గాల్లో తేలుతున్న భారీ నౌకలు | Fata Morgana: Man Stunned After Spotting Ship Floating Across The Sky | Sakshi
Sakshi News home page

గాల్లో తేలుతున్న భారీ నౌకలు

Published Mon, Mar 22 2021 2:21 PM | Last Updated on Mon, Mar 22 2021 6:43 PM

Fata Morgana: Man Stunned After Spotting Ship Floating Across The Sky - Sakshi

ఇక్కడ నౌకలు గాల్లో ఎగురుతాయి. చిన్న చిన్నవే కాదు.. అత్యంత భారీ నౌకలు కూడా గాల్లో తేలుతూ ఉంటాయి. అలా తేలుతున్న నౌకలను కళ్లతో చూడటమే కాదు, ఫొటోలూ తీసుకోవచ్చు. ఇదేంటి అంటారా? అంతా మన వాతావరణంలో ఉండే కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడే దృష్టి భ్రమ (ఇల్యూషన్‌). సింపుల్‌గా చెప్పాలంటే.. వేసవిలో కనిపించే ఎండమావుల లాంటి పరిస్థితి అనొచ్చు. సముద్రంలో దూరంగా ఉన్న నౌకలు గాల్లో తేలుతున్నట్టుగా కనిపించే ఈ దృష్టి భ్రమను ‘ఫటా మోర్గానా’ అంటారు. నౌకలేకాదు.. దూరంగా సముద్రం కూడా కొంత పైకి లేచినట్టుగా అనిపిస్తుంటుంది. పలుచోట్ల సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి కాస్త అరుదుగా ఈ తరహా దృష్టి భ్రమ కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని కార్న్‌వాల్, డెవన్, అబెర్డీన్‌షైర్‌ తీర ప్రాంతాల్లో ఇటీవల కొందరు ఇలా నౌకలు గాల్లో తేలుతున్నట్టు గా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి.

ఏమిటీ ఫటా మోర్గానా? 
సముద్ర తీర ప్రాంతాల్లో ఎండగా ఉన్నప్పుడు.. ఓ వైపు భూమి, మరోవైపు సముద్ర ఉపరితలం వేడెక్కుతాయి. వీటికి ఆనుకుని ఉన్న గాలి కూడా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన గాలి తేలికగా మారి పైకి వెళుతూ.. చల్లటి గాలి కిందికి దిగుతుంది. దీనివల్ల కింద ఉన్న గాలి చల్లగా, ఆపై కొంత వేడిగా, ఇంకాపైన మరింత వేడిగా.. గాలి పొరలు పొరలుగా ఏర్పడుతుంది. ఈ పొరలు నీటిపై వేరుగా, భూమిపై వేరుగా ఉంటాయి. 

సముద్రంలో దూరంగా ఉన్న నౌకల నుంచి వచ్చే కాంతి.. ఇలా వేర్వేరుగా ఉన్న గాలి పొరల్లోంచి వెళుతున్నప్పుడు వంగి ప్రయాణిస్తుంది. చివరిగా మన కంటికి చేరే సమయానికి బాగా వంగి ఉంటుంది. కానీ మన కన్ను, మెదడు సాధారణంగా.. కాంతి సరళ రేఖా మార్గాన్ని(స్ట్రెయిట్‌ లైన్‌ను) పరిగణనలోకి తీసుకుంటాయి. ఆ స్ట్రెయిట్‌ లైన్‌లో నౌక ఉన్నట్టు గుర్తిస్తాయి. దీంతో నౌకలు సముద్రంపై గాల్లో ఎగురుతున్నట్టుగా కనిపిస్తాయి. దీనినే ‘ఫటా మోర్గానా’అంటారు. కొన్నిసార్లు భూమిపైన కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి. 

సాధారణంగా ఏదైనా వస్తువుపై పడిన కాంతి ప్రతిఫలించి.. నేరుగా సరళ రేఖా మార్గంలో ప్రయాణించి మన కంటిని చేరుతుంది. మన కళ్లు, మెదడు అదే స్ట్రెయిట్‌ లైన్‌ను పరిగణనలోకి తీసుకుని.. ఆ స్థానంలో సదరు వస్తువు ఉన్నట్టు గుర్తిస్తాయి. అయితే గాజు, నీళ్లు, గాలి వంటి వేర్వేరు వాటిల్లో కాంతి ప్రయాణిస్తున్నప్పుడు.. వాటి సాంద్రత, ఉష్ణోగ్రత వేరుగా ఉండటంతో వంగుతుంది. ఆ వస్తువులు భిన్నంగా కనిపిస్తాయి. ఉదాహరణకు గాజు గ్లాసులో నీళ్లు పోసి, ఏదైనా కర్ర, పెన్ను వంటివి పెడితే.. నీళ్లలోపల ఉన్న భాగం వంగి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటివి చాలా వరకు మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి.



బ్రిటన్‌లోని బోర్న్‌మౌత్‌ తీర ప్రాంతంలో గాల్లో తేలుతున్నట్టుగా కనిపించిన ‘ది ఆంథెం’నౌక ఇది. 347 మీటర్ల పొడవు, లక్షన్నర టన్నుల బరువున్న ఈ భారీ నౌకలో ఐదు వేల మందివరకు ప్రయాణించొచ్చు. బ్రిటన్‌లోని గిల్లాన్‌ ప్రాంతంలో గాల్లో తేలుతున్నట్టుగా కనిపించిన భారీ షిప్‌ ఇది. డేవిడ్‌ మోరిస్‌ అనే వ్యక్తి ఈ ఫొటో తీశారు.

చదవండి:

జూన్ 1 తర్వాత ఆ బంగారం అమ్మలేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement