
వాషింగ్టన్: కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడంలో విఫలం చెందు తున్న సోషల్ మీడియా కంపెనీలు పరోక్షంగా ప్రజల మరణాలకు కారణమవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. వ్యాక్సిన్లు వేసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటూ ఫేస్‌బుక్‌లో వస్తున్న తప్పుడు వార్తలపై అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి గురువారం స్పందించారు.
కరోనా సంబంధిత అన్ని సమస్యలను టీకా ద్వారా నివారించవచ్చని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బైడెన్ దీనిపై స్పందించారు. ఫేస్‌బుక్‌లాంటి ప్లాట్‌ఫాంలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని మీడియా బైడెన్ ప్రశ్నించింది. అందుకు ఆయన సమాధానంగా.. ఆయా కంపెనీలు ప్రజలను చంపేస్తున్నాయని అన్నారు. వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల ఏ ప్రమాదం లేదని, టీకా ఇంకా తీసుకోని వారి మధ్యే కరోనా వ్యాపించి ఉందని ఆయన పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసకోవాల్సి వస్తుందని సర్జన్ జనరల్ వివేక్ హెచ్చరించారు. దీనిపై ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి డానీ లీవర్ స్పందించారు. వారు చేసే ఆరోపణల పట్ల తమ దృష్టిని నిలపబోమని చెప్పారు.
వ్యాక్సిన్‌లు, కోవిడ్19 గురించి ఫేస్‌బుక్ ఇచ్చిన అధికారిక సమాచారాన్ని ఇప్పటివరకూ 200 కోట్ల మంది ప్రజలు చూశారని అన్నారు. అమెరికాలో 33 లక్షల మంది ఫేస్‌బుక్ తయారు చేసిన వ్యాక్సిన్ ఫైండర్ టూల్ ఉపయోగించుకొని వ్యాక్సినేషన్ చేయించుకున్నారని సమాధాన మిచ్చారు. ఈ విధంగా ఫేస్‌బుక్ ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. మరోవైపు ట్విట్టర్ తమ ప్లాట్‌ఫాంపై ఓ పోస్టు పెట్టింది. కోవిడ్ 19 ప్రబలుతున్న ఈ సమయంలో అధికారిక సమాచారాన్ని పంచుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని అందులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment