
డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కలిసి రావాలి
హన్మకొండ: డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి రోజున ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడంతోపాటు గంజాయి నిర్మూలనకు కృషి చేద్దామన్నారు. సోమవారం హనుమకొండ అంబేడ్కర్ భవన్‌లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ముందుగా అంబేడ్కర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే నాయిని, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్, అతిథులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్‌తో పిల్లలుతమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఇక్కడినుంచి వీటి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీఈ శ్రీలత, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ నవీన్ కుమార్, డీపీఆర్‌ఓ గంగవరపు వెంకట భానుప్రసాద్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జగన్‌మోహన్, మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ అంకేశ్వరపు రాంచందర్ రావు, వైస్ చైర్మన్ సుకుమార్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, చుంచు రాజేందర్, సింగారపు రవి ప్రసాద్, ఈవీ శ్రీనివాస్ రావు, వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి