గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 29న జరగాలి. మెజార్టీ సభ్యులు కోరిన మీదట వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు గురువారం సాయంత్రం ప్రకటించారు. జెడ్పీ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆమోదించేందుకు ఈనెల 15న కొలువుదీరిన సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కీలకమైన బడ్జెట్ ఆమోదం కోసం ఈనెల 29న మరోసారి సమావేశాన్ని నిర్వహించేందుకు మూడు జిల్లాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులకు సమాచారాన్ని పంపారు. మార్చి 31లోపు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, బడ్జెట్‌ను ఆమోదించాల్సిన కీలక సమయంలో మరోసారి వాయిదా వేశారు. సభ్యుల గైర్హాజరుతో వాయిదా పడిన రెండు వారాల వ్యవధిలో ఏర్పాటు చేసిన రెండవ సమావేశాన్ని సైతం వాయిదా వేయడంపై అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెడ్పీని పరిపాలిస్తున్న వారు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారో వారికే తెలియాలని అంటున్నారు.
అడ్డొచ్చిన టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం
ఈనెల 29న టీడీపీ వ్యవస్ధాపక దినోత్సవం దృష్ట్యా అదే రోజు జరగాల్సిన జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. ఆ రోజున ఏర్పాటు చేస్తే తాము హాజరు కాబోమని టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు చెప్పారు. దీంతో సమావేశాన్ని నిర్వహించలేమనే సాకుతో చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వాయిదా వేయడమే ఏకై క లక్ష్యంగా జెడ్పీటీసీ సభ్యులకు ఫోన్లు చేసి గురువారం గుంటూరులోని జెడ్పీకి పిలిపించుకున్నారు. వారికి విందు ఏర్పాట్లు చేసి సమావేశాన్ని వాయిదా వేసేందుకు సహకరించాల్సిందిగా బుజ్జగించారు. సమావేశాన్ని వాయిదా వేసేందుకు 50 శాతం సభ్యుల అంగీకారం అవసరం ఉండటంతో ఈ విధమైన ప్రయత్నాలు చేశారు. చైర్‌పర్సన్ ఆహ్వానం మేరకు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి వచ్చిన కొంత మంది జెడ్పీటీసీ సభ్యులు మెత్తపడ్డారు. ఎట్టకేలకు సమావేశాన్ని వాయిదా వేసేందుకు అంగీకరిస్తూ, సంతకాలు చేశారు. దీనిపై జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసును వివరణ కోరగా జెడ్పీలో ఓటు హక్కు కలిగిన మొత్తం 82 మంది సభ్యుల్లో 50 శాతానికి పైగా సభ్యులు సంతకాలు చేయడంతో వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. మరలా ఎప్పుడు నిర్వహించేదీ తదుపరి తెలియజేస్తామని చెప్పారు. కాగా కొంత మంది జెడ్పీటీసీ సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కాగా, సమావేశ వాయిదా కోరుతూ పలువురు ఎమ్మెల్యేలు లేఖలు పంపించారు.
జెడ్పీ సర్వసభ్య సమావేశం మరోసారి వాయిదా
షెడ్యూల్ ప్రకారం ఈనెల 29న జరగాలి
అదే రోజు టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందుబాటులో
ఉండకపోవడంతో వాయిదా నాటకం
జెడ్పీటీసీ సభ్యులకు ఫోన్లు చేసి గుంటూరుకు
ఆహ్వానించిన చైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా
సమావేశాన్ని వాయిదా వేసేందుకు
వీలుగా సంతకాలు చేయాలని బుజ్జగింపులు
ఎట్టకేలకు సగం మంది సభ్యులు
ఆమోదించడంతో వాయిదా వేసిన సీఈవో