
పొలంలో వరి దులుపుతుండగా..
భూపాలపల్లి రూరల్: పొలంలో ఆడ, మగ విత్తన వరి పంటను దులుపుతున్న క్రమంలో కాలుకు విద్యుత్ తీగ చుట్టుకోవడంతో షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం భూపాలపల్లి మండలం పంబపూర్‌లో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని పంబాపూర్‌కు చెందిన పిట్టల అభిషేక్(25) అదే గ్రామానికి చెందిన పులి సలమాను అనే రైతుకు చెందిన ఆడ, మగ వరి పంటను దులపడానికి కూలీకి వెళ్లాడు. మంగళవారం సామంత్రం వీచిన గాలి దుమారానికి పొలంలో11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. ఈ క్రమంలో అభిషేక్ పొలంలో వరి దులుపుతుండగా అతడి కాలుకు తీగ చుట్టుకుంది. దీంతో షాక్ తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సహ కూలీలు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే ప్రైవేట్ వాహనంలో భూపాలపల్లి ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అయితే అభిషేక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అభిషేక్‌కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు, భార్య సుకన్య ఉంది. కాగా, విద్యుత్ అధికారులు, పులిసలమాను నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడని వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, వృద్ధాప్యంలో తమను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కొడుకు మృతిచెందడంతో అభిషేక్ తల్లిదండ్రులు అనంతయ్య, కరుణమ్మ గుండెలవిసేలా రోదించారు.
కాలుకు చుట్టుకున్న విద్యుత్ తీగ
షాక్‌కు గురై యువకుడి మృతి
గాలి దుమారానికి తెగి పొలంలో
పడిన విద్యుత్ తీగ..