
సుందరీమణుల సందర్శనకు ఏర్పాట్లు చేయండి
హన్మకొండ అర్బన్: వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు మే 14వ తేదీన వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాంప్లెక్స్‌హాల్‌లో సుందరీమణులు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. ప్రావీణ్య మాట్లాడుతూ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీ పోటీల్లో పాల్గొననున్న వారిలో 30 మంది వరంగల్ పర్యటనకు వస్తున్న దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహణతో చారిత్రక వారసత్వ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.సమావేశంలో జిల్లా ఖజానాఖాఖ అధికారి శ్రీనివాస్ కుమార్, నెహ్రూ యువకేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్, పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ శివాజీ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, కుడా పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, హనుమకొండ ఏసిపి దేవేందర్‌రెడ్డి, ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక చేయాలి
ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, పరకాల ఆర్డీఓ కె.నారాయణ, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ పాల్గొన్నారు.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి
వరంగల్: గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్‌లో ఎంపీడీఓలతో మంగళవారం వేసవి నీటి ఎద్దడి నివారణ, ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి మాట్లాడారు. ఈనెల 30 నుంచి మే 31 వరకు ఉష్టోగ్రతలు పెరగడం వల్ల భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం ఉంటుందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాలవారీగా ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయి అధికారులు మరోసారి స్క్రూటీని చేయాలని అదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టాలి
ఖిలా వరంగల్: నకిలీ విత్తనాలను అధికారులు సమన్వయంతో ఆరికట్టాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం వరంగల్ శివనగర్‌లోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్‌లో వ్యవసాయ జిల్లా అధికారి అనురాధ అధ్యక్షతన విత్తన, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్లు, వ్యవసాయ అధికారుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, డీలర్ల అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు, ఏసీపీ కిరణ్‌కుమార్, ఏసీపీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
మహాసభను విజయవంతం చేయాలి
హన్మకొండ: తెలంగాణ ప్రజాఫ్రంట్ వరంగల్, హనుమకొండ జిల్లాల నాలుగో మహా సభను విజయవంతం చేయాలని ఆ ఫ్రంట్ వరంగల్, హనుమకొండ జిల్లాల కన్వీనర్ జనగాం కుమారస్వామి పిలుపునిచ్చారు. హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం మహాసభ పోస్టర్‌ను ప్రజాఫ్రంట్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజాఫ్రంట్ నాలుగో జిల్లా మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ హరగోపాల్, పాశం యాదగిరి, ప్రొఫెసర్ కాశీం, అనిశెట్టి రజిత, గాదె ఇన్నయ్య తదితరులు ఈ సభలో ప్రసంగిస్తారని వివరించారు. కార్యక్రమంలో గొల్లూరి ప్రవీణ్ కుమార్, బి.రమాదేవి, వెంగళ్‌రెడ్డి, సుధీర్ బాబు, ఇంద్రసేనా, పాపయ్య, ఎన్.రఘుశర్మ, గాదరి ఉప్పలయ్య, సందీప్, కళ్యాణ్, డి.జ్యోతిరమణి, వెంకటేశ్వర్లు, రమేశ్‌చందర్, కుమార్, రాజేందర్, భిక్షపతి, తిరుపతి, సత్యనారాయణ పాల్గొన్నారు.

సుందరీమణుల సందర్శనకు ఏర్పాట్లు చేయండి