భక్తితో ప్రార్థిస్తే పరమాత్మ అనుగ్రహం
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
తెనాలి: ప్రజలందరూ భగవత్ ధ్యానంలో తరిస్తూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పెనుకొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) సూచించారు. ఆర్యవైశ్యుల దేవత శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండలోని అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) తొలిసారిగా శనివారం సాయంత్రం స్వస్థలమైన తెనాలికి వచ్చారు. శ్రీసాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠంలో గురుపాదుక పూజకు హాజరయ్యారు. అక్కడ భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ చేశారు. భక్తిశ్రద్ధలతో పరమాత్ముడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం పొందుతారని చెప్పారు. స్థితప్రజ్ఞతతో మనసులో అలజడులు లేకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలని చెప్పారు. ధర్మ పరిరక్షణ కోసం తాను ‘వైదిక ధర్మం’ చానల్‌తో ఆధ్యాత్మిక సేవ చేస్తున్నట్లు గుర్తుచేశారు. తొలుత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తెనాలి వచ్చిన బాలస్వామికి పట్టణ సరిహద్దులోని భారీ వినాయక విగ్రహం వద్ద సాలిగ్రామ మఠం బాధ్యులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. వినాయకుడికి పూజల అనంతరం పట్టణంలో శోభాయాత్రను నిర్వహించారు. మార్కెట్ మీదుగా గాంధీచౌక్, గ్రంథాలయం రోడ్డులోంచి గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠం చేరుకున్నారు. అక్కడ పాదుక పూజలో పాల్గొన్నారు. సాలిగ్రామ మఠం చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, కమిటీ సభ్యులు రాజేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, కోన నాగేశ్వరరావు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ)
Comments
Please login to add a commentAdd a comment