ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ దళాలు తమ వరుస దాడులతో హమాస్,హెజ్‌బొల్లా అగ్ర నేతలను ఒక్కొక్కరిగా హతమార్చుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రదారి యాహ్యా సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. గాజాలోని ఓ ఇంటిపై చేసిన దాడిలో సిన్వర్ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన రెండు రోజులకే ఓ ఆందోళనకర ఘటన చోటుచేసకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.
లెబనాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ శనివారం దక్షిణ హైఫాలోని సిజేరియాలోని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. ఈ డ్రోన్ దాడిలో భవనం కొంత భాగం దెబ్బతింది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి జరిగిన సమయంలో నెతన్యాహు, అతని భార్య అక్కడ లేరని ప్రధాని ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
కాగా లెబనాన్ నుంచి ప్రయోగించిన మరో రెండు డ్రోన్‌లను ఇజ్రాయెల్ వాయు దళాలు టెల్ అవీవ్ ప్రాంతంలో కూల్చివేశాయి. అయితే మూడోది మాత్రం సిజేరియాలోని ఓ భవనాన్ని ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. సిజేరియాలోని భవనాన్ని ఢీకొనడానికి ముందు డ్రోన్ లెబనాన్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఎగిరిందని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment