ట్రంప్‌ ఓ లూజర్‌ | Joe Biden to pass torch to Kamala Harris in bittersweet convention farewell | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఓ లూజర్‌

Published Wed, Aug 21 2024 5:11 AM | Last Updated on Wed, Aug 21 2024 5:11 AM

Joe Biden to pass torch to Kamala Harris in bittersweet convention farewell

వీడ్కోలు ప్రసంగంలో బైడెన్‌

అతడి బారినుంచి దేశాన్ని కాపాడుకుందాం 

డెమొక్రాట్లకు, అమెరికన్లకు అధ్యక్షుని పిలుపు 

అట్టహాసంగా మొదలైన డెమొక్రాట్ల కన్వెన్షన్‌ 

బైడెన్‌కు 4 నిమిషాలు స్టాండింగ్‌ ఒవేషన్‌ 

తొలి రోజు ఆద్యంతం భావోద్వేగాలు

షికాగో: డొనాల్డ్‌ ట్రంప్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఓవైపు అధ్యక్ష అభ్యరి్థగా పోటీ చేస్తూ మరోవైపు అమెరికాను విఫల దేశంగా అభివర్ణిస్తున్నారు. అదీ ట్రంప్‌ స్థాయి! అన్ని విషయాల్లోనూ ట్రంప్‌ ఇప్పటికే ఓడిపోయారు. ఆయనో లూజర్‌’’ అంటూ తూర్పారబట్టారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు గెలిచి అమెరికాను మరోసారి గెలిపిస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. పార్టీ అధ్యక్ష అభ్యరి్థ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం షికాగోలో డెమొక్రటిక్‌ పార్టీ జాతీయ కన్వెన్షన్‌ (డీఎన్సీ)ను ఉద్దేశించి బైడెన్‌ వీడ్కోలు ప్రసంగం చేశారు.

రాజకీయ నాయకునిగా ఆయన తన 52 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తున్న సందర్భంగా తొలి రోజు భేటీ ఆద్యంతం అత్యంత ఉద్వేగపూరితంగా సాగింది. హారిస్‌ కోసం అధ్యక్ష బరి నుంచి తప్పుకుని డెమొక్రాట్ల విజయావకాశాలను అమాంతంగా పెంచేసిన 81 ఏళ్ల బైడెన్‌ను నేతలు, ప్రతినిధులు ముక్త కంఠంతో ప్రశంసించారు. సమావేశానికి ఆయనకు అపూర్వరీతిలో స్వాగతం పలికారు. ఆయన తన స్థానం నుంచి లేచింది మొదలు వేదికనెక్కేదాకా ఆద్యంతం కరతాళ ధ్వనులతో హోరెత్తించారు.

బైడెన్‌ మాట్లాడటం ప్రారంభించగానే సభలో ఉది్వగ్న వాతావరణం నెలకొంది. ‘వుయ్‌ లవ్‌ జో!’, ‘థాంక్యూ జో’ అంటూ ప్రతినిధులంతా ప్లకార్డులు ప్రదర్శించారు. నాలుగు నిమిషాలకు పైగా స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. దాంతో భావోద్వేగానికి లోనైన బైడెన్‌ కాసేపు ప్రసంగాన్ని ఆపేశారు. కృతజ్ఞతాపూర్వకంగా పదేపదే ‘థాంక్యూ...’ అంటూ నిలబడిపోయారు. ‘కమలకు కూడా కృతజ్ఞతలు. ఆమె అమెరికాకు 47వ ప్రెసిడెంట్‌ కావడం తథ్యం’ అన్నారు. 59 ఏళ్ల హారిస్‌ డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వాన్ని గురువారం లాంఛనంగా అంగీకరించనున్నారు. నవంబర్‌ 5న జరిగే ఎన్నికలో 78 ఏళ్ల ట్రంప్‌తో ఆమె తలపడతారు. 

సర్వస్వం దేశానికే ధార పోశా: తాను, హారిస్‌ ఈ నాలుగేళ్లలో అపూర్వ విజయాలు సాధించామని బైడెన్‌ చెప్పుకొచ్చారు. అధ్యక్షునిగా కొన్ని తప్పులు చేసినా దేశం కోసం సర్వస్వం ధారపోశానంటూ ఆత్మవిమర్శ చేసుకున్నారు. ‘‘2020లో కుమారుని మృతితో నా ఆత్మలో ఓ భాగాన్ని శాశ్వతంగా కోల్పోయా. అయినా ట్రంప్‌ వంటి విచి్ఛన్న శక్తిని నిలువరించేందుకు అంతటి బాధనూ పక్కన పెట్టి మరీ అధ్యక్ష బరిలో దిగా. అలా 2020లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం. 2024లో మరోసారి కాపాడుకోవాలి’’ అంటూ డెమొక్రాట్లకు, అమెరికన్లకు పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడిన డెమొక్రాట్‌ నేతలంతా అధ్యక్షునిగా బైడెన్‌ అందించిన సేవలు చిరస్మరణీయమంటూ ప్రస్తుతించారు.

వేదిక బయట ‘గాజా’ నిరసనలు
గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును వ్యతిరేకిస్తూ వేలాదిగా పోటెత్తిన నిరసనకారులతో షికాగో వీధులు నిండిపోయాయి. కన్వెన్షన్‌ సమీపంలో వారు ఆందోళనకు దిగారు. సమూహాలుగా విడిపోయి భద్రతా వలయాలను బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశారు. వారి ఆందోళనల్లో న్యాయముందని బైడెన్‌ తన ప్రసంగంలో అన్నారు. ఇరువైపులా అమాయకులను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హారిస్‌... చరిత్రాత్మక ప్రెసిడెంట్‌ అవుతారు: బైడెన్‌
డెమొక్రాట్‌ నేతలు, ప్రతినిధుల అభిమానపు జల్లుల్లో తడిసి ముద్దైన బైడెన్‌.. ‘అమెరికా, ఐ లవ్‌ యూ’ అంటూ 50 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు. పార్టీ బాధ్యతలను లాంఛనంగా హారిస్‌కు అప్పగించారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగిన మేటి నేత హారిసేనన్నారు. ఆమె చరిత్రాత్మక ప్రెసిడెంట్‌గా నిలుస్తారంటూ జోస్యం చెప్పారు.

‘‘హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎంచుకోవడం, ఇప్పుడు నాకు బదులుగా అధ్యక్ష అభ్యర్థిగా నిలపడం నా అత్యుత్తమ నిర్ణయాలు’’ అని చెప్పుకొచ్చారు. హారిస్‌కు, ఆమె రన్నింగ్‌ మేట్‌ వాల్జ్‌కు ఓ ఉత్తమ కార్యకర్తగా అన్నివిధాలా సహకరిస్తానన్నారు. ‘స్వేచ్ఛ కోసం ఓటేసేందుకు, హారిస్‌ను ప్రెసిడెంట్‌గా ఎన్నుకునేందుకు మీరంతా సిద్ధమేనా?’ అంటూ బైడెన్‌ ప్రశ్నించడంతో వేలాది మంది ప్రతినిధులు సిద్ధమేనంటూ పిడికిళ్లు బిగించి నినదించారు.

బైడెన్‌ కంటతడి 
బైడెన్‌ వేదికపైకి రాగానే ఆయన గురించి కూతురు యాష్లీ పరిచయ వాక్యాలు చెప్పారు. తన తండ్రి మహిళల పక్షపాతి అని చెప్పుకొచ్చారు. వారిని ఆయన ఎంతగా గౌరవిస్తారో స్వయంగా చూశానన్నారు. దాంతో బైడెన్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. పక్కకు తిరిగి కళ్లు తుడుచుకుని కూతుర్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలగడం బైడెన్‌ రాజకీయ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన నిర్ణయమని ఆయన భార్య జిల్‌ బైడెన్‌ ఈ సందర్భంగా అన్నారు.

నాడు మరీ కుర్రాణ్ని.. నేడు మరీ ముసలాణ్ని
ఈ సందర్భంగా తన వయసు గురించి బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తొలిసారి సెనేటర్‌గా ఎన్నికైనప్పుడు మరీ కుర్రాడిని. 30 ఏళ్లు కూడా నిండలేదు. ఇప్పుడేమో అమెరికా అధ్యక్షునిగా కొనసాగేందుకు మరీ ముసలివాడినైపోయాను’’ అంటూ చమత్కరించారు.  

గాజుతెరను బద్దలు కొడుతుంది 
హారిస్‌పై హిల్లరీ ప్రశంసలు హారిస్‌పై మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సిన విజన్, అనుభవం, వ్యక్తిత్వం ఆమెలో పుష్కలంగా ఉన్నాయన్నారు. 76 ఏళ్ల హిల్లరీ వేదికపైకి రాగానే సభికులంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. ‘‘హారిస్‌ అమెరికాకు తొలి అధ్యక్షురాలవడం, తద్వారా దేశ చరిత్రలోనే అత్యంత కఠినమైన, అతి పెద్దదైన గాజుతెరను బద్దలు కొట్టడం ఖాయం. మనమంతా కలిసికట్టుగా కొట్టిన దెబ్బలకు ఆ తెర ఇప్పటికే బీటలువారింది. దాన్ని పూర్తిగా బద్దలు కొట్టే సత్తా హారిస్‌కుంది’’ అని ఆమె జోస్యం చెప్పారు.

రుణపడి ఉంటాం: హారిస్‌ 
బైడెన్‌ ప్రసంగానికి ముందు హారిస్‌ మాట్లాడారు. ఆమె ప్రసంగం షెడ్యూ ల్‌లో లేకపోయినా బైడెన్‌ను కృతజ్ఞతలు తెలిపేందుకు వేదికపైకొచ్చారు. ఆయన నాయకత్వాన్ని, సేవలను కొనియాడారు. ‘జో, మీకెప్పటికీ రుణపడి ఉంటాం. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాం’’ అన్నారు. హారిస్‌ మాట్లాడుతున్నంతసేపూ సభికులు హర్షధ్వానాలతో హోరెత్తించారు.

నిన్ను చూసి గరి్వస్తున్నా: ఒబామా 
మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా బైడెన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘జో, మీ హుందాతనాన్ని, లక్ష్యసాధన పట్ల మీరు చూపే అచంచలమైన విశ్వాసాన్ని ఆరాధిస్తా. నాలుగేళ్లుగా మీరు అమెరికాకు ఇచి్చన అత్యంత అమూల్యమైన విలువలు ఇవే. మిమ్మల్ని ప్రెసిడెంట్‌ అని పిలవడం నాకెప్పుడూ గర్వకారణమే. మీరు నా స్నేహితునివని చెప్పుకునే అవకాశమిచ్చినందుకు కృతజ్ఞుడిని’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement