అల్జైమర్స్ ముప్పు మహిళల్లోనే ఎందుకు ఎక్కువ? క్రమక్రమంగా చాలా విషయాల మరపునకు దారితీసే ‘న్యూరో–డీజనరేటివ్’ వ్యాధి అల్జైమర్స్... మహిళ జ్ఞాపకశక్తి, ఆలోచన, ప్రవర్తనతీరు... ఇలా ఎన్నో అంశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తాము ఉన్న ఇంటి అడ్రస్‌తో సహా క్రమంగా అన్నీ మరచిపోయేలా చేసే ‘అల్జైమర్స్’ ముప్పు మహిళల్లోనే ఎక్కువ.
కొన్ని పరిశీలనల ప్రకారం మొత్తం రోగుల్లో మూడింట రెండు వంతులు మహిళలే! ఎందుకిలా జరుగుతోందనే అంశంపై అధ్యయనాలు జరిగినప్పుడు చాలా అంశాలే ఇందుకు కారణమవుతున్నాయని తేలింది. ఉదాహరణకు జన్యుపరమైన, పర్యావరణ, జీవశాస్త్ర సంబంధితమైన పలు అంశాలు ఇందుకు కారణమవుతున్నట్లు గుర్తించారు. అన్నింటికంటే ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వారిలో వచ్చే హార్మోనల్ మార్పులు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కీలకమైన శుభవార్త ఏమిటంటే... దీనివల్ల కలిగే దుష్ప్రభావాల నివారణ చాలావరకు సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
మెనోపాజ్ తర్వాత మెదడులో వచ్చే మార్పులు...
బ్రెయిన్ ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి పలు ఇమేజింగ్ పరీక్షల తర్వాత తేలిన అంశం ఏమిటంటే... మెనోపాజ్ తర్వాత మహిళల మెదడు పనితీరు, జీవక్రియల్లో మార్పు వస్తుంది. మెదడు పనితీరు తగ్గడంతో పాటు న్యూరాన్ల మధ్య కనెక్షన్లూ తగ్గుతాయి. ఈ న్యూరాన్ కనెక్షన్ల వల్లనే ఆలోచనలూ, విషయాలు జ్ఞప్తికి రావడం, నేర్చుకునే / అభ్యాసన శక్తీ... ఇవన్నీ కలుగుతాయి. మెనోపాజ్ తర్వాత మెదడు జీవక్రియలు (మెటబాలిజమ్) తగ్గడంతో జ్ఞాపకశక్తి తగ్గుతుండటం, ఏదీ ఠక్కున గుర్తుకు రాకపోవడం వంటి అనర్థాలు కనిపిస్తుంటాయి. ఇలా జరగడాన్ని ‘బ్రెయిన్ ఫాగ్’ గా పేర్కొంటారు. మెనోపాజ్ తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు వీటిని ‘అల్జైమర్స్’ తాలూకు ముందస్తు చిహ్నాలుగా కూడా భావించవచ్చు.
మరి మహిళ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమెలా?
ఇప్పటవరకూ అల్జైమర్స్ను నివారించడానికి నిర్దిష్టమైన చర్యలు లేకపోయినా, జీవనశైలిలో కొన్న మార్పుల ద్వారా (మరీ ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత) ఈ ముప్పును చాలావరకు నివారించవచ్చు.
మెనోపాజ్ రాబోయే ముందర హార్మోన్ రీ–ప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)లో భాగంగా ఈస్ట్రోజెన్ ఇవ్వడం వల్ల అల్జైమర్స్ ముప్పును చాలావరకు తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
మెదడుకు మేత కల్పించేలా బాగా చదవడం, రకరకాల పజిల్స్ ఛేదించడం, కొత్త విద్యలు నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాల సాధన, తరచూ పలువురితో కలవడం, మాట్లాడుతుండటం (సోషల్ ఇంటరాక్షన్స్) వంటివి అల్జైమర్స్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి.
ఊ నిత్యం తగినంత శారీరక శ్రమతో, దేహంలో కదలికలతో ఉండేవారిలో అల్జైమర్స్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. అందుకే వేగంగా నడక (బ్రిస్క్ వాకింగ్), ఈత, యోగా వంటి వ్యాయామాలు అల్జైమర్స్ రిస్క్‌ను తగ్గించడమే కాకుండా ఇతరత్రా మొత్తం ఆరోగ్యానికి బాగా దోహదపడతాయి. ఊ ఆహారంలో తగినంతగా ఆకుకూరలు, కూరగాయలు, చేపలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తాజాపండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల అవి మెదడు ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. ఊ నిద్రను దూరం చేసే కెఫిన్‌ను పరిమితంగా తీసుకుంటూ మంచి నిద్ర అలవాట్లతో కంటినిండా నిద్రపోవడం అల్జైమర్స్ ముప్పును చాలావరకు తగ్గిస్తుంది. ఊ గుండె ఆరోగ్యం బాగుంటే మెదడు ఆరోగ్యమూ బాగుంటుంది. కీలకమైన ఈ రెండు అవయవాల ఆరోగ్యాలు ఒక దానితో మరొకటి ముడిపడి ఉంటాయి. అందుకే గుండె సంబంధిత (కార్డియో వాస్క్యులార్) సమస్యలైన హైబీపీ, డయాబెటిస్ , అధిక కొలెస్ట్రాల్ వంటి జబ్బులను అదుపులో పెట్టుకోవడం ద్వారా అల్జైమర్స్ ముప్పును చాలావరకు నివారించవచ్చు.
మహిళల్లోనే ఎందుకు ఎక్కువంటే...
మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ల మోతాదులు మెనోపాజ్ తర్వాత తగ్గిపోతాయి. మెదడు కణాలను, మరీ ముఖ్యంగా న్యూరాన్లకు ఈస్ట్రోజెన్ మంచి రక్షణ కల్పిస్తుంటుంది. అంతేకాదు మెదడు తాలూకు జ్ఞాపకాల సెంటర్‌గా పేర్కొనే హి΄్పోక్యాంపస్‌కూ ఈస్ట్రోజెన్ రక్షణ ఇస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ దేహానికీ, అందులోని అన్ని అవయవాలకూ ఏజింగ్ ప్రాసెస్ జరుగుతుంటుంది కదా. ఈస్ట్రోజెన్ స్రావాలు అకస్మాత్తుగా తగ్గగానే మెదడు ఏజింగ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అలాగే మెదడులో అమైలాయిడ్స్ అనే పాచివంటి పదార్థాలు పేరుకుపోతుంటాయి.
మహిళల్లో అల్జైమర్స్ ఎక్కువగా ఉండటానికి మరో కారణమం ఏమిటంటే... పురుషులతో పోలిస్తే వారు ఎక్కువకాలం జీవిస్తారు. వాళ్ల ఆయుర్దాయం కూడా ఈ ముప్పునకు మరో కారణం.
ఇక జన్యుపరమైన కారణాల విషయానికి వస్తే పురుషులతో పోలిస్తే మహిళల్లో ‘ఏపీఓఈ–ఈ4’ అనే జన్యువు ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... ఈ జన్యువును కలిగి ఉన్న మహిళల్లో అల్జైమర్స్ ముప్పు పురుషుల కంటే మరింత ఎక్కువ.
మామూలుగానైతే వాతావరణంలో వాయుకాలుష్యానికి కారణమయ్యే సస్పెండెడ్ ఎయిర్ పార్టికిల్స్ అనే ధూళి కణాల వల్ల సాధారణంగా శ్వాససంబంధిత వ్యాధులు, ఆస్తమా వంటివి పెరుగుతాయన్నది చాలామందిలో ఉండే అభి్రపాయం. కానీ వాతావరణంలో పెరిగే కొద్దిపాటి కాలుష్యం మెదడుపై ప్రభావం చూపి మతిమరపునకు దారితీయవచ్చు. గాల్లోకి వ్యాపించే కొద్దిపాటి హానికరమైన ధూళికణాలు (టాక్సిక్ పార్టికిల్స్) ఏమాత్రం పెరిగినా అవి మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలను కనీసం 16 శాతం పెంచుతాయంటున్నారు అధ్యయనవేత్తలు. అలాగే అల్జైమర్స్ ముప్పునూ 11 శాతం వరకు పెంచవచ్చునంటున్నారు. ఈ విషయాలన్నింటినీ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ) అధ్యయనవేత్తలు గట్టిగా చెబుతున్నారు. నాడీవ్యవస్థకు సంబంధించిన ఇలాంటి రుగ్మతలను నివారించాలంటే వాతావరణంలో వాయువుల నాణ్యత తగ్గకుండా చూసుకోవడం తప్ప మరో దారి లేదంటున్నారు.
‘అడల్ట్ ఛేంజెస్ ఇన్ థాట్ – (యాక్ట్)’ అనే అధ్యయనం కోసం దాదాపు పాతికేళ్లకు పైగానే ‘కైయిసర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ వారు సేకరించిన డేటాపై ఆ మాతృసంస్థతో పాటు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ) పరిశోధకులు సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించారు. వాషింగ్టన్–సియాటెల్‌ప్రాంతంలోని దాదాపు 4,000 మంది పరిశీలించినప్పుడు వాళ్లలో 1,000 పైగానే డిమెన్షియా రోగులు ఉన్నట్లు తేలింది. గాలిలోని హానికరమైన ధూళులు మతిమరపునకు కారణమయ్యే డిమెన్షియా, అల్జైమర్స్ జబ్బులు పెరుగుతాయని నిర్ద్వంద్వంగా తేలింది. అధ్యయనం నిర్వహించిన వారిలో నాలుగింట ఒక వంతు మందికి (దాదాపు 25›శాతం మందిలో) డిమెన్షియా ఉండటంతో ఇది కొంత ఆందోళన కలిగించే అంశంగా పరిశోధకులు పేర్కొంటున్నారు.
గాల్లోని అత్యంత సూక్ష్మమైన ధూళికణాలను ‘ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్’ అంటారు. (ఈ ధూళికణాలు ఎంత చిన్నవంటే వీటి సైజు 2.5 మైక్రోమీటర్స్ మాత్రమే. ఒక పోలిక చె΄్పాలంటే వెంట్రుకను నిలువునా 30 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎంత సైజుంటుందో ఈ ధూళికణాల సైజు అంత ఉంటుంది). కారు ఎగ్జాస్ట్ నుంచి వెలువడే పోగ, భవన నిర్మాణ ప్రదేశాలు, మంటలూ, పోగలు ధారాళంగా వెలువడే ప్రదేశాలు... ఇలాంటిప్రాంతాలనుంచి వెలువడే ఈ ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ వల్లనే వాతావరణం బాగా కలుషితమైపోయి డిమెన్షియా, అల్జైమర్స్ వంటి నాడీ సంబంధ వ్యాధుల ముప్పు పెరుగుతోందంటున్నారు అధ్యయనవేత్తలు. ఈ అంశాలన్నీ ఇటీవలే ‘ద జర్నల్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్‌ప్రాస్పెక్టివ్స్’లో ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనంతో... గాల్లోని కాలుష్యపదార్థాలను, ప్రమాదకరమైన ధూళికణాలను తగ్గిస్తే అటు శ్వాసకోశ వ్యాధులైన ఆస్తమా వంటివి వాటి నుంచి విముక్తి కలగడమే కాకుండా... ఇటు నాడీ వ్యవస్థకు సంబంధించిన మతిమరపూ, అల్జైమర్స్ వంటి సమస్యలూ తగ్గుతాయని స్పష్టమవుతోంది.
∙
Comments
Please login to add a commentAdd a comment