార్యాలు త్వరగా నెరవేరుతాయి. ఉద్యోగ భద్రత బాగుంటుంది. అందరూ బాగా సహకరిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. గురువులను, పూజ్యులను దర్శించుకుంటారు. ప్రశాంతంగా కాలం గడిచిపోతుంది.

డిసెంబర్‌: చాలా చక్కటి కాలం.  అన్ని పనులూ చక్కగా పూర్తయి, ఆనందంగా ఉంటారు. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. ఖర్చులను నియంత్రించగలుగుతారు. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. గత ఆరోగ్య సమస్యలకు ఈ నెలలో వైద్య సహాయం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను, గురువులను దర్శించుకుంటారు.

జనవరి: వృత్తి విషయాల్లో ఒత్తిడి, కార్యాలస్యం వుంటాయి. అయినా ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ప్రధానంగా ఈ నెలలో కుటుంబ సమస్యల మీద దృష్టి ఉంచండి. డబ్బు వెసులుబాటు కొంత ఇబ్బందికరమే అయినా, తెలివిగా ఖర్చులను సానుకూలం చేయగలుగుతారు. ప్రశాంతంగా ఉంటారు.

ఫిబ్రవరి: అన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మితభాషణ, ఓర్పు చాలా అవసరం. కలహాలు రాకుండా మాటతీరు సరిచూసుకోవాలి. అవమానకర ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకండి. మీ పనులు మీరు స్వయంగా చేసుకునేటట్లయితే కొంతవరకు సమస్యలు దూరమవుతాయి.

మార్చి: ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. అయినా ధైర్యంగా ఉంటారు. వృత్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. రవి సంచారం అనుకూలం లేకపోవడం, గురు, శని సంచారం కూడా సరిగా లేని కారణంగా అన్ని అంశాల్లోనూ ఓర్పుతో మెలగవలసిన అవసరం ఉంది.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.
 

కన్యా రాశి

ఆదాయం–11  వ్యయం–5  రాజయోగం–4  అవమానం–5
ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)
హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)
చిత్త 1,2 పాదములు (పే, పో)

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (షష్ఠం)లోను తదుపరి మీనం (సప్తమం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (పంచమి)లోను మిగిలిన కాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (భాగ్యం) కేతువు వృశ్చికం (తృతీయం)లోను తదుపరి రాహువు మేషం (అష్టమం), కేతువు తుల (ద్వితీయం)లోను సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (భాగ్యం)లో స్తంభన. ఈ గోచార ప్రభావం వల్ల ఏప్రిల్‌ నుంచి అనవసర భయాందోళనలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కావలసిన పనులు చేయడం కంటే అనవసర వ్యవహారాలపై దృష్టి పెంచడం వల్ల అవమానాలు ఎదురవుతాయి. కింది ఉద్యోగులు, పనివారి వల్ల చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. గురువు మీన సంచారం ప్రారంభమైనప్పటి నుంచి కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మేలు చేసినా, మీకు కీడు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి.

రోజువారీ విషయాలలో అన్న వస్త్రాల విషయంలో కూడా పరిస్థితులు అసంతృప్తికరంగా ఉంటాయి. సమయపాలన లేక రోజువారీ పనుల్లోనూ చికాకులు పెరుగుతాయి. స్థానచలన ప్రయత్నాలను స్వయంగా చేసుకోకపోతే అనుకూలత లేని చోటుకు చేరుకోవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సామరస్య ధోరణిని అవలంబించి సానుకూలత సాధిస్తారు. ఋణసౌకర్యం ఏప్రిల్‌ నుంచి నాలుగు నెలలకాలం అనుకూలం. అయితే దూరప్రయాణాలు చేయవద్దని ప్రత్యేక సూచన. గత సంవత్సరం కంటే కొన్ని అంశాలలో మంచి ఫలితాలు అందుతాయి.

పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేసుకోవచ్చు గాని, చేస్తున్న వ్యాపారం మానడం, మారడం వద్దు. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమకు తగిన ఫలితాలు ఉండవు. అయినా ఓర్పుగా ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఉద్యోగులు సమయానికి తగిన విధంగా ప్రవర్తించలేక ఒత్తిడికి లోనవుతారు. అధికారులతో తరచు ఇబ్బందులు వస్తాయి. అయినా నష్టం లేకుండా వీలయినంతవరకు లాభసాటిగానే ఉంటారు. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు. అయితే ఏదో అనారోగ్యం ఉందేమోననే భావనతో అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబసభ్యుల కోసం కూడా అనవసర అపోహలతోనే వైద్య ఖర్చులు ఎక్కువవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లలో మే నెల తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి అన్ని అంశాల్లోనూ అవరో«ధాలు ఎక్కువగా ఉంటాయి. అయినా కార్యసాఫల్యం ఉంది. విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి, సానుకూలంగా ఉంటుంది. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు అనవసర చికాకులు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి. రైతులకు సొంత నిర్ణయాలతో చేసే వ్యవసాయం లాభాన్ని ఇస్తుంది. ఇతరుల సలహాలు వద్దు. గర్భిణీస్త్రీలు ఏప్రిల్‌ నుంచి రాహు ప్రభావం వల్ల ఒత్తిడికి లోనవుతారు. జాగ్రత్తలు పాటించాలి.


ఉత్తరా నక్షత్రం వారికి కాలం బాగా అనుకూలిస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ విషయంలో చాలా విశేషంగా దృష్టి కేంద్రీకరించి, బంధుమిత్రులకు దగ్గరవుతారు. వృత్తిపరంగా ప్రశాంతతను పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.

హస్త నక్షత్రం వారు ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. మీ పనుల్లో సహాయం కోసం ఎవరినీ అర్థించవద్దు. వ్యక్తిగత విషయాల్లో గోప్యత మీకు చాలా శ్రేయస్కరం. గతంలో చేసిన పొరపాట్లు తరచు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబంలో గౌరవానికి భంగం కలుగుతుంది.

చిత్త నక్షత్రం వారు అన్నవస్త్రాలు కూడా సరిగా అమర్చుకోలేనంతగా పనుల్లో తలమునకలై వుంటారు. భయం, అగౌరవం, శ్రమకు తగిన లాభం లేకపోవడం నిరాశ కలిగిస్తాయి. మితిమీరిన పని తప్పించుకోవడం కుదరక సతమతమవుతారు. గతం కంటే పరిస్థితి బాగుంటుంది.

శాంతి: గురువుకు శాంతి చేయించండి. ఏప్రిల్‌ 15వ తేదీ తరువాత రాహువుకు జపం చేయించండి. రోజూ ఉదయం ఎర్రటి పుష్పాలతో జగదాంబను అర్చించి, ఆ తర్వాతే రోజువారీ పనులు ప్రారంభించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి.

ఏప్రిల్‌: ఒక విచిత్రమైన అద్భుత మాసం ఇది. మంచి మార్పులు ప్రారంభమవుతాయి. అయితే అన్నీ లాభదాయకంగా ఉండవు. ఆర్థిక లావాదేవీలు క్రమంగా మెరుగుపడతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. గురు రాహువులకు శాంతి చేయించండి.

మే: అనుకూల ప్రతికూలతలు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేని స్థితి. అయినా ధైర్యంగా ఉంటారు. ఇతరుల విషయాలలో కలగజేసుకోవద్దు. కోర్టు వ్యవహారాలు, ఇతరుల వ్యవహారాలు ఇబ్బందులు కలిగిస్తాయి.. మితభాషణ అవసరం. షేర్‌ వ్యాపారులకు అనుకూలత తక్కువ. అందరితోనూ ఆచితూచి జాగ్రత్తగా ఉండటం అవసరం.

జూన్‌: రోజువారీ పనుల్లోనూ చికాకులు ఎదురవుతాయి. తరచుగా చెడు వార్తలు వింటారు. భోజన అసౌకర్యం తరచుగా ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బందికరమైన కాలం. కుటుంబ కలçహాలు రాకుండా జాగ్రత్తపడండి. ఖర్చులను నియంత్రించుకోవడం భవిష్యత్తుకు మంచిది. ప్రయాణాలు తగ్గించుకోండి.

జూలై: నెల ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉంటుంది. క్రమంగా అన్ని సమస్యలనూ చక్కదిద్దుకుంటారు. 15వ తేదీ నుంచి కొంత ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అష్టమ కుజుడి ప్రభావం ఇబ్బందికరం. కుటుంబంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఆర్థిక వెసులుబాటు ఏర్పడుతుంది. అవసరానికి కావలసిన ఋణాలు సాధిస్తారు.

ఆగస్టు: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగుంటాయి. ప్రతి పని బాగా ఆలోచించి చేస్తారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. కొన్ని పెద్ద సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు.

సెప్టెంబర్‌: ఎంత తెలివి, ధైర్యం ప్రదర్శించినా 15వ తేదీ వరకు వ్యవహార సానుకూలత తక్కువనే చెప్పాలి. 15వ తేదీ తరువాత పనులు వేగం పుంజుకుంటాయి. ఆహార విహారాల్లోను, అధికారులతో జరిపే సంభాషణల్లోను జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు నియంత్రించలేరు. దూర∙ప్రయాణాలు తగ్గించుకోండి.

అక్టోబర్‌: చిన్న చిన్న చికాకులు మినహా మిగిలిన అన్ని అంశాలూ అనుకూలం. ఈ నెలలో కేవలం రవి సంచారం అనుకూలత తక్కువ. ధన ఋణ కుటుంబ అంశాలు అనుకూలం. అన్ని పనుల్లోనూ ప్రయత్నాలు ప్రారంభించగానే శుభ సూచనలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కాలం అనుకూలం.

నవంబర్‌: కొత్త కొత్త ప్రయోగాలు తలపెట్టవద్దు. అలంకరణ వస్తువుల విషయంలో ధనవ్యయం ఎక్కువవుతుంది. అందరినీ గౌరవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సాంఘిక కార్యకలాపాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. పుణ్యకార్యాలపై దృష్టి సారిస్తారు.
డిసెంబర్‌: చాలా మంచి కాలమనే చెప్పాలి. అనుకోకుండా పనిలో శ్రమ తొలగుతుంది. చాలా విషయాల్లో సానుకూలత ఉంటుంది. దైవబలంతో విజయపరంపర బాగా సాగుతుంది. అందరూ బాగా సహకరిస్తారు. గౌరవిస్తారు. తరచుగా శుభకార్య పుణ్యకార్యాల్లోను, విజ్ఞాన వినోద కార్యక్రమాల్లోను పాల్గొంటారు.

జనవరి: చివరి వారంలో చికాకు పడతారు కాని, 22వ తేదీ వరకు అంతటా విజయం సాధిస్తూ ముందుకు వెడతారు. రోజువారీ పనుల్లో ఏ సమస్యలూ ఉండవు. చివరి వారంలో స్నేహితులతో జాగ్రత్తలు పాటించాలి. ఇబ్బందికర పరిస్థితులను ముందుగానే గుర్తించి, వాటిని దాటవేస్తారు. \

ఫిబ్రవరి: శుక్ర సంచారం సరిగాలేదు. కుటుంబ విషయంలో చికాకులు రాగలవు. ఆర్థిక వెసలుబాటు బాగానే ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఖర్చులు పెరిగినా, తగిన ఆదాయం, ఋణసౌకర్యం చేకూరుతాయి. విద్యా ప్రదర్శన, విజ్ఞాన ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ధన ధాన్యలాభం చేకూరుతుంది.

మార్చి: సర్వసాధారణంగా రోజువారీ కార్యములు చక్కగానే చేస్తుంటారు. అయితే ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నష్టములు ఉండవు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయగలరుగాని, పనులు పూర్తయ్యేంత వరకు మానసికంగా చికాకులు పొందుతారు. ఆర్థిక వెసులుబాటు అనుకూలం. ఋణ సదుపాయము అనుకూలం.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.

తులా రాశి
ఆదాయం–8  వ్యయం–8  రాజయోగం–7  అవమానం–1

చిత్త 3,4 పాదములు (రా, రి)
స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)
విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)

గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (పంచమం)లోనూ తదుపరి మీనం (షష్ఠం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (చతుర్థం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (అష్టమం), కేతువు వృశ్చికం (ద్వితీయం)లోను తదుపరి రాహువు మేషం (సప్తమం) కేతువు తుల (జన్మం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (అష్టమం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా గురువు శని కొంతకాలం అనుకూలించడం రాహుకేతువులు సంవత్సరం అంతా అనుకూలింపకపోవడం వల్ల చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ఎవరినీ నమ్మవద్దు. ఎవరి మీదా ఆధారపడి ఏ పనీ మొదలు పెట్టవద్దు. తరచుగా మోసపూరిత వాతావరణం మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. గురువు కుంభంలో ఉండగా ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. జూన్‌ నుంచి కుజుడు ప్రతికూలించడం. గురువు మీనంలో సంచారం చేసేకాలంలో ఆర్థిక వెసులుబాటు సరిగా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఋణాలు తీర్చే ప్రయత్నంలో చికాకులు రాగలవు. అవసరానికి కొత్త ఋణాలు అందక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులు ఎప్పుడు సహకరిస్తారో ఎప్పుడు నిరాకరిస్తారో తెలియని స్థితి. పిల్లల అభివృద్ధి విషయమై అనుకూల వార్తలు అందవు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రతలు పాటించడం శ్రేయస్కరం. ప్రమోషన్, స్థానచలనం వంటి అంశాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది. చేస్తున్న వ్యాపారం మానేసి, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలం కాదు. 

వ్యాపారులకు సంవత్సరం అంతా అనవసర ఆలోచనలు కలిగినా, చివరకు లాభదాయకంగానే ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారిని ఇతరులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా అన్ని పనులు చేసుకుంటే మంచిది. ఆహార విహారాల్లో నియమాలు పాటించక, ముందు జాగ్రత్తలు తీసుకోక ఆరోగ్య సమస్యలుకొని తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం అంతా విచిత్రమైన అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి కొనుగోలులో ఎవరి సలహాలూ తీసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అంత తేలిగా సాగవు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరైన మార్గంలో సాగవు. షేర్‌ వ్యాపారులకు ఫైనాన్స్‌ వ్యాపారులకు మోసం చేసేవారు ఎక్కువసార్లు ఎదురవుతారు. విద్యార్థులకు గురువు మీనంలో ఉండగా అనుకూలత తక్కువ. ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. రైతులు తొందరపాటుగా ఎవరి సలహాలు తీసుకోవద్దని, అనవసరంగా ఋణాలు చేయవద్దని సూచన. గర్భిణిలు నిత్యం ‘శ్రీమాత్రే నమః’ నామాన్ని జపిస్తూ ఉండండి. రాహు కేతువుల అనుకూలత తక్కువగా ఉన్నది.

చిత్తా నక్షత్రం వారికి సంబంధం లేని అంశాలలో కూడా దోషిగా విచారణ ఎదుర్కోవలసిన పరిస్థితులు తరచుగా ఎదురవుతాయి. మానసిక స్థితి బలహీనమవుతుంది. దురలవాట్లు వున్నవారు ప్రమాదాలలో పడే అవకాశం వుంది. అవివాహితులు వివాహ ప్రయత్నం చేయకుండా వుంటేనే మంచిది.

స్వాతీ నక్షత్రం వారికి తరచుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా నిబ్బరంగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించుకుంటారు. అలంకరణ వస్తువులు, గృహాలంకరణ వస్తువుల కొనుగోలు కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా వుంటాయి.

విశాఖ నక్షత్రం వారు ధనసంబంధ లావాదేవీలను సరిగా నిర్వహించక ఇబ్బందుల్లో పడతారు. చేయవలసిన ముఖ్యమైన పనులు వదిలేసి, ఇతర పనులు వెంటపడి సమస్యలను కొని తెచ్చుకుంటారు. బుద్ధిస్థిరత్వం లేకుండా ప్రవర్తించి సమస్యలను పెంచుకుంటారు.

శాంతి: రోజూ తెల్లటి పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి రాహు కేతు గురువులకు శాంతి చేయించండి. తెల్ల జిల్లేడు, గరిక, మారేడుపత్రితో గణపతి దేవాలయంలో నిత్యం అర్చన చేయించండి. తొమ్మిది ముఖా రుద్రాక్షధారణ విశేషం.

ఏప్రిల్‌: పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. ఈ నెల వృత్తిరీత్యా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. శుభ కార్యాల్లో శుభవార్తలు వింటారు. పుణ్యకార్యాల్లో పొల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. రాహు, కేతు గ్రహశాంతి చేయించండి. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య అనుకూలత ఉంటాయి. ప్రమోషన్‌ అవకాశం ఉంది.

మే: ఓర్పుగా వ్యవహరించండి. ఇబ్బందులు ఉండవు కాని, తొందరపాటును విడనాడాల్సిన కాలం. చివరివారంలో ఆదాయం ఇబ్బందికరంగా ఉంటుంది. రోజువారీ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు 23వ తేదీ నుంచి ఒత్తిడి కల…

వృశ్చిక రాశి
ఆదాయం–14  వ్యయం–14  రాజయోగం–3 అవమానం–1
విశాఖ 4 వ పాదము (తొ)
అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)
జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (చతుర్థం)లోను తదుపరి మీనం (పంచమం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (తృతీయం)లోనూ మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (సప్తమం), కేతువు వృశ్చికం (జన్మం)లోను తదుపరి రాహువు మేషం (షష్ఠం), కేతువు తుల (వ్యయం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (సప్తమం)లో స్తంభన. కుజస్తంభన వల్ల ఆగస్టు నుంచి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇది మినహా మిగిలిన గ్రహాలన్నీ చాలా యోగ్యంగా ఉంటాయి. గురువు సంచారం అనుకూలత దృష్ట్యా ఆర్థిక విషయాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

ఆదాయం కావలసిన రీతిగా అందడం, శుభకార్యాలు, ధర్మకార్యాలకు చక్కగా వెచ్చించడం, సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకోవడం వంటివి జరుగుతాయి. గతంలో చాలాకాలంగా ఉన్న సమస్యలు ఎటువంటివైనా ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నిస్తే అనుకూలం అవుతాయి. భవిష్యత్తులో చేయాలనుకునే పెద్ద ప్రాజెక్ట్‌లకు ఈ సంవత్సరమే శ్రీకారం చుట్టడం శుభదాయకం. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి బాగా అనుకూలం. ఋణ సంబంధ విషయాలలో మంచి అనుకూల స్థితి ఉంటుంది. కుటుంబ విషయంలో అందరి నుంచి అనుకూల పరిస్థితి ఉంటుంది. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కాలం అనుకూలం. వృత్తిరీత్యా స్థాయి గౌరవము పెరుగుతాయి. మీరు ఇతరులకు బాగా సçహాయం చేసే అవకాశం ఉంటుంది. తరచుగా శుభవార్తలు వింటారు. వ్యాపార విషయంగా స్థానమార్పు కోరుకునేవారికి ప్రస్తుతం కాలం బాగా అనుకూలిస్తుంది. వ్యాపారులకు సంవత్సరం అంతా చక్కటి వ్యాపారం జరిగి మంచి ఫలితాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు అన్ని కోణాల్లోనూ సానుకూల స్థితి ఉంటుంది. అందరూ బాగా సహకరిస్తారు.

ఆశించిన రీతిలో ఫలితాలు ఉండటంలో ధైర్యంగా ముందుకు వెడతారు. ఆగస్టు తరువాత కొంచెం జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు. ఆగస్టు నుంచి ఏదో తెలియని మానసిక శారీరక బాధలు ఉన్నాయనే భావనతో చికాకులకు లోనవుతారు. ఈ సంవత్సరం గత సమస్యలకు కూడా పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయి. మెరుగైన వైద్య సలహాలు అందుకుంటారు. తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో కార్యసిద్ధి. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి ఊహాతీతంగా కాలం అనుకూలిస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలుంటాయి. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా లాభాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి. మంచి గౌరవం వచ్చేలాగా విద్యా వ్యాసంగం సాగుతుంది. రైతులకు అన్ని కోణాల్లోనూ సహాయ సహకారాలు అందుతాయి. తద్వారా మంచి వ్యవసాయ ఫలితాలు ఉంటాయి. గర్భిణిలు సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు. ఆగస్టు 10 తరువాత చిన్న చిన్న చికాకులు ఉంటాయి.

విశాఖ నక్షత్రం వారికి విద్యా వ్యాసంగంలో మంచి ఫలితాలు వుంటాయి. భార్యా భర్తల నడుమ మనస్పర్థలు తొలగి అన్యోన్యత ఏర్పడుతుంది. అయితే ఆగస్టు నుంచి కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు. ఆరోగ్య, ఋణ విషయాల్లో ఆగస్టు నుంచి జాగ్రత్తలు అవసరం.

అనురాధ నక్షత్రం వారికి ఈ ఏడాది ప్రశాంతత కలుగుతుంది. ఎప్పటినుంచో ఉన్న చికాకులకు ఈ సంవత్సరం పరిష్కారాలు లభిస్తాయి. ఆగస్టు లోపు ప్రయత్నిస్తే మొండి బాకీలు వసూలవుతాయి. ఆగస్టు తర్వాత ఏ విధమైన వ్యవహారాలూ వుండకుండా చూసుకోండి.

జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభ పరిణామాలు ఎక్కువ ఉంటాయి. అయితే అనారోగ్యవంతులయిన ఈ నక్షత్రం వారు ఆగస్టు నుంచి తరచుగా ఇబ్బందులు పడే అవకాశముంది. అందువల్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. మీ విషయాలు గోప్యంగా వుంచకుండా కుటుంబ సభ్యులతో పంచుకోండి. 

శాంతి: ప్రత్యేకంగా ఆగస్టు 10 తరువాత కుజుడికి శాంతి చేయించండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, ఆరు ముఖాల రుద్రాక్షధారణ చేయడం శ్రేయస్కరం.

ఏప్రిల్‌: మీరు స్వయంగా ప్రయత్నిస్తే, చాలాకాలంగా ఉన్న సమస్యలకు ఈ నెలలో పరిష్కారాలు దొరుకుతాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి. ఋణ ప్రయత్నాలు సానుకూలం. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా, ఫలితాలు మాత్రం అనుకూలం. రోజువారీ పనులు, వృత్తి వ్యవహారాలు ఇబ్బంది లేకుండా సాగుతాయి.

మే: ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. ప్రయత్నాలన్నీ సానుకూలం అవుతాయి. ఇతరుల సహాయ సహకారాలు లేకున్నా, విజయం సాధిస్తారు. కుటుంబసభ్యుల అవసరాలు తీర్చడంలో  కృతకృత్యులవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో మంచి పరిస్థితి ఉంటుంది.

జూన్‌: కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. పెద్దల ఆరోగ్య విషయంలోకాని, పిల్లల అభివృద్ధిలోకాని అనుకూలత తక్కువ. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూరప్రయాణాలు చేయవద్దని సూచన.

జూలై: కొన్ని అంశాలు అనుకూలం, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. చాలా వరకు మంచి ఫలితాలే ఉంటాయి. మీ సంబంధీకుల ఇళ్లలో నిశ్చయమైన శుభకార్యాలు మీకు ఆనందం కలిగిస్తాయి. అంతటా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం విశేషం.

ఆగస్టు: కుజుడు వృషభ మిథున రాశులలో సంచారం చేస్తూ అనుకూలించని స్థితి. రానున్న కాలంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. తరచుగా కుజ గ్రహ శాంతి చేయించండి. రాబోయే కాలంలో మీ జాతకానికి, ఈ కుజ సంచారానికి అనుబంధంగా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి జాతక శోధన చేయించుకోండి.

సెప్టెంబర్‌: కుజుడు మినహా మిగిలిన గ్రహాల అనుకూలత దృష్ట్యా ఇది చాలా మంచి కాలం అనే చెప్పాలి. తెలివిగా ప్రవర్తిస్తారు. మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. గత సమస్యల పరిష్కారానికి వెదుకులాట ఈ నెల ఫలిస్తుంది. పెంపుడు జంతువులతో ఇబ్బంది ఎదురవుతుంది.
అక్టోబర్‌: వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి. అలాగే వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా 15వ తేదీ నుంచి జాగ్రత్తపడాలి. మిగిలినకాలం మిగిలిన అన్ని అంశాలూ సానుకూలంగానే ఉంటాయి. ఇతరుల వ్యవహారాలపై దృష్టి పెట్టకండి. నెలాఖరులో ఆరోగ్యపరంగా చికాకులు ఉంటాయి.

నవంబర్‌: శని గురు రాహువుల అనుకూల సంచారం, మిగిలిన గ్రహాల ప్రతికూల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలలో తోటివారి సహకారం, సిబ్బంది సహకారం తగ్గుతుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాల నిమిత్తం తరచు ప్రయాణాలు చేస్తుంటారు.

డిసెంబర్‌: చాలా విచిత్రమైన కాలం. ఎప్పుడు యోగ్యంగా ఉంటుందో, ఎప్పుడు చికాకుగా ఉంటుందో చెప్పలేని కాలం. అయితే శుక్ర సంచారం అనుకూలత వల్ల చాలా వరకు కుటుంబ వ్యవహారాల్లో అనుకూల స్థితిని పొందుతారు. బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. అధికారుల ఒత్తిడి తప్పదు. ప్రతి విషయంలోనూ అధిక దనవ్యయం జరుగుతుంది.

జనవరి: శుభాశుభ పరిణామములు ఎక్కువ అనే చెప్పాలి. ఈ నెల 22 వరకు కొత్త ప్రయోగాలు చేయవద్దు. ధైర్యం విడనాడకుండా ముందుకు వెడతారు. దానధర్మాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. శ్రమ ఎక్కువ అవుతుంది. కానీ చివరకు లాభం ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది.

ఫిబ్రవరి: రోజూ ఏదో ఒక కొత్త వ్యవహారం మీద ఆలోచనలు చేస్తారు. అన్ని అంశాల్లోనూ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. ఖర్చులు అదే రీతిగా ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఆరోగ్య భద్రత కోసం ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అధికారులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
మార్చి: సహజంగా అష్టమ కుజుడు ఇబ్బందులు కలిగించే గ్రహం. అయితే మిగిలిన గ్రహాల అనుకూలతల వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగ భద్రత బాగుంటుంది. వ్యాపారులు మంచి వ్యాపారం చేయగలుగుతారు. సిబ్బంది బాగా సహకరిస్తారు.

మీ జాతకానికి ఈ గోచారానికి మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.

ధనూ రాశి

ఆదాయం–2 వ్యయం–8 రాజయోగం–6  అవమానం–1
మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)
పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)
ఉత్తరాషాఢ 1వ పాదము (బే)

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (తృతీయం)లోను తదుపరి మీనం (చతుర్థం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (ద్వితీయం)లోను మిగిలిన కాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (షష్ఠం) కేతువు వృశ్చికం (వ్యయం)లోను తదుపరి రాహువు మేషం (పంచమం) కేతువు తుల (లాభం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (షష్ఠం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా చాలావరకు గ్రహానుగ్రహం బాగుందనే చెప్పాలి. మంచి పనులు చేసే అవకాశం చాలాసార్లు వస్తుంది. మీరు సద్వినియోగం చేసుకుంటారు. సంవత్సరంలో ఎక్కువకాలం కుజుడు అనుకూలిస్తున్న కారణంగా మనోబలంతో విజయాలను అందుకుంటారు. శ్రమ ఎక్కువ అయినా, ప్రతి ప్రయత్నంలోనూ లాభాలు ఎక్కువగా వస్తాయి. ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదు.

మీరు చేసే శుభకార్య ప్రయత్నాలు నిరాటంకంగా సాగుతాయి. తరచుగా శరీరం సొంపును గాంభీర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సానుకూలమే. ఋణ సంబంధమైన అంశాలలో మీరు నిబద్ధతతో సంచరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. కుటుంబసభ్యుల సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి విషయంలో మంచి వార్తలు వింటారు. తరచు విందు వినోదాలు, శుభ, పుణ్యకార్యాల్లో కాలక్షేపం చేశారు. స్వేచ్ఛగా సంచరిస్తారు. కొన్నిసార్లు రోజువారీ పనులు కూడా ఆలస్యమవుతాయి. గురువులను దర్శించుకుంటారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ప్రయోగాలు చేయడానికి వచ్చే మంచి అవకాశాలలను వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటారు.

వ్యాపారులకు క్రమంగా సమస్యలు తగ్గుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో లాభపడతారు. ఉద్యోగులకు రోజురోజుకు శుభపరిణామాలు ఉంటాయి. గత సమస్యలు తీరతాయి. చక్కగా విధి నిర్వహణ చేస్తారు. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో ఉన్న మొండి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యవంతులైన ఈ రాశివారు ముందు జాగ్రత్తలు పాటించి సమస్యలు పెరగకుండా సుఖజీవనం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు పనులు వేగవంతమవుతాయి. కావలసిన వనరులు చేకూరుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగంగా పూర్తవుతాయి. శ్రమ తక్కువ ఫలితం పూర్తి సానుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి  అన్ని కోణాల్లో మంచి సహకారం అంది కార్యజయం కలుగుతుంది. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు బహు సుఖవంతమైన కాలము. ఒత్తిడి లేకుండా వ్యాపారం చేస్తారు. విద్యార్థులకు అంతటా విజయమే. పోటీ పరీక్షలలో కూడా శుభపరిణామాలు ఉంటాయి.  రైతులకు విజయపరంపరగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గర్భిణిలు మంచిఫలితాలను అందుకుంటారు. 

మూల నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు విశేషంగా లాభిస్తాయి. అయితే పుత్రవైరం పెరిగే అవకాశం వుంటుంది. తరుచుగా మీ కులాచార ఉత్సవాలు నిమిత్తంగా బంధుమిత్రులను కలుసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యవసాయం బాగా లభిస్తుంది.

పూర్వాషాఢ నక్షత్రం వారికి భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు పెరుగుతాయి. అవసరానికి డబ్బు సర్దుబాటు కాని పరిస్థితి ఎదురవుతుంది. ప్రతి విషయంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. విందు వినోదాలు పుణ్యక్షేత్ర సందర్శనల నిమిత్తంగా ప్రయాణాలు, ధనవ్యయం తప్పవు.

ఉత్తరాషాఢ నక్షత్ర ఉద్యోగులకు ఉన్నతస్థితి వుంటుంది. అధికారులు ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తారు. తరచు చురుకుగా తెలివితేటలు ప్రదర్శిస్తారు. చేసే ప్రయత్నాలన్నీ అనుకున్న దానికంటే ముందుగానే పూర్తవుతాయి. చాలా మంచి కాలం.

శాంతి: అంతా సుఖవంతమే అయినా పంచముఖ రుద్రాక్ష ధరించడం ద్వారా పనులు మరింత వేగవంతమవుతాయి. రోజూ విçష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ఏప్రిల్‌: ఏలినాటి శని పూర్తవుతుంది. ఈ నెలలో కొన్ని పనులు వేగంగా పూర్తయి ఆనందంగా ఉంటారు. కొత్త వ్యవహారాలపై దృష్టి వుంచవద్దు. ఆరోగ్యం అనుకూలం. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. ప్రతి పనీ స్వబుద్ధితో సానుకూలం చేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది.

మే: కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన. ఆరోగ్యం బాగుంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఋణ సమస్యలు తీరతాయి. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య పుణ్యకార్యాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు.

జూన్‌: సమస్యాకాలంలో కూడా తెలివిగా ప్రవర్తించి, లాభదాయక ఫలితాలు పొందుతారు. ఈ నెల అంతా ప్రతి పనిలోనూ ఖర్చులు ఎక్కువవుతాయి. రోజు రోజుకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సిబ్బంది సమస్య బాగా పెరుగుతుంది. ప్రత్యేకంగా పూర్వాషాఢ నక్షత్రం వారు అధిక జాగ్రత్తలు పాటించాలని సూచన.
జూలై: మంచికాలం. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. అందరితోనూ స్నేహంగా ఉండవలసిన కాలం. మీ కార్యకలాపాలను చాలా గోప్యంగా ఉంచాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అధికంగా ఉంచాలి. కుటుంబ వ్యవహారాలు 15వ తేదీ నుంచి సానుకూలం అవుతాయి. అకాలంలో భోజనం చేయవలసి రావడం ఎక్కువసార్లు జరుగుతుంది..

ఆగస్టు: చాలా అద్భుతమైన కాలం. ప్రతి పనిలోనూ శ్రమ తక్కువగా ఉండి కార్యజయం పొందే అవకాశాలు ఎక్కువ. ప్రధానంగా కుటుంబ వాతావరణం బహు అనుకూలం. ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ అనుకూల స్థితి ఉంటుంది. సత్కాలక్షేపాలు జరుగుతాయి.

సెప్టెంబర్‌: కార్య సానుకూలతకు ఎక్కువగా కృషి చేస్తారు. గ్రహానుకూలత క్రమంగా పెరుగుతుంది. ప్రయత్నం చేసే పనులన్నీ సానుకూలం అవుతుండటంతో ఆనందంగా ఉంటారు. భక్తి కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనలతో కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రులను తరచుగా కలుస్తూ ఉంటారు.

అక్టోబర్‌: మీ పనులను స్వయంగా చేసుకోండి. కుజుడు మినహా మిగిలిన గ్రçహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. 15 వరకు కుజుడు కూడా అనుకూల సంచారం చేస్తున్నారు. అన్ని వ్యవహారాలూ సానుకూలంగా ఉంటాయి. తొందరపాటు మాటతీరు ప్రదర్శించవద్దు. 

నవంబర్‌: మాసారంభంలో గ్రహానుగ్రహం బాగుంది. కొన్ని కొన్ని పనులను త్వరగా ఆరంభంలోనే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం. ఇతరుల నుంచి సలహాలు సహకారం 15వ తేదీ నుంచి తీసుకోవద్దు. విద్యా వినోద పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. సాంఘిక కార్యక్రమాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు.

డిసెంబర్‌: స్వబుద్ధితో కార్యసాధన చేస్తారు. అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటారు. గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు. ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం ద్వారా కాలం అనుకూలమనే చెప్పాలి. ఉద్యోగంలో చిన్న చిన్న చికాకులు వస్తున్నా, వాటిని బాగానే పరిష్కరించుకుంటారు. 

జనవరి: చక్కగా వ్యవహరించి తలపెట్టిన ప్రతిపనినీ విజయపథంవైపు నడపగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం, ఉద్యోగులకు ప్రమోషన్‌ ప్రయత్నాలు సానుకూలం. బంధుమిత్రుల రాకపోకలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు.

ఫిబ్రవరి: కొత్త ప్రయోగాలు 15వ తేదీ వరకు చేయవద్దు. నెలంతా అనుకూలం. 15 వరకు ఒకస్థాయి, 15వ తేదీ తరువాత విశేషస్థాయి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో మన్ననలు అందుకుంటారు. వ్యాపారులు తెలివిగా లాభాలు అందుకుంటారు. అన్ని అవసరాలూ తీరే కాలం. 

మార్చి: కుజగ్రహం జపం చేయించుకోండి. కుజుడు మినహా అన్ని గ్రహాలూ అనుకూలంగా ఉన్నందున ఈ నెలంతా మీకు మంచికాలమే. ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. రోజువారీ పనులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.

మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.

 
మకర రాశి
ఆదాయం–5  వ్యయం–2 రాజయోగం–2  అవమానం–4
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)
శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)
ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (ద్వితీయం)లోను తదుపరి మీనం (తృతీయం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం(జన్మం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (పంచమం) కేతువు వృశ్చికం (లాభం)లోను తదుపరి రాహువు మేషం (చతుర్థం) కేతువు తుల (దశమం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (పంచమం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని, అర్ధాష్టమ రాహువు, తృతీయ గురువులలో ఎవరూ అనుకూలించే గ్రహాలు కాదు. కానీ ఇతర గ్రహాలు ప్రతినెలలోను ఏదో ఒక గ్రహం ఎక్కువ కాలం పాటు సంతృప్తికర ఫలితాలు అందిస్తున్న కారణంగా విజయపథంలోనే ముందుకు వెడతారు. గత సంవత్సరం కంటే ఎక్కువ రోజులు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అందుకుంటారు. దీర్ఘకాలికమైన పనులను ఈ సంవత్సరం పెట్టుకోవద్దు. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఆదాయం తగుమాత్రంగా ఉన్నా, అవసర సమయాల్లో డబ్బు తగిన రీతిగా సర్దుబాటు కాకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. పాత ఋణాలు తీర్చే విషయంలో అనుకూలత తక్కువగా వున్నందున ఆర్థిక ఒడంబడికలకు దూరంగా ఉండండి. మితభాషణ శ్రేయస్కరం. కుటుంబసభ్యుల ద్వారా కొన్ని విషయాలలో అనుకూల వాతావరణం. కొన్ని ఆర్థిక వ్యాపార శుభ వ్యవహారాల్లో మంచి ఫలితాలు దక్కుతాయి. పిల్లల అభివృద్ధి వార్తలు, పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉందనే వార్తలు తరచుగా వింటారు. స్థానచలనం, ప్రమోషన్‌ వంటి అంశాలు ఈ సంవత్సరం మీ తెలివి తక్కువతనంతో ఇబ్బందికరం కాగలవు. మందకొడి ఆలోచనలు, ప్రవర్తనలతో వ్యాపార నిర్ణయాలు సరిగా చేయలేరు. అందువల్ల వ్యాపారులకు సంవత్సరం అంతా సామాన్య ఫలితాలు మాత్రమే ఉంటాయి. కార్మికులతో సమస్యలు తప్పవు. ఉద్యోగులు నమ్మకూడని వ్యక్తులను ఆశ్రయించి, వారి సలహాలను అమలు చేసి, మీ అభివృద్ధికి మీరే అవరోధాలు సృష్టించుకుంటారు.

అనవసర సమస్యలను కొని తెచ్చుకుంటారు. నిర్లక్ష్యం వల్ల ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటారు.  సుగర్, బీపీ ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలు పనులు వేగంగా సాగవు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారు దూకుడు ఆలోచనలు ప్రమాదకరం అని గమనించాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యాపరంగా కార్యానుకూలత ఉంది. ఉద్యోగరీత్యా అనుకూలత లేదు. షేర్‌ వ్యాపారులకు ఫైనాన్స్‌ వ్యాపారులకు తరచుగా కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి. కంగారు పడనవసరం లేదు. విద్యార్థులకు విద్యా వ్యాసంగం సామాన్యంగా ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేసే ఆసక్తి తగ్గుతుంది. రైతులకు శ్రమ ఎక్కువ అయినా, ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మంచి ఫలితాలు ఆలస్యంగా అందుతాయి. గర్భిణిలు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ఉంటారు. కాలం అనుకూలమే అని చెప్పాలి.


ఉత్తరాషాఢ నక్షత్రం వారు తరచుగా పూజలు, వ్రతాలు, నోములు వంటి పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ధైర్యంగా తెలివిగా ఎంతటి కార్యాన్నయినా విజయవంతం చేసుకునే అవకాశం వుంటుంది. మౌనంగా వుంటూనే ప్రతి పనినీ సాధించుకోవడంలో కృతకృత్యులవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

శ్రవణ నక్షత్రం వారికి మానసిక అలజడి ఎక్కువగా వుంటుంది. సాంఘిక కార్యక్రమాలకు వీలయినంత దూరంగా వుండడం శ్రేయస్కరం. ఇతరులకు సహకరించాలనే మీ మంచితనం ఈ సంవత్సరం మీ పాలిట శాపంగా మారే అవకాశం వున్నది. ప్రయాణాలు ఒంటరిగా చేయవద్దు.

ధనిష్ఠా నక్షత్రం వారికి కాలం చాలావరకు అనుకూలమనే చెప్పాలి. ప్రతిపనీ అతి శ్రమతో పూర్తవుతుంది. గతకాలం కంటే చాలావరకు సానుకూలం అనే చెప్పాలి. ఆగస్టు తరువాత తల్లి తరఫులేదా భార్యాతరఫు బంధువుల వల్ల మంచి సహకారం లభించి కొన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం వుంటుంది.

శాంతి: అవకాశం ఉన్నప్పుడు శని రాహు శాంతి చేయించండి. రోజూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశ్లోకి 11 సార్లు పారాయణం చేయడం, ‘గౌరీశంకర’ రుద్రాక్ష ధరించడం శ్రేయస్కరం.

ఏప్రిల్‌: ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థిక సౌకర్యం చాలా తక్కువ. ప్రయాణాల్లో చికాకులు ఉంటాయి. ఇతరులను నమ్మి పనులు ప్రారంభించవద్దు. ఋణ విషయాల్లో అనుకూలత తక్కువ. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి పనీ స్వయంగా చేసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం తక్కువ.
మే: చాలా అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. క్రమంగా ఒక్కో పని వేగం పుంజుకుంటుంది. అందరూ సహకరిస్తారు. 15వ తేదీ తరువాత తరచుగా ఉష్ణప్రకోపం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్దస్థాయి ఇబ్బందులు ఉండవు. స్నేహపూర్వక వాతావరణంలో చాలా వ్యవహారాలను సానుకూలం చేసుకుంటారు. …

కుంభ రాశి
ఆదాయం–5  వ్యయం–2  రాజయోగం–5  అవమానం–4
ధనిష్ఠ 3,4 పాదములు (గుూ, గే)
శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)
పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (జన్మం)లోను తదుపరి మీనం (ద్వితీయం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (వ్యయం)లోను మిగిలిన కాలం అంతా కుంభంలో సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (చతుర్థం) కేతువు వృశ్చికం (దశమం)లోను తదుపరి రాహువు మేషం (తృతీయం) కేతువు తుల (నవమం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (చతుర్థం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా చిత్ర విచిత్రమైన జీవనశైలితో కాలం నడుస్తుంది. గురువు అనుకూలంగా ఉన్న కారణంగా ధన కుటుంబ ఆరోగ్య విషయాల్లో వచ్చే సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలు దొరుకుతాయి.

ఆగస్టు నుంచి కుజస్తంభన దృష్ట్యా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. అలాగే తరచుగా అయిష్టమైన కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనవలసి రావడం, బంధువులతో కలహాలు ఉంటాయి. శని సంచారం అనుకూలంగా ఉన్నట్లే చెప్పాలి. మకర కుంభ సంచారాలలో ఈ రాశివారికి శని చెడు పెద్దస్థాయిలో ఉండదు. అయితే పనులు మందకొడిగా సాగడం, ముఖవర్చస్సు తగ్గడం, చెప్పుకోలేని బాధలు ఉన్న భావన కలుగుతాయి. భోజన వసతికి ఇబ్బంది రాగలదు. కుటుంబసభ్యులు బాగా సహకారంగా ఉన్నా, ఏదో తెలియని అవగాహన లోపంతో ముందుకు సాగుతారు. గతం కంటే ఈ సంవత్సరం బాగానే ఉన్నా, అసంతృప్తితో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వనరులు బాగా సమకూరుతాయి. అదే రీతిగా ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది. కావలసిన సమయానికి ఋణాలు అందుతాయి. 

పాత ఋణాలు తీర్చుకోవడానికి మార్గం సుగమమవుతుంది. తరచుగా గురువులను పూజ్యులకు సందర్శించుకుంటారు. ఏలినాటి శని ప్రభావం చేత కార్మికుల సమస్య ఇబ్బందికరంగా ఉండి వ్యాపారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమ, చికాకు తప్పదు. సీజన్‌లకు తగిన రీతిగా స్పందించి వ్యాపారం చేయలేరు. ఉద్యోగులకు విచిత్రమైన సమస్యలు ఎదురవుతాయి. అధికారుల సహకారం లేకపోవడం, తోటివారి నుంచి సమస్యలు రావడం జరుగుుతుంది. సుఖంగా పనులు సాగవు. ఆరోగ్యపరంగా బాగా జాగ్రత్తలు పాటించాలి. పెద్దగా యిబ్బందులు ఉండవు కానీ తరచుగా సమస్యలు ఎదురుకాగలవు. నరాలు, రక్త సంబంధ అనారోగ్యం ఉన్నవారు ఎక్కువ ఇబ్బందికి గుురవుతారు. ఆరోగ్యరీత్యా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా, శ్రమతో పనులు పూర్తవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి పనులు ఇబ్బందికరమే అయినా ఫలితం సానుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి ఖర్చు అధికంగా ఉన్నా, కార్యసాఫల్యం జరుగుతుంది. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. ఊహాతీతంగా చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్నా, చివరకు మంచి ఫలితాలు అందుతాయి. గర్భిణీ స్త్రీలు అనవసర విషయాలపై ఆలోచనలు విరమించుకోడం శ్రేయస్కరం.

ధనిష్ఠ నక్షత్రం వారికి కుటుంబసభ్యుల సహకారం ఈ సంవత్సరం శ్రీరామరక్ష అనే చెప్పాలి. ఉద్యోగంలో మీరు కార్యనిర్వహణ చాలా వికృతంగా చేయడం. సమయపాలన లేకుండా ప్రవర్తించడం వంటివి చేస్తారు. అయితే ఏదో తెలియని అద్భుతశక్తి మిమ్మల్ని రక్షిస్తుంది.

శతభిష నక్షత్రం వారికి విచిత్రమైన స్థితి వుంటుంది. తరచుగా అన్ని పనులూ మందగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంతా లాభదాయకం అనుకునే సందర్భంలో పనులు వెనక్కు మళ్లే అవకాశం వుంటుంది. పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవాలనుకుంటే, మీరు స్వయంగా శ్రమించాలి.

పూర్వాభాద్ర నక్షత్రం వారికి విశేషమైన కాలమనే చెప్పాలి. పూర్తిగా స్వేచ్ఛగా జీవిస్తారు. భారంగా వుండే పనులు చేయకుండా సరళంగా వుండే పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తరచుగా శుభకార్యాల్లో పాల్గొంటారు.

శాంతి: శని రాహు కుజులకు జపం, దానం చేయించడం మంచిది. ప్రతిరోజూ ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం మంచిది. ఆరు ముఖముల రుద్రాక్షధారణ శ్రేయస్కరం.

ఏప్రిల్‌: శనిగ్రహ శాంతి చేయించండి. వరుసగా మూడు మాసములు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని వ్యవహారాలూ మందకొడిగా నడుస్తాయి. అయితే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు తప్పక ఉంటాయి. ప్రయాణాలు విరమించండి.

మే: శని కుజుల కుంభరాశి సంచారం చాలా ఇబ్బందికరం. మూడవ వారంలో బాగా చికాకులు రాగలవు. ఆర్థిక వెసులుబాటు చికాకులు కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలను  సరిచేయగలుగుతారు. ఋణ విషయాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బహు జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేయవద్దు.
జూన్‌: చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. ప్రత్యేక లాభములు ఉండవు. ప్రతి పనీ స్వయంగా చేసుకొని లబ్ధి పొందుతారు. ఆర్థిక వెసులుబాటు, ఋణ సౌకర్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ చక్కగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు.

జూలై: శ్రద్ధతో ప్రవర్తించి కార్యజయం సాధిస్తారు. అంతటా విజయావకాశాలు ఉన్నాయి. కాలం వృథా చేయకుండా గత సమస్యల పరిష్కారం, భవిష్య ప్రణాళికలు, దీర్ఘకాలిక కార్యక్రమాల మీద దృష్టి సారించాలి. కుటుంబపరంగా కాలం అనుకూలం. ఆర్థిక, ఋణ విషయాలు బాగుంటాయి.

ఆగస్టు: ఏలినాటి శని అర్ధాష్టమ కుజుడు షష్ఠ శుక్రుడు ప్రభావంగా మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అసౌకర్యం. అవగాహన లోపాలు ఎక్కువవుతాయి. ఉద్యోగ అంశాలు స్వయంగా చూసుకోండి. వ్యాపార విషయంలో మీకు తోటివారు, సిబ్బంది చికాకులు సృష్టిస్తారు.

సెప్టెంబర్‌: పూర్తి అనుకూల వాతావరణం ఉండదు అలాగని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అనవసర విషయాలలో భయాందోళనలు ఎక్కువవుతాయి. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో వస్తువులు చోరీకి గురవుతాయి. విధి నిర్వహణలో జాగ్రత్తపడండి.

అక్టోబర్‌: సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. 15వ తేదీ వరకు అన్ని పనులూ ఒత్తిడిగా ఉంటాయి. ప్రత్యేకంగా కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. రోజువారీ పనులతో కాలక్షేపం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలు, ఋణ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. పెద్దల ఆరోగ్య విషయం జాగ్రత్త.

నవంబర్‌: చాలా విచిత్రమైన కాలం. క్రమంగా కార్యసానుకూలత పెరుగుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పాలి. మాసారంభంలో శుక్రుడు, ద్వితీయార్ధంలో రవి అనుకూలిస్తారు. పనులు వాయిదా వేసే ఆలోచనలను విరమిస్తే విజయం మీతో ప్రయాణం చేస్తుంది. అన్ని విషయాల్లోనూ సహనంతో వ్యవహరిస్తారు.

డిసెంబర్‌: ఒక కోణంలో మీరు ఈనెలలో అదృష్టవంతులనే చెప్పాలి. శ్రమతో కూడుకున్న పనులను ముందుగానే గుర్తించి, వాటి జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా చేయగలిగిన పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెడతారు. అందరి సహకారం బాగుంటుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తారు.

జనవరి: గురుబలం ఈ నెల విశేషం. ప్రయాణ విçఘ్నాలు ఉంటాయి. తరచుగా వస్తువులు పనులు మరచిపోయే అవకాశం ఉంది. 15వ తేదీ వరకు రవి అనుకూలత దృష్ట్యా వృత్తిలో సమస్యలను దాటవేయగలుగుతారు. మూడవవారం అన్నింటా చికాకులు ఉంటాయి. చివరి వారంలో శుక్ర సంచారం అనుకూలత వల్ల సమస్యలను దాటగలరు.

ఫిబ్రవరి: రవి కుజ శని సంచారం బాగులేదు. ప్రధానంగా ఆదాయం ఒత్తిడిగా అందుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. తరచుగా దుర్వార్తలు వినవలసి వస్తుంది. బంధువుల అనారోగ్య వార్తలు మానసిక ఇబ్బందులకు గురి చేస్తాయి. పనులు బాగా ఆలస్యం అవుతాయి.

మార్చి: ప్రతి పనిలో ఆలస్యం ఎదురైనా, సానుకూలంగా పూర్తవుతాయి. కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలం. ఖర్చులు నియంత్రించడం ద్వారా ఈ నెల అంతా సుఖంగా జీవనం సాగుతుంది.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి గోచారానికి పోలిక చేసి ఫలితాలు తెలుసుకోండి.
∙∙

మీన రాశి 
ఆదాయం–2 వ్యయం–8  రాజయోగం–1  అవమానం–7

పూర్వాభాద్ర 4 వ పాదము (ది)
ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)
రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (వ్యయం)లోను తదుపరి మీనం (జన్మం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (లాభం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (తృతీయం) కేతువు వృశ్చికం (భాగ్యం)లోను తదుపరి రాహువు మేషం (ద్వితీయం) కేతువు తుల (అష్టమం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (తృతీయం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా అధికకాలం శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. అలంకరణ వస్తువులు కొనుగోలుకు బాగా ధనవ్యయం చేస్తారు. ఆదాయం బాగా ఉండి, అది అన్ని విధాలా సద్వినియోగపడడం వలన చాలా సుఖంగా కాలక్షేపం జరుగుతుంది. కొత్త ఋణాలు అనుకూలంగా అందుతాయి. 

పుణ్యక్షేత్ర సందర్శన, విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో ప్రత్యేక దృష్టితో పాల్గొనడం జరుగుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు. ప్రమోషన్‌లు, అనుకున్న రీతిగా ట్రాన్స్‌ఫర్‌లు మీకు సంతృప్తికర ఫలితాలు ఇస్తాయి. శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. చిరకాల సమస్యలకు ఈ సంవత్సరం నివారణ మార్గాలు దొరుకుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి మంచి సలహాలు సూచనలు అంది, సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేస్తారు. అన్ని రంగాల్లోనూ ఈ సంవత్సరం ఈ రాశివారికి శుభ ఫలితాలు అందుతాయి. మంచి జీవనం సాగుతుంది. మొండిబాకీలు వసూలు చేయడంలో స్నేహితులు బాగా సహకరిస్తారు. సరైన ప్రణాళికలను అమలు చేసినట్లయితే, అన్ని రకాలుగా వ్యాపార సమస్యలు తీరగలవు.

వ్యాపారులకు సంవత్సరం అంతా లాభసాటిగానే ఉంటుంది. ఉద్యోగులకు అనుకోని లాభాలు చేకూరే అవకాశం ఉంది. పనులు తేలికగా పూర్తి చేస్తారు. తోటివారు సహకరిస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటిస్తారు. వైద్యం పెద్దగా అవసరం లేకుండానే ఈ సంవత్సరం అనారోగ్యవంతులు కూడా సుఖపడే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలులో తెలివిగా ప్రవర్తిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి అన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, పనులు సానుకూలంగా ఉంటాయి. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు గురువు మీనంలో ఉన్న కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఏప్రిల్‌ నుంచి అనుకూలంగా సాగుతుంది. అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలుంటాయి. రైతులకు కావలసిన సౌకర్యాలు బాగా అందుతాయి.

శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. గర్భిణీ స్త్రీలు సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్రం వారు సంబంధం లేని అంశాల్లో ఇబ్బందులకు గురవుతారు. కొన్ని సందర్భాలలో మీకు ఎదురులేని రీతిగా గ్రహచారం అనుకూలిస్తుంది. కొన్నిసార్లు ఎంత శ్రమ చేసినా ఫలితం లేని తీరు వుంటుంది. ధన, కుటుంబ వ్యవహారాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు నగలు, వాహనాలు, భవంతుల కొనుగోలు విషయాలపై ఆసక్తి చూపుతారు. ప్రతి చిన్న విషయంలోనూ విపరీతమైన మానసిక ఒత్తిడి పొందుతారు. ప్రతిపనిలోనూ కలహతత్వం ప్రదర్శిస్తారు. రేవతీ నక్షత్రం వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగిపోతుంది.

అనవసర విషయాల్లో భయాందోళనలు చెందుతారు. ఇతరులకు సహకారం చేయాలి అనుకున్నా మీకు అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నాయి.
శాంతి: ప్రత్యేకమైన శాంతి కార్యములు అవసరం లేదు. రోజూ విష్ణూ సహస్ర పారాయణ చేయుట. లక్ష్మీనారాయణ పూజ, గోపూజ చేసుకోవడం శుభప్రదం. పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.

ఏప్రిల్‌: శ్రమ చేసినా ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. శనికి శాంతి అవసరం. ఏలినాటి శని ఈ నెల నుంచి ప్రారంభమవుతుంది. మీ జాతక పరిశీలన చేయించుకోండి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం కాగలవు. ఉద్యోగ, వ్యాపారాలు భారంగా నడుస్తాయి. సానుకూలత తక్కువ ఉన్న కాలం.

మే: గురు శుక్రుల అనుకూలత, శని కుజుల ప్రతికూలత దృష్ట్యా విచిత్రమై చికాకులు వెంబడిస్తాయి. ఆదాయం బాగున్నా, ఖర్చులు నియంత్రించలేరు. ఉద్యోగంలో అనుకోని చికాకులు రాగలవు. మితభాషణ అవసరం. మీ పనులు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు.

జూన్‌: ఉద్యోగం వ్యాపారాల్లో అధికారులతోను, పనివారితోను చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి.

జూలై: మంచి కాలం. అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. ధైర్యంగా, స్వయంగా పనులు చేసుకుంటూ విజయం సాధిస్తారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. కుటుంబ సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఋణ సమస్యలు తీరే కాలం.

ఆగస్టు: అన్ని అంశాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న ప్రతిపనినీ సకాలంలో పూర్తి చేస్తారు. సందర్భానుసారం ప్రవర్తించడం, అందరితో స్నేహంగా ఉండడం, ఆర్థిక వెసులుబాటు, ఆరోగ్యం సహకరించడం వంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నెల చాలా మంచికాలం.

సెప్టెంబర్‌: చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వృత్తి విషయాల్లో సుఖంగా కాలక్షేపం జరుగుతుంది. మితభాషణ చేస్తారు. అవసరం అయిన చోట ధైర్యం తెలివి ప్రదర్శిస్తారు. కుటుంబ సౌఖ్యం తక్కువనే చెప్పాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు.

అక్టోబర్‌: ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. వృత్తి వ్యవహారాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఈ నెలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తక్కువనే చెప్పాలి. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అయినా తెలివిగా ఖర్చులను నియంత్రించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలుంటాయి.

నవంబర్‌: చాలా మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి. మీ పాత సమస్యల పరిష్కారం గురించి భవిష్యత్‌ ప్రణాళికలు గురించి చక్కటి పరిశ్రమ చేయండి. రోజురోజుకు మంచి ఫలితాలు వస్తాయి. ఋణ విషయాలు ఆర్థిక సమస్యలు ఈ నెల 15వ తేదీ తరువాత క్రమంగా సానుకూలం అవుతాయి. మంచి జీవనకాలం ప్రారంభమైంది.

డిసెంబర్‌: గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా ప్రవర్తిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికం అవుతాయి. రోజువారీ పనులు మాత్రమే చేస్తారు. కొత్త ప్రయోగాలు చేయరు. పుణ్యకార్య ఆకాంక్ష ఎక్కువ అవుతుంది. చాలావరకు మంచి ఫలితాలు ఉంటాయి. డబ్బు విషయంలో ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. శుభ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి.

జనవరి: అద్భుతమైన కాలం. 22వ తేదీతో వ్యయంలో శుక్రుడి సంచారం ప్రారంభమైన తరువాత కొంత ప్రయాణ చికాకులు ఉంటాయి. ఈ నెల వృత్తి విషయంలో అంతా సుఖంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. చక్కగా ఖర్చు చేయగలుగుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. 

ఫిబ్రవరి: 15 వరకు రవి, 15 నుంచి శుక్రుడు అనుకూలిస్తారు. తద్వారా ఏలినాటి శని ఫలితాలను దాటవేస్తారు. అతి జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో మీ నడవడి తోటివారికి ఇబ్బంది కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టవద్దు. రోజువారీ పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

మార్చి: ఒక విచిత్రమైన కాలం. రోజువారీ పనులు కూడా శ్రమతో నడుస్తాయి. ఏ పనిలోనూ నష్టాలు ఉండవు. ఆదాయం అందడం ఆలస్యంగానూ, ఖర్చులు వేగంగానూ వస్తుంటాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement