
వాషింగ్టన్: అమెరికాతోపాటు భారత్‌లో ఉన్న తన కుటుంబసభ్యులు సుమారు 10 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, ఈ మహమ్మారి ఎంత ప్రమాదకరమైందో తెలియజేసేందుకు ఇదే పెద్ద ఉదాహరణ అని అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి చెప్పారు. అందుకే, అనుమానాలను వీడి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని రక్షణ పొందాలని అమెరికన్లను కోరారు. వ్యాక్సిన్‌పై అనుమానాలు నివృత్తి చేసేందుకు ఉద్దేశించిన ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఆయన.. ఆరోగ్య సంబంధ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేసేటప్పుడు దానికి విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలున్నాయేమో పరిశీలించాలని కోరారు.
ఇప్పటి వరకు 48.5% మంది అంటే.. సుమారు 16 కోట్ల మంది ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం శుభ పరిణామమే అయినప్పటికీ, మహమ్మారి ముప్పు తొలిగినట్లు కాదన్నారు. టీకా వేయించుకోని ఎక్కువ మంది వైరస్ బారినపడు తున్నారని చెప్పారు. కోవిడ్‌తో సంభవించే ప్రతి మరణం ప్రస్తుతం నివారించగలిగినదే అని పేర్కొన్నారు. కాగా, మే నెలలో కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ చేపట్టిన సర్వే ప్రకారం..15% మంది వేచిచూసే ధోరణిలో ఉండగా, 19% మంది మరీ అవసరమైతే తప్ప కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తేలింది. అమెరికాలో గత కొన్ని వారాలుగా రోజుకు సగటున సుమారు 24 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment