న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఆవిర్భవించిన వుహాన్ నగరంలో పట్టుమని పది రోజుల్లో పది వేల పడకల ఆస్పత్రిని నిర్మించి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన చైనా, ఇప్పుడు అంతకంటే ఆశ్చర్యపరిచే మహత్కార్యానికి శ్రీకారం చుట్టింది. కరోనా వైరస్ లేదా అలాంటి మహమ్మారీల దాడులు భవిష్యత్తులో కూడా ఎదురయ్యే అస్కారం ఉందన్న దూరదృష్టితో కరోనా లేదా మరో వైరస్ రహిత నగరాన్ని నిర్మిస్తోంది.
వైరస్‌ల మనుగడకు ఆస్కారం లేనివిధంగా ఆకాశాన్నంటే ఎత్తైన హర్మ్యాల్లో విశామైన బాల్కనీలు కలిగిన భవన సముదాయాలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. భవిష్యత్ లాక్‌డౌన్‌ల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా ‘స్వీయ సమృద్ధి కలిగిన నగరం’ పేరిట బీజింగ్ నగరానికి చేరువలో ‘లండన్, న్యూయార్క్’ నగరాలను కలిపితే వచ్చే విస్తీర్ణంలో ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తోంది. నగరంలో ఎక్కడ చూసిన ఆకుపచ్చదనం అలరించే విధంగా వీధులను తీర్చిదిద్దడంతోపాటు ప్రతి భవన సముదాయంలో అందులోని వాసులకు సరిపడ కూరగాయలు ఆ ప్రాంగణంలోనే పండిస్తారు. ప్రస్తుతముండే స్విమ్మింగ్ పూల్స్, షటిల్ కోర్టులు, జిమ్ములు, పబ్‌లతోపాటు ఎన్నో అదనపు, ఆస్పత్రి సౌకర్యాలతో వీటిని తీర్చి దిద్దుతారు. (చదవండి: కార్పొరేట్ ఆస్పత్రుల ‘కరోనా కాటు’)
నగరంలో నడిచే బాట సారుల కోసం, సైక్లిస్టుల కోసమే కాకుండా ద్విచక్ర, చతుర్‌చక్ర వాహనాల కోసం కూడా ప్రత్యేక రహదారులను నిర్మించనున్నారు. ఇక నేరుగా ఆహారాన్ని, ఔషధాలను, ఇతర అత్యవసర సేవలను డ్రోన్‌ల ద్వారా అందించేందుకు వీలుగా బాల్కనీలను విశాలంగా నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటిలో త్రీ డీ ప్రింటర్లు అందుబాటులో ఉంటాయి. కరోనా లాంటి వైరస్‌లను కట్టడి చేయడం కోసం లాక్‌డౌన్‌లు ప్రకటించినట్లయితే ఇల్లు కదలకుండా ఉండేందుకు అవసరమైన సకల సౌకర్యాలను ఈ భవనాల్లో అందుబాటులో ఉంటాయి. (కరోనా లక్షణాలు లేనివారిలో.. వెరీ డేంజర్!)
ఈ నగర నిర్మాణానికి సంబంధించి చైనా ప్రభుత్వం గత నెలలో నిర్వహించిన ఆర్కిటెక్చర్ పోటీల్లో బార్సిలోనాకు చెందిన గ్వాలర్ట్ ఆర్కిటెక్ట్ బృందం రూపొంచిన మోడళ్లు ప్రథమ బహుమతిని అందుకున్నాయి. ప్రతి భవన సముదాయంలో పునర్వినియోగ ఇంధనతోపాటు కర్రతో చేసిన బ్లాకులు, భవనం కప్పుపైన వ్యవసాయోత్పత్తుల ఫామ్‌లు ఉంటాయి. బీజింగ్ నగరానికి నైరుతి దిశలో 130 కిలోమీటర్ల దూరంలో రెండువేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవానికి చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ ఈ నగరం నిర్మాణానికి 2017లో వ్యూహ రచన చేయగా ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది.
భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు దీటుగా ‘వర్క్ ఫ్రమ్ హోం, డిజిటల్ ఎడ్యుకేషన్’ లాంటి పథకాలను నూటికి నూరు పాళ్లు అమలు చేసేందుకు వీలుగా, ప్రతి భవనం టెర్రాస్‌పైన 5జీ టెలికామ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని వివిధ ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ నగరం ప్రణాళికను రూపొందించామని, అతి కొద్ది రోజుల్లోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. నగర నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో, ఎన్ని ఏళ్లలో పూర్తవుతుందో మాత్రం అధికార వర్గాలు వెల్లడించలేదు. (చదవండి: గురకపెట్టే వారికి కరోనా ముప్పు ఎక్కువ!)
Comments
Please login to add a commentAdd a comment