సనా: యెమెన్‌లోని ఏడెన్ నగర విమానాశ్రయంలో భారీ పేలుడు జరిగింది. దేశంలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్ మంత్రులతో కూడిన విమానం రావడానికి కొంచెం ముందు ఈ పేలుడు సంభవించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. పేలుడుకు కారకుల వివరాలు తెలియరాలేదు. పేలుడులో 22మంది పౌరులు మరణించగా, 50మంది గాయపడ్డారు. పేలుడు సమాచారం తెలియగానే ప్రధాని, ఇతర మంత్రులు వెంటనే ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోని ప్యాలెస్‌కు తరలిపోయారు. అయితే ప్యాలెస్‌కు సమీపంలోకూడా మరో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి నష్టం వాటిల్లినట్లు తెలియరాలేదు. విమానం వచ్చాక బాంబులు పేలినట్లయితే పరిస్థితి ఘోరంగా ఉండేదని కమ్యూనికేషన్ మంత్రి నగుబి ఆల్ అవగ్ అన్నారు.
ప్రస్తుతం ఎయిర్‌పోర్టును భద్రతా బలగాలు అధీనంలోకి తీసుకొని విచారణ జరుపుతున్నాయి. పేలుళ్లను ఐరాస తీవ్రంగా ఖండించింది. ఈజిప్ట్, జోర్డాన్, అరబ్‌దేశాలు సైతం దాడులను ఖండించాయి. 2014 నుంచి యెమెన్‌లో పౌరయుద్ధం, అశాంతి కొనసాగుతున్నాయి. సౌదీ బలపరిచే ప్రభుత్వాధినేత మన్సూర్ హది, దక్షిణాన యూఏఈ బలపరిచే సెపరేటిస్టులు, ఇతర ప్రాంతంలో ఇరాన్ బలపరిచే హౌతి రెబెల్స్ మధ్య పట్టుకోసం పోరాటం కొనసాగుతోంది. తాజాగా హది, సదరన్‌సెపరేటిస్టుల సంతృప్తి కోసం వారిని కూడా కలుపుకొని కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. యెమెన్ అంతర్యుద్ధంలో ఇప్పటికి దాదాపు 1.12 లక్షల మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment