
జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట మహబూబాబాద్ కలెక్టర్
● కునాయికుంట కబ్జాపై
విచారణకు ఢిల్లీలో హాజరు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రత్తిరాంతండాలోని కునాయికుంట కబ్జా విషయంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాడు. కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ బుధవారం ఢిల్లీలో కమిషన్ ఎదుట హాజరయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రత్తిరాంతండా పరిధిలోని కునాయికుంటను గత ప్రభుత్వం హయాంలో కొంతమంది అక్రమంగా కబ్జా చేసి.. రెవెన్యూ అధికారుల మద్దతుతో పట్టాదారు పాస్‌బక్ పొందారు. ఈ విషయం అప్పటి కలెక్టర్, అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదు. 70 ఏళ్లు గిరిజన రైతులకు సాగునీరుకు ఉపయోగపడే కుంటను ఆక్రమించి పట్టాపొందారనే విషయాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ దృష్టికి మాజీ ఎంపీటీసీ మదన్ తీసుకెళ్లారు. ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈమేరకు ఆయన హాజరై కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిసింది.