న్యూఢిల్లీ: జర్మనీ విమర్శలకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. ప్రముఖ ఫ్యాక్ట్‌చెకర్ ముహమ్మద్ జుబేర్ అరెస్ట్ వ్యవహారంపై జర్మనీ విదేశాంగ శాఖ.. భారత ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఈ తరుణంలో.. భారత్ గట్టిగానే బదులిచ్చింది.
ఉచిత రిపోర్టింగ్ ఏ సమాజానికైనా ప్రయోజనకారిగా ఉంటుంది. వాళ్లపై పరిమితులు ఆందోళన కలిగిస్తాయి. జర్నలిస్టులు ఏం మాట్లాడినా.. రాసినా వారిపై వేధింపులకు పాల్పడడం, నిర్భంధించడం లాంటివి చేయకూడదు. ఈ నిర్దిష్ట కేసు(జుబైర్ అరెస్ట్‌ను ప్రస్తావిస్తూ..) గురించి మాకు నిజంగా తెలుసు. న్యూఢిల్లీలోని మా(జర్మనీ) రాయబార కార్యాలయం దీన్ని చాలా నిశితంగా పరిశీలిస్తోంది అని జర్మనీ విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ రియాక్ట్ అయ్యింది.
‘‘ఇది మా అంతర్గత వ్యవహారం. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానంలో ఉంది. మా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అలాంటి వ్యవస్థపై మీ కామెంట్లు సరికాదు. ప్రస్తుతానికి మీకనవసరం’’ అంటూ విదేశాంగ కార్యదర్శి అరిందమ్ బాగ్చి, జర్మనీ కామెంట్లకు బదులిచ్చారు.
ఇదిలా ఉంటే.. పత్రికా స్వేచ్ఛా, భావ స్వేచ్ఛ ప్రకటన అంశాల ఆధారంగా యూరోపియన్ యూనియన్ తరపున మానవ హక్కుల సంఘం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ప్రకటించుకుంటుంది. అలాంటప్పుడు.. ప్రజాస్వామ్య విలువలైన ప్రతికా స్వేచ్ఛ, భావ ప్రకటనలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ జర్మనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది.
ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహవ్యవస్థాపకుడైన జుబేర్‌ను.. జూన్ 27వ తేదీన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో చేసిన ఓ ట్వీట్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద పలు ఆరోపణలపై 14 రోజుల క్టసడీకి తీసుకున్నారు. ప్రాణ హాని ఉందని, బెయిల్ మంజూరు చేయాలంటూ జుబేర్ దాఖలు చేసిన పిటిషన్ మీద రేపు(శుక్రవారం) సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.
చదవండి: చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment