
దండకారణ్యంలో మారణకాండ ఆపాలి
నరసరావుపేట: దండకారణ్యంలో మారణకాండను వెంటనే నిలిపివేసి సుప్రీం కోర్టు న్యాయమూర్తితో ప్రభుత్వం విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ సెంటర్‌లో సోమవారం పౌర హక్కులు, ప్రజా సంఘాల నాయకులు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మధ్య భారతంలో, ముఖ్యంగా దండ కారణ్యంలో నిత్యం ఎన్‌కౌంటర్ల పేరుతో ఆదివాసీలు, మావోయిస్టులను హత్యలు చేస్తున్నారని తెలిపారు. ఆయుధాలతో మావోయిస్టులు సంచరిస్తే వారిని అరెస్ట్ చేయాలన్నారు. వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి మట్టు పెట్టడం, అణిచివేస్తాం, తుడిచేస్తాం అనే పదాలు రాజ్యాంగబద్ధం కాదని పేర్కొన్నారు. ఆరు నెలల పసి పిల్లలతో పాటు, యువకులు, మహిళలను పెద్దఎత్తున కాల్చి చంపడం, 2026 మార్చి 31 నాటికి అందరిని నిర్మూలిస్తామని హోం మంత్రి అమిత్‌షా బహిరంగ ప్రకటన చేస్తూ సవాల్ విసరడం చట్టబద్ధం, న్యాయబద్ధం కాదని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలలో మిలిటెంట్ సంస్థలతో కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకొని, వారి సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటిస్తున్న పాలకులు మావోయిస్టులు, ఆదివాసీల విషయంలో వారిని నిర్మూలించడమే తమ లక్ష్యం అనడంలోనే దుర్బుద్ధి కనిపిస్తోందని వివరించారు. మధ్య భారతంలో ఉన్న ఖనిజాలు, అటవీ సంపదను తరలించుకపోవటానికి అంబానీ లాంటి కార్పొరేటర్లతో ఒప్పందాలు చేసుకున్నారన్నారు. వాటిని అమలు చేయాలంటే అక్కడ వీరు అడ్డమని, వారిని చంపడమే పరిష్కారమని పాలకుల భావిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు దీంట్లో జోక్యం చేసుకొని న్యాయ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. 2024 జనవరి నుంచి నేటి వరకు 500 మందిని చంపేశారని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, పౌర హక్కుల సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ వినుకొండ పేరయ్య పాల్గొన్నారు.
పౌర హక్కులు,
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్