బీరూట్: లెబనాన్ రాజధాని పోర్టులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల పోర్టులో సంభవించిన భారీ పేలుళ్ల ఘటన మరవకముందే తాజాగా గురువారం మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆయిల్, టైర్లు నిల్వ ఉంచిన గోడాన్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాద ఘటనపై సమాచారం అందగానే అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టి లెబనాన్ ఆర్మీ హెలికాప్టర్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోర్టు సమీపంలోని కార్యాలయాలను ఖాళీ చేయాల్సిందిగా లెబనాన్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ప్రమాద ఘటనలో కార్మికులంతా భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆగష్టు 4న బీరూట్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం విధితమే. పోర్టు ప్రాంతంలో అక్రమంగా అమ్మోనియం నైట్రేట్‌లు నిల్వ ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిపుణలు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో 191 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. అంతేగాక వేలల్లో ఇళ్లు ధ్వంసంకావడంతో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment