ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం 21వ రోజుకి చేరింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది. హమాస్‌ను నామరూపాలు చేస్తామని, అందుకోసం గాజాను సర్వనాశనం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకుంది ఇజ్రాయెల్. ఇప్పటికే తమ దళాలకు గాజాపై భూతల దాడికి సిగ్నల్స్ ఇచ్చింది.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 7,028 మంది చనిపోయినట్టు గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో 3 వేల మంది చిన్నారులు ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మృతదేహాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. శవాల గుర్తింపు కోసం బయటకు వస్తే.. ఎక్కడ ప్రాణాలు పోతాయోననే భయంతో గడుపుతున్నారు. చివరకు అంత్యక్రియలు కూడా సజావుగా నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదని గాజా అధికారులు చెబుతున్నారు.
మరోవైపు.. ఏ బంధీలనైతే సురక్షితంగా విడిపించాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందో.. వాళ్ల ప్రాణాల్నే బలిగొంటోందన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలోని ఈజిప్టు పట్టణాన్ని ఇజ్రాయెల్ మిసైల్ తాకిన ఘటనలో 50 మంది బందీలు మరణించినట్టు హమాస్ ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్‌లో రాతంత్రా జరిపిన దాడుల్లో 60 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది. తూర్పు జెరూసెలంతో వేరేగా జరిపిన దాడుల్లో మరింత మంది అరెస్ట్ అయినట్టు ‘అల్ జజీరా’ పేర్కొంది.
ఇజ్రాయెల్-లెబనాన్-సిరియా మధ్య సీమాంతర పోరు కూడా జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. యుద్ధం ఇప్పట్లో ఆగే సంకేతాలు కనిపించకపోవడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాలస్తీనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన సామగ్రిని సరఫరా చేసేందుకు అనుమతించాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment