డెయిర్ అల్–బలాహ్: గాజాలోని పాలస్తీనియన్లు కనీసం తాగునీరు కూడా దొరకని దుర్భర పరిస్థితుల్లో అల్లాడుతున్నా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను యథేచ్ఛగా సాగిస్తోంది. శనివారం రాత్రి మొదలైన వైమానిక దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో ఐదుగురు చిన్నారులు సహా 22 మంది మృత్యువాతపడ్డారు. గాజా నగరంలోని శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాలపై జరిగిన దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది చనిపోయారు.
అయితే, అక్కడ హమాస్ మిలిటెంట్లున్నారని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. డెయిర్ అల్–బలాహ్ నగరంలోని ఓ ఇంటిపై శనివారం రాత్రి జరిగిన మరో దాడిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిదిమంది మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మరో ఆరుగురు చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇలా ఉండగా, గాజాలో స్వల్ప సంఖ్యలో ఉన్న క్రైస్తవులు క్రిస్మస్ ముందస్తు వేడుకలు జరిపేందుకు ఆ ప్రాంతంలోకి ఆదివారం కార్డినల్ పియెర్‌బటిస్టా పిజ్జబల్లాను ఇజ్రాయెల్ ఆర్మీ అనుమతించింది. వేడుకలు జరుగుతుండగా ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ డ్రోన్లతో పహారా కాసింది. ఇజ్రాయెల్ ఆంక్షల వల్ల బిషప్ గాజాలోకి వెళ్లలేకపోయినట్లు పోప్ ఫ్రాన్సిస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment