అర్హుల ఎంపికలో మార్గదర్శకాలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

అర్హుల ఎంపికలో మార్గదర్శకాలు తప్పనిసరి

Apr 17 2025 1:08 AM | Updated on Apr 17 2025 1:08 AM

అర్హుల ఎంపికలో మార్గదర్శకాలు తప్పనిసరి

అర్హుల ఎంపికలో మార్గదర్శకాలు తప్పనిసరి

హన్మకొండ అర్బన్‌: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని హనుమకొండ అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఎంపిక తీరుపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో బుధవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన వారి ఎంపికను ఇందిరమ్మ కమిటీతో కలిసి అధికారులు చేయాలన్నారు. మే 2వ తేదీన ఎంపిక చేసిన వారి జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలన్నారు. వేసవి నేపథ్యంలో.. జిల్లాలో ఎక్కడా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట చేతిపంపులకు మరమ్మతులు చేయించాలన్నారు. అనంతరం మిషన్‌ భగీరథ ఎస్‌ఈ మల్లేశం మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు, ఆవాసాలకు తాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి చర్యలు చేపడతామని అధికారులకు సూచించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులు అడిగిన పలు సందేహాలకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రవీందర్‌ వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి

అధికారులతో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement