
రేపటి నుంచి ‘స్లాట్ రిజిస్ట్రేషన్’
గుంటూరు వెస్ట్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం కూటమి ప్రభుత్వ ఆదేశాలతో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి రానుంది.
ప్రతి రోజూ 72 స్లాట్స్...
ఏదైనా ఆన్‌లైన్ కేంద్రంలో ముందుగా సంబంధిత రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అనువైన, ఖాళీ ఉన్న సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. అందులో కేటాయించిన సమయంలో కార్యాలయానికి వెళ్లి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు ఉంటుంది. గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 72 స్లాట్స్‌ను ప్రతి రోజూ అందుబాటులో ఉంచారు. స్లాట్ బుక్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశముండదని అధికారులు చెబుతున్నారు. నరసరావుపేటలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1, బాపట్లలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ స్లాట్ విధానం అందుబాటులో ఉంది. ముందుగా పైలెట్ ప్రాజెక్టును అమలు చేసి అందులోని ఇబ్బందులను అధిగమించి త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అమలు చేయనున్నారు. స్లాట్ బుక్ చేసుకుని దస్తావేజు మొత్తం సిద్ధం చేసుకుని ఎస్‌ఆర్వో కార్యాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది.
పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ కోసం ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి
అవగాహన కల్పిస్తాం
ఈ విధానం చాలా సులభతరం. స్లాట్ విషయంలో కొన్ని రోజులపాటు మేం ప్రజలకు అవగాహన కల్పిస్తాం. పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. గంటల కొద్దీ వేచి ఉండకుండా త్వరగానే రిజిస్ట్రేషన్ చేయించి పంపేందుకే ప్రభుత్వం ఈ నూతన విధానం అమలులోకి తెచ్చింది. ఇది పూర్తిగా ప్రజల సౌలభ్యం కోసమే.
– షరీల్ బాబు,
జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1, గుంటూరు