గౌతం కింద పడింది ఇక్కడి నుంచే (సర్కిల్‌లో)
సాక్షి, సనత్‌నగర్: భవనం ఐదో అంతస్తు నుంచి కిందపడి ఓ అంధ విద్యార్థి మృతి చెందిన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై జయచందర్ వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ ప్రాంతంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన వెంకట రవికుమార్ కుమారుడు గౌతం లక్ష్మీశ్రీకర్ (12) బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలో ఆరో చదువుకుంటున్నాడు. గౌతం బాధ్యతలను చూసుకునేందుకు తల్లిదండ్రులు ఓ కేర్‌టేకర్‌నూ నియమించారు.
ఆ కేర్‌టేకర్‌తో కలిసి రోజూ పాఠశాలకు వెళ్తుంటాడు. భవనం నాలుగో అంతస్తులోని తరగతి గదిలో చదువుకుంటుంటాడు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు కేర్ టేకర్ కూడా గౌతంతో పాటు ఉంటుంది. రోజూలాగే పాఠశాలకు వచ్చిన గౌతంను గురువారం ఎవరూ గమనించకపోవడంతో మెట్లమార్గంలో ఉన్న రెయిలింగ్‌ను పట్టుకొని ఐదో అంతస్తు వరకు వెళ్లాడు.
అయితే అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా కాంట్రాక్టర్ మెటీరియల్‌ను యంత్రం ద్వారా పైకి తరలించేందుకు సులువుగా ఉండేందుకు ప్రహరీని కొంతమేర కూల్చివేశారు. అలా నడుచుకుంటూ మెటీరియల్ సప్లై కోసం ప్రహరీ పగులగొట్టిన ప్రాంతం నుంచి నేరుగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కనీసం ప్రహరీ ఉన్నా ఆ విద్యార్థి ప్రాణాలు దక్కేవని స్థానికులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment