Vivek Murthy
-
మాస్కులు త్వరలో పోతాయి
వాషింగ్టన్: అమెరికన్లు మాస్కు ధరించాల్సిన అవసరం లేని రోజులు త్వరలో వస్తాయని ఆ దేశ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి జోస్యం చెప్పారు. అది రెండు నెలల్లో, ఆర్నెల్లలో, లేదా ఓ ఏడాదిలో కావచ్చన్నారు. అలాగని వ్యక్తిగత జాగ్రత్తలను పక్కన పెట్టడం అంత మంచిది కూడా కాదని ఆయన హెచ్చరించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కరోనా వంటి పెను మహమ్మారి రాత్రికి రాత్రే మాయమైపోదన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. పాత, లేదా కొత్త వేరియంట్లు మళ్లీ తెరపైకి రావచ్చు. కానీ దానికి భయపడకుండా మళ్లీ స్వేచ్ఛగా జీవితాన్ని ఆస్వాదించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కరోనాపై పోరాడేందుకు ఏడాదిగా మనం తయారు చేసుకున్న నాణ్యతతో కూడిన వ్యాక్సిన్లు, బూస్టర్లు అందరికీ సరిపడ సంఖ్యలో అందుబాటులో ఉండాలి. అప్పుడు కరోనా మరణాలను దాదాపుగా తగ్గించుకోవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. యువతపై ప్రభావం యువత మానసిక ఆరోగ్యంపై కరోనా చాలా ప్రభావం చూపుతోందని భారత సంతతికి చెందిన మూర్తి ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయమిది. మానసిక ఆరోగ్య నిపుణుల సాయంతో వారికి దన్నుగా నిలవడం చాలా అవసరం’’ అన్నారు. కరోనా తెరపైకి వచ్చిన తొలి నాళ్లలో అమెరికాలో నల్ల జాతీయులకు, లాటిన్, నేటివ్ అమెరికన్లకు వ్యాక్సిన్ల లభ్యత అంతగా ఉండేది కాదన్నారు. తర్వాత పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్పారు. -
అవి ప్రజలను చంపేస్తున్నాయి: జో బైడెన్
వాషింగ్టన్: కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడంలో విఫలం చెందు తున్న సోషల్ మీడియా కంపెనీలు పరోక్షంగా ప్రజల మరణాలకు కారణమవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. వ్యాక్సిన్లు వేసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటూ ఫేస్బుక్లో వస్తున్న తప్పుడు వార్తలపై అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి గురువారం స్పందించారు. కరోనా సంబంధిత అన్ని సమస్యలను టీకా ద్వారా నివారించవచ్చని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బైడెన్ దీనిపై స్పందించారు. ఫేస్‌బుక్‌లాంటి ప్లాట్‌ఫాంలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని మీడియా బైడెన్ ప్రశ్నించింది. అందుకు ఆయన సమాధానంగా.. ఆయా కంపెనీలు ప్రజలను చంపేస్తున్నాయని అన్నారు. వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల ఏ ప్రమాదం లేదని, టీకా ఇంకా తీసుకోని వారి మధ్యే కరోనా వ్యాపించి ఉందని ఆయన పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసకోవాల్సి వస్తుందని సర్జన్ జనరల్ వివేక్ హెచ్చరించారు. దీనిపై ఫేస్బుక్ అధికార ప్రతినిధి డానీ లీవర్ స్పందించారు. వారు చేసే ఆరోపణల పట్ల తమ దృష్టిని నిలపబోమని చెప్పారు. వ్యాక్సిన్లు, కోవిడ్19 గురించి ఫేస్బుక్ ఇచ్చిన అధికారిక సమాచారాన్ని ఇప్పటివరకూ 200 కోట్ల మంది ప్రజలు చూశారని అన్నారు. అమెరికాలో 33 లక్షల మంది ఫేస్బుక్ తయారు చేసిన వ్యాక్సిన్ ఫైండర్ టూల్ ఉపయోగించుకొని వ్యాక్సినేషన్ చేయించుకున్నారని సమాధాన మిచ్చారు. ఈ విధంగా ఫేస్బుక్ ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. మరోవైపు ట్విట్టర్ తమ ప్లాట్‌ఫాంపై ఓ పోస్టు పెట్టింది. కోవిడ్ 19 ప్రబలుతున్న ఈ సమయంలో అధికారిక సమాచారాన్ని పంచుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని అందులో పేర్కొంది. -
కోవిడ్‌తో 10 మంది కుటుంబసభ్యులను కోల్పోయా
వాషింగ్టన్: అమెరికాతోపాటు భారత్‌లో ఉన్న తన కుటుంబసభ్యులు సుమారు 10 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, ఈ మహమ్మారి ఎంత ప్రమాదకరమైందో తెలియజేసేందుకు ఇదే పెద్ద ఉదాహరణ అని అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి చెప్పారు. అందుకే, అనుమానాలను వీడి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని రక్షణ పొందాలని అమెరికన్లను కోరారు. వ్యాక్సిన్‌పై అనుమానాలు నివృత్తి చేసేందుకు ఉద్దేశించిన ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఆయన.. ఆరోగ్య సంబంధ సమాచారాన్ని ఆన్లైన్లో షేర్ చేసేటప్పుడు దానికి విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలున్నాయేమో పరిశీలించాలని కోరారు. ఇప్పటి వరకు 48.5% మంది అంటే.. సుమారు 16 కోట్ల మంది ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం శుభ పరిణామమే అయినప్పటికీ, మహమ్మారి ముప్పు తొలిగినట్లు కాదన్నారు. టీకా వేయించుకోని ఎక్కువ మంది వైరస్ బారినపడు తున్నారని చెప్పారు. కోవిడ్‌తో సంభవించే ప్రతి మరణం ప్రస్తుతం నివారించగలిగినదే అని పేర్కొన్నారు. కాగా, మే నెలలో కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ చేపట్టిన సర్వే ప్రకారం..15% మంది వేచిచూసే ధోరణిలో ఉండగా, 19% మంది మరీ అవసరమైతే తప్ప కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తేలింది. అమెరికాలో గత కొన్ని వారాలుగా రోజుకు సగటున సుమారు 24 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. -
కొత్త అధ్యక్షుడు రాగానే.. పెద్ద డాక్టర్ మారిపోయాడు
ఏ పాలనా వ్యవస్థలోనైనా ప్రధానంగా ఇద్దరే ఉంటారు. ఆదేశాలు ఇచ్చేవారు. ఆదేశాలు పాటించేవారు. ఇండియా కానివ్వండి. అమెరికా అవనీయండి. రాజకీయ నాయకులు ఆదేశిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పాటిస్తారు. ఆదేశించేవారు ఇండియాలో అయితే ఐదేళ్లు, అమెరికాలో అయితే నాలుగేళ్లు ఉంటారు. ఆ తర్వాత మారిపోతారు. ప్రజాభిమానం ఉంటే మరో టెర్మ్ మారకుండా ఉండిపోతారు. రిటైర్ అయ్యేవరకు ఉండేది మాత్రం ఆదేశాలు పాటించేవారే. కాకపోతే.. ఆదేశించేవారు మారినప్పుడల్లా ఆదేశాలు పాటించేవారి స్థానం మాత్రం మారుతుంటుంది. భార్య, కుమార్తె తో జెరోమ్ ఆడమ్స్ జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే,‘సర్జన్ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్’ జెరోమ్ ఆడమ్స్ రాజీనామా చేశారు. చేయడం కాదు, బైడెన్ ఆయన్ని రాజీనామా చేయమని రిక్వెస్ట్ చేశారు! ట్రంప్ నియమించిన సర్జన్ జనరల్ ఆడమ్స్. ఆయన స్థానంలోకి డాక్టర్ వివేక్ మూర్తిని బైడెన్ నియమించుకున్నారు. పాలకుల నిర్ణయాలు ఎలా ఉన్నా, అధికారులు మాత్రం ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఆదేశాలను అమలు చేయవలసి ఉంటుంది. ఇంతకీ ఆడమ్స్, మూర్తి.. ఇద్దరిలో ఎవరు సమర్థులు? ఇద్దరూ. అయితే బైడన్ మూర్తికి ఒక మార్కు ఎక్కువ వేసుకున్నారు.. తన పాలనా సౌలభ్యం కోసం. జెరోమ్ ఆడమ్స్ సర్జన్ జనరల్ ఆఫీసు వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. ఆమెరికా ప్రజారోగ్య సేవల పాలనా వ్యవహారాలన్నీ అక్కడినుంచే అమలు అవుతాయి. నిన్నటి వరకు ఆ ఆఫీసు మెట్లెక్కి దిగిన జెరోమ్ ఆడమ్స్ తన కెరీర్లో ఎన్నో నిచ్చెనలు ఎక్కి జనరల్ స్థాయికి చేరుకున్నారు. 46 ఏళ్లు ఆడమ్స్కి. ఆరోగ్యంగా ఉంటారు. తన శాఖనూ ఆరోగ్యంగా ఉంచారు. ప్రాథమికంగా ఆయన అనెస్థీషియాలజిస్టు. నేవీలో చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన ఏడాది తర్వాత ఆయనకు సర్జన్ జనరల్ పదవి లభించింది. అంతకుముందు వరకు ఆడమ్స్ ఇండియానా స్టేట్ హెల్త్ కమిషనర్. కరోనా వచ్చి, గత ఏడాదిగా మనం తెల్లారి లేస్తే టీవీలలో, పేపర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధాన మ్ని, ఆ సంస్థ తరఫునే పని చేస్తున్న సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్‌ని, మన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ని చూస్తూ వస్తున్నాం. వీళ్లలాగే అమెరికాలో జెరోమ్ ఆడమ్స్. వీళ్లలాగే అంటే కరోనా గురించి అమెరికా ఏం చెప్పాలనుకున్నా ఈయన స్క్రీన్ మీదకు వచ్చేవారు. ట్రంప్‌తో ఆడమ్స్ భద్రంగా ఉండాలనీ, నిర్లక్ష్యం తగదని ఆడమ్స్ ఎప్పటికప్పుడు ప్రజల్ని హెచ్చరిస్తున్నప్పటికీ, కరోనాను ఏమాత్రం లెక్కచేయని ట్రంప్ ధీమా ముందు ఆ హెచ్చరికలన్నీ కొట్టుకుపోయాయి. రేపు ఒకవేళ ఏ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ప్రతినిధో.. ‘ఆడమ్స్‌ని రాజీనామా చేయమని ఎందుకు కోరవలసి వచ్చింది? అని బైడెన్‌ను అడిగినప్పుడు..‘కరోనాను కంట్రోల్ చేయలేకపోయారు’ అనేది ఆయన దగ్గర ఉండే తక్షణ సమాధానం కావచ్చు. అందువల్ల ఆడమ్స్కి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆయన ఏంటో, తన కెరీర్లో ఆయన ఎన్ని అవార్డులు సాధించారో ఆ రంగంలోని వారందరికీ తెలుసు. ఆయనకొచ్చిన ఫీల్డ్ మెడికల్ రెడీనెస్ బ్యాడ్జిలు అయితే.. చదివితే అర్థం అయ్యేవి కావు. వంశవృక్షంలా ఒక మ్యాప్ గీసుకోవాలి. ఆడమ్స్ భార్య లేసీ. ఇద్దరు తనయులు. ఒక కుమార్తె. లేసీ స్కిన్ క్యాన్సర్ నుంచి రెండుసార్లు బయటపడ్డారు. వివేక్ మూర్తి అమెరికా సర్జన్ జనరల్‌గా ఉన్న జరోమ్ ఆడమ్స్ స్థానంలోకి బైడెన్ తీసుకున్న భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తి ఆడమ్స్ కన్నా వయసులో మూడేళ్లు చిన్న. 43 ఏళ్లు. ఈయన కూడా ఆయనలానే అమెరికన్ నేవీలో వైస్ అడ్మిరల్‌గా చేశారు. ‘డాక్టర్స్ ఫర్ అమెరికా’ అని పన్నెండేళ్ల క్రితం సొంతంగా ఒక సేవాసంస్థను స్థాపించారు. అమెరికా సర్జన్ జనరల్ అయిన తొలి భారత సంతతి వైద్యుడు కూడా. పూర్వికులది కర్ణాటక. ఈయన యు.కె.లో పుట్టారు. తర్వాత యు.ఎస్. వచ్చేశారు. మూర్తి ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో డిగ్రీ చేశారు. 2011లో ఒబామా ఈయన్ని ‘హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్’ డిపార్ట్మెంట్లోకి తీసుకున్నారు. ప్రజారోగ్యం కోసం పదిహేను వేల మంది వైద్యులతో, మెడికల్ స్టూడెంట్స్‌తో ‘డాక్టర్స్ ఫర్ అమెరికా’ సంస్థ ద్వారా మూర్తి నడిపిన సైన్యాన్ని చూసి ఈ వైద్య సేనాపతిని తనకు సహాయంగా తీసుకున్నారు ఒబామా. ఆయన ప్రభుత్వంలో మూర్తి కూడా కొంతకాలం సర్జన్ జనరల్‌గా ఉన్నారు. బైడెన్‌తో మూర్తి అయితే అంత తేలిగ్గా ఏమీ సెనెట్ మూర్తి నియామకాన్ని ఆమోదించలేదు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ వ్యతిరేకించారు. ‘అమెరికాలో గన్ వయలెన్స్ ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించింది’ అని గతంలో మూర్తి చేసిన కామెంట్ వల్ల ఆయనకు కాంగ్రెస్ మద్దతు లభించలేదు. చివరికి యూఎస్‌లోని వందకు పైగా వైద్య, ప్రజారోగ్య సంస్థలు, మాజీ సర్జన్ జనరళ్లు ఇద్దరు ఆయన నియామకాన్ని సమర్థించడంతో సెనెట్‌లో ఆయనకు 51–43 ఓట్ల వ్యత్యాసంతో ఆమోదం లభించింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక మూర్తి స్థానంలోకి ఆడమ్స్‌ని తీసుకున్నారు. ఆడమ్స్కి ఉన్నన్ని అవార్డులు మూర్తికి లేకపోయినా అంతటి అనుభవమైతే ఉంది. మూర్తి భార్య కూడా డాక్టరే. అసిస్టెంట్ క్లినికల్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె పేరు అలైస చెన్. ఒక కొడుకు, ఒక కూతురు. -
బైడెన్ టీం: మనకే అగ్ర తాంబులం
వాషింగ్టన్: అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే తన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇక ఉపాధ్యాక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎన్నుకున్న బైడెన్.. తన టీమ్‌లో పలువురు భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. బైడెన్ యంత్రాంగంలో 20 మంది భారత సంతతి అమెరికన్లకు చోటు దక్కగా.. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. వీరిలో 17 మంది వైట్‌హౌస్‌లో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషించనున్నారు. అమెరికా జనాభాలో భారత సంతతి వాటా ఒకశాతం కంటే తక్కువే అయినా, అగ్రరాజ్యం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ వర్గానికి బైడెన్ తన బృందంలో పెద్దపీట వేశారు. అలాగే, తన టీమ్‌లో వివిధ మూలాలున్న వ్యక్తులకు అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యం కలిగిన పాలకవర్గాన్ని సమకూర్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనే భారతీయ అమెరికన్లకు తన బృందంలో పెద్దపీట వేయనున్నట్లు బైడెన్ సంకేతాలిచ్చారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపికచేసి, అందర్నీ బైడెన్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఎంపిక ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం భారతీయ అమెరికన్లే కాదు, ఆసియా సంతతి మొత్తం బైడెన్ వెంట నిలిచింది. ఇక నూతన అధ్యక్షుడి యంత్రాంగంలోని భారత సంతతి వ్యక్తులు ఎవరు.. ఏ బాధ్యతలు నిర్వహించనున్నారో ఓ సారి చూడండి.. (చదవండి: చరిత్ర సృష్టించిన జో బైడెన్) 1. నీరా టాండన్ అమెరికా నూతన అధ్యక్షుడు ఎంపిక చేసుకున్న బడ్జెట్ చీఫ్ నీరా టాండన్ భారతీయ మూలాలు కలిగిన మహిళ. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్, అమెరికన్ ప్రోగ్రెస్ యాక్షన్ ఫండ్‌కు ఈమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2008లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హిల్లరీ క్లింటన్‌కు సహాయకురాలిగా, ఆమెతో కలిసి పనిచేశారు నీరా. ఇక ఆమె బడ్జెట్ తయారీ, అమలు, నియంత్రణ విధానం పర్యవేక్షణ, అధ్యక్ష ఆదేశాలు, కార్యనిర్వాహక ఆదేశాల అమలు మొదలైన బాధ్యతలను నిర్వర్తిస్తారు. 2. వివేక్‌మూర్తి డాక్టర్ వివేక్ మూర్తి. అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితులవుతున్నారు. ఆరోగ్యరంగ నిపుణుడిగా ఆయన వ్యాక్సినేషన్ విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు. 3. చొల్లేటి వినయ్ రెడ్డి తెలంగాణ మూలాలు ఉన్న చొల్లేటి వినయ్ రెడ్డి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డి నారాయణరెడ్డి విజయారెడ్డి దంపతుల కుమారుడే వినయ్ రెడ్డి. వృత్తిరీత్యా వైద్యుడైన నారాయణరెడ్డి 1970లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ముగ్గురు కుమారుల్లో వినయ్ రెడ్డి ఒకరు. అమెరికాలోని ఒహియా రాష్ట్రంలో ఉన్న డేటన్లో పుట్టి పెరిగిన వినయ్ రెడ్డి మియామీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, హారిస్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీనియర్ అడ్వైజర్‌గా, స్పీచ్ రైటర్‌గా పని చేశారు. (చదవండి: వినయ్‌రెడ్డి మనోడే!) 4.వనితా గుప్తా అమెరికాలో అత్యంత గౌరవప్రదమైన మానవహక్కుల న్యాయవాది, భారతీయ వలస తల్లితండ్రులు గర్వించదగిన కుమార్తె అని జో బైడెన్ కొనియాడిన భారతీయ మహిళ వనితా గుప్తా. సెనేట్‌కు నామినేట్ అయిన మొట్టమొదటి ఇండియన్ అమెరికన్ అసోసియేట్ అటార్నీ జనరల్ కూడా వనితానే! లీగల్ డిఫెన్స్ ఫండ్‌లో ఉద్యోగిగా కెరీర్‌ను మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఒబామా- బైడెన్ ప్రభుత్వంలో జస్టిస్ డిపార్ట్మెంట్లో మానవహక్కుల డివిజన్‌లోకి అడుగుపెట్టారు. అమెరికన్ ప్రజలను ఏకం చేసే సమానత్వం, స్వేచ్ఛకోసం ఆమె ఎంతో కృషి చేశారు. 5. ఉజ్రా జేయా పౌరభద్రత, ప్రజాస్వామ్యం, మానవహక్కుల శాఖకు నామినేట్ అయిన కశ్మీరీ మహిళ ఉజ్రా జేయా. స్టేట్ డిపార్ట్మెంట్లో ముప్పై ఏళ్ల అనుభవం కలిగిన ఉజ్రా ఉత్తరాసియా, దక్షిణాసియా, ఐరోపా మానవహక్కులు, బహుపాక్షిక అంశాలలో నిపుణురాలు. గతంలో జేయా 2014 నుంచి 2017 వరకూ ప్యారిస్‌లోని యూఎస్ ఎంబసీలో చార్జ్ అఫైర్స్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ బాధ్యతలు నిర్వహించారు. మస్కట్, డమాస్కస్, కైరో, కింగ్స్టన్లలో యూఎస్ మిషన్స్‌లో సేవలు అందించారు. 6. మాలా అడిగా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు మాలా పాలసీ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. జిల్కు సీనియర్ సలహాదారుగా, బైడెన్-కమలా హారిస్ బృందంలో సీనియర్ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ షికాగో లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాలా కొంతకాలంపాటు న్యాయవాదిగా పనిచేశారు. 2008లో ఒబామా ప్రచార బృందంలో చేరారు. ఇల్లినాయిస్కు చెందిన మాలా ఒబామా హయాంలో అసోసియేట్ అటార్నీ జనరల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా కూడా బాధ్యతలు చేపట్టారు. తర్వాత బైడెన్ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా పనిచేశారు. (చదవండి: సొంతూరు వీడుతూ బైడెన్ కంటతడి) 7. గరిమా వర్మ భారత సంతతికి చెందిన గరిమా వర్మ అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు డిజిటల్ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. భారతదేశంలో జన్మించిన గరిమా తల్లితండ్రులతో కలిసి అమెరికా వలస వెళ్లారు. గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్-కమలా హారిస్‌తో కలసి పనిచేశారు. వారికి మీడియా స్ట్రాటజిస్ట్‌గా సేవలు అందించారు. 8. గౌతమ్ రాఘవన్ గతంలో వైట్‌హౌజ్‌లో పని చేసిన గౌతమ్ రాఘవన్.. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 9. భరత్ రామ్మూర్తి వైట్ హౌస్‌లోని యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ) భరత్ రామ్మూర్తి అనే మరో ఇండో అమెరికన్ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. 10. సోనియా అగర్వాల్ బైడెన్ అధికార యంత్రాంగంలో కీలకమైన పర్యావరణ విధాన సీనియర్ సలహాదారు పదవికి ఎంపికైన భారతీయ-అమెరికన్ సోనియా అగర్వాల్ కుటుంబానిది పంజాబ్ ప్రాంతం. అమెరికాలోని ఓహాయో ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. పర్యావరణ, ఆర్థిక, ప్రజా ఆరోగ్య అంశాల మీద వాతావరణ, ఇంధన విధానాల ప్రభావంపై విశ్లేషణ జరిపి, ఇంధన విధానాన్ని, దేశీయ క్లైమెట్ పాలసీనీ రూపుదిద్దే బృందానికి ఆమె నాయకత్వం వహిస్తారు. అలాగే వైట్ హౌస్‌లోని జాతీయ వాతావరణ పాలసీ ఆఫీస్‌లో ఇన్నోవేషన్ విభాగం బాధ్యతలు కూడా చూసుకుంటారు. 11.సుమోనా గుహా వైట్‌హౌస్‌కు కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికైన ముగ్గురు భారతీయ అమెరిన్లలో సుమోనా గుహా ఒకరు. గుహ అమెరికా విదేశీ విధానం, జాతీయ భద్రత అంశాల్లో కీలక భూమిక పోషించబోతున్నారు. బైడెన్ - హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ పని చేశారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్లో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా సేవలందించారు. ఒబామా ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడైన బైడెన్‌కు జాతీయ భద్రతా వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా కూడా వ్యవహరించారు. తాజాగా బైడెన్ అధ్యక్ష హయాంలో గుహ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ హోదా పొందబోతున్నారు. (చదవండి: అమెరికా అధ్యక్షుల పెంపుడు జంతువులు ఇవే..) 12.శాంతి కలతిల్ శాంతి కలతిల్‌ది కాలిఫోర్నియాలో స్థిరపడ్డ మలయాళ కుటుంబం. ప్రస్తుతం 'నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ'లోని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ డెమొక్రటిక్ స్టడీస్‌లో సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మానన హక్కులపై తన గళాన్ని గట్టిగా వినిపించే శాంతికి చైనీస్, మాండరిన్ భాషలు క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు అగ్రరాజ్య విదేశాంగ విభాగంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాల సమన్వయకర్తగా నియమితురాలయ్యారు. 13. తరుణ్ చబ్రా జో బైడెన్ టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సీనియర్ డైరెక్టర్‌గా తరుణ్ చబ్రాని నియమించారు. 14.వేదాంత్ పటేల్ వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ప్రవాస భారతీయుడు వేదాంత్ పటేల్‌ను నియమితులయ్యారు. బైడెన్ ప్రచారవర్గంలో రీజనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గాను, అంతకుముందు నెవాడా-వెస్టర్న్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా వేదాంత్ పనిచేశారు. అంతకుముందు ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ కు కూడా ఇదే హోదాలో డైరెక్టర్ గా ఆయన వ్యవహరించారు. ఇండియాలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగిన వేదాంత్ పటేల్.. ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. 15.సమీరా ఫాజిలీ బైడెన్ యంత్రాంగంలో జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన సమీర తల్లితండ్రులది కశ్మీర్. ఆమె పుట్టక ముందు, 1970లో అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. యేల్ లా స్కూల్, హార్వర్డ్ కళాశాలల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న సమీర అట్లాంటాలో ఎంగేజ్మెంట్ ఫర్ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కు డైరెక్టర్‌గా, ఒబామా హయాంలో... శ్వేత సౌథంలో సీనియర్ పాలసీ అడ్వయిజర్‌గా పని చేశారు. 16.అయేషా షా శ్వేత సౌథంలోని డిజిటల్ వ్యూహ కార్యాలయంలో పార్టనర్షిప్ మేనేజర్‌గా బాధ్యతలు చేపడుతున్న అయేషా కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లోని గగ్రిబల్‌లో పుట్టారు. ఆమె బాల్యమంతా అమెరికాలోని లూసియానాలో గడిచింది. ఆమె తండ్రి డాక్టర్ అమిర్ షా. శ్రీనగర్‌లోని ప్రముఖ కుటుంబాల్లో వారిది ఒకటి. 1993లో, అయేషా చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమె తల్లితండ్రులు అమెరికాకు వలస వెళ్ళారు. నార్త్ కరోలినాలోని డేవిడ్సన్ కాలేజీలో అయేషా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జాన్ ఎఫ్.కెనడీ సెంటర్ ఫర్ పెర్పార్మింగ్ ఆర్ట్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్‌లో అడ్వాన్స్మెంట్ స్పెషలిస్ట్‌గా ఉన్నారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జో బైడెన్- కమలా హారిస్ తరఫున పార్టనర్ షిప్స్మేనేజర్గా వ్యవహరించారు. 17. సబ్రీనా సింగ్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి అమెరికన్ సబ్రిన సింగ్ నియమితులయ్యారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్‌కు సబ్రిన్ ప్రెస్ సెక్రటరీగా వ్యవహరించారు. 18. రీమా షా భారతసంతతి రీమా షా పుట్టిందీ, పెరిగిందీ కాలిఫోర్నియాలో. హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యేల్ లా స్కూల్లో న్యాయవాద విద్యను పూర్తి చేసిన రీమా కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికా సుప్రీం కోర్టు... ఇలా అనేక న్యాయ సంస్థల్లో వివిధ ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు శ్వేత సౌధంలో డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. (చదవండి: ఫలించిన మూడు దశాబ్దాల కల) 19. రోహిత్ చోప్రా భారతీయ అమెరికన్ రోహిత్ చోప్రాను కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో(సీఎఫ్‌పీబీ) చీఫ్‌గా నియమించారు. కాథ్లీన్ లౌరా క్రానింగర్ స్థానంలో రోహిత్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రోహిత్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కమిషనర్‌గా ఉన్నారు. 2018లో సెనేట్ ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయడం విశేషం. తాజాగా కీలక పరిపాలన స్థానాలకు పలువురిని నియమించిన బైడెన్.. రోహిత్‌కు సీఎఫ్‌పీబీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. 20.విదుర్ శర్మ కొవిడ్ టెస్టింగ్ విభాగం వ్యవహారాలను చూసే బాధ్యతను డాక్టర్ విదుర్ శర్మకు అప్పగించారు. -
బైడెన్ బృందంలో 20 మంది ఇండో అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా మరో రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోతున్న జో బైడెన్ బృందంలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యమైన పదవుల్లో బైడెన్ ఇప్పటికే కనీసం 20 మంది ఇండో అమెరికన్లను నియమించారు. వారిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అలాగే, వైట్‌హౌజ్ నుంచి బాధ్యతలు నిర్వహించే శక్తిమంతమైన బైడెన్ పాలన బృందంలో 17 మంది భారతీయ అమెరికన్లు కీలకంగా వ్యవహరించనున్నారు. వారిలో మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా నామినేట్ అయిన నీరా టాండన్ ఒకరు. బైడెన్ డిప్యూటీగా ఉపాధ్యక్ష పదవికి ఆఫ్రో–ఇండియన్ మూలాలున్న కమలా హ్యారిస్ ఎన్నికైన విషయం తెలిసిందే. జనవరి 20న దేశాధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బైడెన్ యంత్రాంగంలో కీలక బాధ్యతలు పోషించబోతున్న ఇండో అమెరికన్లలో.. యూఎస్ సర్జన్ జనరల్‌గా ఎంపికైన వివేక్ మూర్తి, న్యాయ విభాగంలో అసోసియేట్ అటార్నీ జనరల్‌గా ఎంపికైన వనిత గుప్తా, సివిలియన్ సెక్యూరిటీ, డెమొక్రసీ, హ్యూమన్‌రైట్స్‌కు అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఎంపికైన ఉజ్రా జెయా, బైడెన్ భార్య, కాబోయే ఫస్ట్ లేడీ డాక్టర్ జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా ఎంపికైన మాలా అడిగ, జిల్ బైడెన్ డిజిటల్ డైరెక్టర్‌గా ఎంపికైన గరీమా వర్మ, వైట్ హౌజ్ డెప్యూటీ ప్రెస్ సెక్రటరీగా ఎంపికైన సబ్రీనా సింగ్, వైట్‌హౌజ్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన భరత్ రామమూర్తి, వైట్‌హౌజ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన గౌతమ్ రాఘవన్ తదితరులున్నారు. కశ్మీరీ మూలాలున్న అయిషా షా వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటెజీలో పార్ట్నర్షిప్ మేనేజర్‌గా, సమీరా ఫజిలి వైట్‌హౌజ్‌లోని యూఎస్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్లో డెప్యూటీ డైరెక్టర్‌గా ఎంపిక కావడం విశేషం. మరోవైపు, జో బైడెన్ సన్నిహిత బృందంలో ఒకరైన వినయ్ రెడ్డి డైరెక్టర్, స్పీచ్ రైటింగ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్‌గా యువకుడైన వేదాంత్ పటేల్‌ను ఎంపిక చేశారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సీనియర్ డైరెక్టర్‌గా తరుణ్ ఛాబ్రా, సీనియర్ డైరెక్టర్ ఫర్ సౌత్ ఏసియాగా సుమొన గుహ, కోఆర్డినేటర్ ఫర్ డెమొక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్‌గా శాంతి కళాతిల్లను బైడెన్ ఎంపిక చేశారు. క్లైమేట్ పాలసీ అండ్ ఇన్నోవేషన్‌లో సీనియర్ అడ్వైజర్‌గా సోనియా అగర్వాల్, వైట్‌హౌజ్ కోవిడ్–19 రెస్పాన్స్ టీమ్‌కి పాలసీ అడ్వైజర్ ఫర్ టెస్టింగ్‌గా విదుర్ శర్మ కూడా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. వైట్‌హౌజ్ న్యాయవిభాగంలో అసోసియేట్ కౌన్సెల్‌గా నేహ గుప్తా, డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్‌గా రీమా షా ఇండో అమెరికన్ మహిళల శక్తిసామర్థ్యాలను చూపనున్నారు. కోలం ముగ్గులు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బైడెన్, కమల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రారంభ సూచికగా శనివారం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో భారత్‌లోని తమిళనాడుకు చెందిన సంప్రదాయ కోలం ముగ్గులు ఆకట్టుకున్నాయి. బైడెన్, కమలలను ఆహ్వానిస్తూ వేలాది కోలం డ్రాయింగ్స్‌తో ఒక వీడియోను రూపొందించారు. ఈ కార్యక్రమంలో యూఎస్, ఇండియా నుంచి 1,800 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఆరోగ్యం, సౌభాగ్యాలను ఆహ్వానిస్తూ తమిళనాడులోని గృహిణులు తమ ఇళ్లల్లో, ఇళ్ల ముందు వీటిని వేస్తారు. కమల తల్లి శ్యామల తల్లి స్వస్థలం తమిళనాడేనన్న విషయం తెలిసిందే. తొలి రోజు సుమారు డజను నిర్ణయాలు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు బైడెన్ సుమారు డజను అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. వాటిలో అమెరికా ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సంక్షోభాలు.. కోవిడ్, ఆర్థిక రంగ మందగమనం, వాతావరణ మార్పు, జాత్యహంకారం.. వీటి నివారణలపై చర్యలు చేపట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారని వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాన్ క్లెయిన్ వెల్లడించారు. అమెరికన్ విద్యార్థుల రుణాల చెల్లింపుల గడువు పొడిగింపు, పారిస్ ఒప్పందంలో మళ్లీ చేరడం, ముస్లింలపై నిషేధాన్ని తొలగించడం.. తదితర అంశాలపై తొలి పది రోజుల్లో నిర్ణయాలుంటాయన్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల వలసదారులకు లీగల్ స్టేటస్ కల్పించే విషయానికి బైడెన్ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ విషయంలో ప్రధాన పార్టీలైన డెమొక్రటిక్, రిపబ్లికన్ సభ్యుల్లోనూ అంతర్గతంగా విభేదాలున్న విషయం తెలిసిందే. ఈ విభేదాల నేపథ్యంలో.. ఎప్పుడు బైడెన్ దీన్ని అమలు చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. అయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే బైడెన్ సంబంధిత ఇమిగ్రేషన్ బిల్లును కాంగ్రెస్‌కు పంపిస్తారని రాన్ క్లెయిన్ స్పష్టం చేశారు. కమలా హ్యారిస్ ప్రమాణం తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి దక్షిణాసియా మూలాలున్న ఉపాధ్యక్షురాలు, తొలి బ్లాక్ ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనున్న కమలా హ్యారిస్‌తో జనవరి 20న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోనియా సొటొమేయర్ ప్రమాణ స్వీకారం చేయించ నున్నారు. జస్టిస్ సోనియా కూడా యూఎస్ సుప్రీంకోర్టులో తొలి హిస్పానిక్ న్యాయమూర్తి, మూడో మహిళా న్యాయమూర్తి కావడం గమనార్హం. గతంలో జస్టిస్ సోనియా న్యూయార్క్‌లో, కమలా హ్యారిస్ కాలిఫోర్నియాలో ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో కమల రెండు బైబిల్స్‌ను చేతిలో పట్టుకుని ప్రమాణం చేస్తారు. ఆ రెండు బైబిల్స్లో.. ఒకటి తన తల్లిలాంటి రెజీనా షెల్టన్‌ది కాగా, మరొకటి అమెరికా మానవ హక్కుల నేత, సుప్రీంకోర్టు తొలి ఆఫ్రో అమెరికన్ న్యాయమూర్తి తర్గుడ్ మార్షల్‌ది కావడం విశేషం. పాఠశాలలో చదువుకునే రోజుల్లో స్కూల్ ముగియగానే.. కమల తన సోదరి మాయతో కలిసి తమ ఇంటికి రెండు ఇళ్ల దూరంలో ఉన్న రెజీనా ఇంటికే వెళ్లేవారు. గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా, తరువాత సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రెజీనా షెల్టన్ బైబిల్నే కమలా హ్యారిస్ తీసుకువెళ్లారు. వినయ్ రెడ్డి, వనితా గుప్తా, సబ్రినా సింగ్, భరత్ రామ్మూర్తి, సమీరా ఫజిలి వివేక్‌మూర్తి, మాలా అడిగ, నీరా టాండన్, గౌతమ్ రాఘవన్, వేదాంత్ పటేల్ -
అమెరికా హెల్త్ సెక్రటరీగా హావియర్
వాషింగ్టన్: అమెరికా ఆరోగ్య శాఖ (సెక్రెటరీ ఆఫ్ హెల్త్), హ్యూమన్ సర్వీసెస్ మంత్రిగా హావియర్ బసెరా ఎంపికయ్యారు. అలాగే, భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ఎంపిక చేసుకున్నారు. కోవిడ్–19 విషయంలో అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా డాక్టర్ ఆంథోనీ ఫౌచీ, వ్యాధుల నియంత్రణ కేంద్రాల డైరెక్టర్‌గా డాక్టర్ రోచెల్ వాలెన్స్కీ, కోవిడ్–19 ఈక్విటీ టాస్క్‌ఫోర్స్ అధినేతగా డాక్టర్ మార్సెలా నూనెజ్ స్మిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరోగ్య రంగంలో కరోనా మహమ్మారి రూపంలో అమెరికా అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జో బైడెన్ పేర్కొన్నారు. మహమ్మారిని అదుపు చేసి, జన జీవనం ఎప్పటిలాగే కొనసాగే వాతావరణం కల్పించాల్సి ఉందన్నారు. హెల్త్ కేర్ టీమ్‌లోని నిపుణుల సూచనల ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తిని కచ్చితంగా నియంత్రిస్తామని, దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెడతామని కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వెల్లడించారు. హావియర్ బసెరా ప్రస్తుతం కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇక డాక్టర్ వివేక్ మూర్తి 2014 నుంచి 2017 వరకు అమెరికాస్ డాక్టర్ అనే పదవిలో ఉన్నారు. జో బైడెన్‌కు ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్–19 ట్రాన్సిషన్ అడ్వైజరీ బోర్డు కో–చైర్మన్‌గా ఉన్నారు. -
బైడెన్ సర్కార్‌లో డాక్టర్ వివేక్ మూర్తికి చోటు
వాషింగ్టన్ : ఉత్కంఠ భరింతగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలో పోటీలో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించి.. డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. నాలుగేళ్ల ట్రంప్ పాలనతో విసుగుచెందిన అమెరికన్స్.. బైడెన్‌కు పట్టంకట్టారు. విమర్శలు, వివాదాలతో కాలంగడిపిన అధ్యక్షుడిని కోలుకోని దెబ్బకొట్టారు. మొదట నుంచీ విజయంపై అత్యాశ పడ్డ ట్రంప్‌కు చివరికి నిరాశే ఎదురైంది. ఇక ఈ ఎన్నికల్లో డెమోక్రాట్స్ నుంచి బరిలో నిలిచి అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్ చరిత్ర సృష్టించారు. ఆమెకు ప్రపంచ నలుమూల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఒక మహిళ, ఒక ఆసియన్ అమెరికన్‌కు ఈ పదవికి దక్కడం ఇదే తొలిసారి కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్) ముఖ్యంగా భారతీయులు పొగడ్తలతో ముంచెత్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా కమలా హ్యారీస్ కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు. ఇప్పుడు ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు బైడెన్ సర్కార్‌లో మరో భారతీయుడికి చోటు దక్కే అవకాశం ఉందని అమెరికా వర్గాల ద్వారా తెలుస్తోంది. డాక్టర్ వివేక్ మూర్తికి టాస్క్‌ఫోర్స్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన మూర్తిని 2014లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 19వ సర్జన్ జనరల్‌గా నియమించారు. అమెరికాలో కరోనా వైరస్ అదుపునకు కొత్త టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని బైడెన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి మూర్తినే చీఫ్‌గా నియమిస్తారని సమాచారం. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒక్క రోజే 1,031 మంది మృతి ఇక అమెరికాలో కరోనా వైరస్ కొత్త కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం ఒక్క రోజులోనే రికార్డు స్థాయి కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే 1.24లక్షల కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి. మరోవైపు ఒక్క రోజే 1,031 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.01 కోట్లకు పైగా కరోనా కేసులు, 2.43లక్షల మరణాలు సంభవించాయి. -
మూర్తిని కాదని అమెరికన్‌కే ట్రంప్ పట్టం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పరిపాలన వర్గంలో కొత్త వ్యక్తిని సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికాగా నియమించారు. ఇందుకోసం ఇప్పటి వరకు ఆ స్థానంలో బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తిని తొలగించారు. ఈ మేరకు శ్వేతసౌదం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ ఇండియానా ఆరోగ్యశాఖ కమిషనర్ డాక్టర్ జెరోమ్ ఆడమ్స్తోను అమెరికా ప్రధాన సర్జన్‌గా నియమించారు’ అని ఆ ప్రకటనలో వివరించింది. ఈయన అమెరికా చీఫ్ వైద్యుడిగా ఉంటూ ప్రస్తుతం హెచ్ఐవీ వైరస్‌ను నిర్మూలించేందు పరిశోధనలు చేస్తున్న వారికి కీలక సలహాదారుగా వ్యవహరిస్తారు. అలాగే, దేశ జనాభా ఆరోగ్య భద్రత కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆయన ట్రంప్‌కు సలహాసహకారాలు అందిస్తారు. అనెస్తీషియాలజిస్ట్గా పనిచేస్తున్న ఆడమ్స్ ఇండియానా హెల్త్ కమిషనర్‌గా 2014లో బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఇండియానా గవర్నర్‌గా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వివేక్ మూర్తిని డోనాల్డ్ ట్రంప్ ఆ బాధ్యతల నుంచి తప్పించారు. మూర్తిని 2014లో ఒబామా నియమించారు. -
అమెరికా సర్జన్ జనరల్‌గా వివేక్ మూర్తి
వాషింగ్టన్: అమెరికా సర్జన్ జనరల్‌గా 37 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్ మూర్తి నియామకాన్ని సెనేట్ ఆమోదించింది. దీంతో పిన్న వయసులోనే సర్జన్ జనరల్ అయిన వ్యక్తిగా మూర్తి రికార్డు సృష్టించారు. ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి భారతీయ సంతతి వ్యక్తి కూడా ఆయనే. బోస్టన్‌లో వైద్య వృత్తిలో స్థిరపడిన మూర్తి కర్ణాటకలో జన్మించారు. మూడేళ్ల వయసులోనే అమెరికాకు వలసవెళ్లారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి బీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీగా పట్టాలు పుచ్చుకున్నారు. -
అమెరికాలో మరో భారతీయుడి ప్రభ
వాషింగ్టన్: అమెరికాలో భారతీయల ప్రభ వెలిగిపోతోంది. ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగుతేజం సత్య నాదెళ్లను నియమించిన మరుసటి రోజే.. కర్ణాటక యువ కిశోరం వివేక్ మూర్తిని అమెరికాలో కీలకమైన సర్జన్ జనరల్ పదవికి సిఫారసు చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మూర్తి నియామకాన్ని సెనెట్ ఆమోదించాల్సివుంది. అమెరికాలో ప్రజారోగ్యానికి సంబంధించి ఆయన ముఖ్య ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తారు. యూఎస్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ కమిషన్ దళానికి చీఫ్‌గా ఉంటారు. ఈ కమిషన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరైన్స్ దళాలకు వైద్య సేవలందిస్తుంది. ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ అమెరికన్ 36 ఏళ్ల వివేక్ కావడం విశేషం. అంతేగాక అతి పిన్న వయస్కుడు కూడా ఆయనే కావడం మరో వివేషం. వివేక్ బోస్టన్‌లో ఫిజిషియన్‌గా పనిచేయడంతో పాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2008లో 'డాక్టర్స్ ఫర్ ఒబామా' అనే సంస్థను ఆరంభించి ఒబామా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఒబామా హెల్త్‌కేర్'కు మద్దతుగా నిలిచారు.