వాషింగ్టన్: అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే తన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇక ఉపాధ్యాక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎన్నుకున్న బైడెన్.. తన టీమ్‌లో పలువురు భారతీయ అమెరికన్‌లకు కీలక బాధ్యతలు అప్పగించారు. బైడెన్ యంత్రాంగంలో 20 మంది భారత సంతతి అమెరికన్లకు చోటు దక్కగా.. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. వీరిలో 17 మంది వైట్‌హౌస్‌లో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషించనున్నారు. అమెరికా జనాభాలో భారత సంతతి వాటా ఒకశాతం కంటే తక్కువే అయినా, అగ్రరాజ్యం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ వర్గానికి బైడెన్ తన బృందంలో పెద్దపీట వేశారు. అలాగే, తన టీమ్‌లో వివిధ మూలాలున్న వ్యక్తులకు అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యం కలిగిన పాలకవర్గాన్ని సమకూర్చుకున్నారు.
ఎన్నికల ప్రచారంలోనే భారతీయ అమెరికన్లకు తన బృందంలో పెద్దపీట వేయనున్నట్లు బైడెన్ సంకేతాలిచ్చారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపికచేసి, అందర్నీ బైడెన్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఎంపిక ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం భారతీయ అమెరికన్లే కాదు, ఆసియా సంతతి మొత్తం బైడెన్ వెంట నిలిచింది. ఇక నూతన అధ్యక్షుడి యంత్రాంగంలోని భారత సంతతి వ్యక్తులు ఎవరు.. ఏ బాధ్యతలు నిర్వహించనున్నారో ఓ సారి చూడండి..
(చదవండి: చరిత్ర సృష్టించిన జో బైడెన్)
1. నీరా టాండన్
అమెరికా నూతన అధ్యక్షుడు ఎంపిక చేసుకున్న బడ్జెట్ చీఫ్ నీరా టాండన్ భారతీయ మూలాలు కలిగిన మహిళ. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్, అమెరికన్ ప్రోగ్రెస్ యాక్షన్ ఫండ్‌కు ఈమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2008లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హిల్లరీ క్లింటన్‌కు సహాయకురాలిగా, ఆమెతో కలిసి పనిచేశారు నీరా. ఇక ఆమె బడ్జెట్ తయారీ, అమలు, నియంత్రణ విధానం పర్యవేక్షణ, అధ్యక్ష ఆదేశాలు, కార్యనిర్వాహక ఆదేశాల అమలు మొదలైన బాధ్యతలను నిర్వర్తిస్తారు.
2. వివేక్‌మూర్తి
డాక్టర్ వివేక్ మూర్తి. అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితులవుతున్నారు. ఆరోగ్యరంగ నిపుణుడిగా ఆయన వ్యాక్సినేషన్ విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు.
3. చొల్లేటి వినయ్ రెడ్డి
తెలంగాణ మూలాలు ఉన్న చొల్లేటి వినయ్ రెడ్డి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డి నారాయణరెడ్డి విజయారెడ్డి దంపతుల కుమారుడే వినయ్ రెడ్డి. వృత్తిరీత్యా వైద్యుడైన నారాయణరెడ్డి 1970లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ముగ్గురు కుమారుల్లో వినయ్ రెడ్డి ఒకరు. అమెరికాలోని ఒహియా రాష్ట్రంలో ఉన్న డేటన్లో పుట్టి పెరిగిన వినయ్ రెడ్డి మియామీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, హారిస్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీనియర్ అడ్వైజర్‌గా, స్పీచ్ రైటర్‌గా పని చేశారు.
(చదవండి: వినయ్‌రెడ్డి మనోడే!)
4.వనితా గుప్తా
అమెరికాలో అత్యంత గౌరవప్రదమైన మానవహక్కుల న్యాయవాది, భారతీయ వలస తల్లితండ్రులు గర్వించదగిన కుమార్తె అని జో బైడెన్ కొనియాడిన భారతీయ మహిళ వనితా గుప్తా. సెనేట్‌కు నామినేట్ అయిన మొట్టమొదటి ఇండియన్ అమెరికన్ అసోసియేట్ అటార్నీ జనరల్ కూడా వనితానే! లీగల్ డిఫెన్స్ ఫండ్‌లో ఉద్యోగిగా కెరీర్‌ను మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఒబామా- బైడెన్ ప్రభుత్వంలో జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లో మానవహక్కుల డివిజన్‌లోకి అడుగుపెట్టారు. అమెరికన్ ప్రజలను ఏకం చేసే సమానత్వం, స్వేచ్ఛకోసం ఆమె ఎంతో కృషి చేశారు.
5. ఉజ్రా జేయా
పౌరభద్రత, ప్రజాస్వామ్యం, మానవహక్కుల శాఖకు నామినేట్ అయిన కశ్మీరీ మహిళ ఉజ్రా జేయా. స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో ముప్పై ఏళ్ల అనుభవం కలిగిన ఉజ్రా ఉత్తరాసియా, దక్షిణాసియా, ఐరోపా మానవహక్కులు, బహుపాక్షిక అంశాలలో నిపుణురాలు. గతంలో జేయా 2014 నుంచి 2017 వరకూ ప్యారిస్‌లోని యూఎస్ ఎంబసీలో చార్జ్ అఫైర్స్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ బాధ్యతలు నిర్వహించారు. మస్కట్, డమాస్కస్, కైరో, కింగ్‌స్టన్‌లలో యూఎస్ మిషన్స్‌లో సేవలు అందించారు.
6. మాలా అడిగా
ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు మాలా పాలసీ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. జిల్‌కు సీనియర్ సలహాదారుగా, బైడెన్-కమలా హారిస్ బృందంలో సీనియర్ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ షికాగో లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాలా కొంతకాలంపాటు న్యాయవాదిగా పనిచేశారు. 2008లో ఒబామా ప్రచార బృందంలో చేరారు. ఇల్లినాయిస్‌కు చెందిన మాలా ఒబామా హయాంలో అసోసియేట్ అటార్నీ జనరల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా కూడా బాధ్యతలు చేపట్టారు. తర్వాత బైడెన్ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా పనిచేశారు. (చదవండి: సొంతూరు వీడుతూ బైడెన్ కంటతడి)
7. గరిమా వర్మ
భారత సంతతికి చెందిన గరిమా వర్మ అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు డిజిటల్ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. భారతదేశంలో జన్మించిన గరిమా తల్లితండ్రులతో కలిసి అమెరికా వలస వెళ్లారు. గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్-కమలా హారిస్‌తో కలసి పనిచేశారు. వారికి మీడియా స్ట్రాటజిస్ట్‌గా సేవలు అందించారు.
8. గౌతమ్ రాఘవన్
గతంలో వైట్‌హౌజ్‌లో పని చేసిన గౌతమ్ రాఘవన్.. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
9. భరత్ రామ్మూర్తి
వైట్ హౌస్‌లోని యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్‌ఈసీ) భరత్ రామ్మూర్తి అనే మరో ఇండో అమెరికన్ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
10. సోనియా అగర్వాల్
బైడెన్ అధికార యంత్రాంగంలో కీలకమైన పర్యావరణ విధాన సీనియర్ సలహాదారు పదవికి ఎంపికైన భారతీయ-అమెరికన్ సోనియా అగర్వాల్ కుటుంబానిది పంజాబ్ ప్రాంతం. అమెరికాలోని ఓహాయో ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. పర్యావరణ, ఆర్థిక, ప్రజా ఆరోగ్య అంశాల మీద వాతావరణ, ఇంధన విధానాల ప్రభావంపై విశ్లేషణ జరిపి, ఇంధన విధానాన్ని, దేశీయ క్లైమెట్ పాలసీనీ రూపుదిద్దే బృందానికి ఆమె నాయకత్వం వహిస్తారు. అలాగే వైట్ హౌస్‌లోని జాతీయ వాతావరణ పాలసీ ఆఫీస్‌లో ఇన్నోవేషన్ విభాగం బాధ్యతలు కూడా చూసుకుంటారు.
11.సుమోనా గుహా
వైట్‌హౌస్‌కు కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికైన ముగ్గురు భారతీయ అమెరిన్లలో సుమోనా గుహా ఒకరు. గుహ అమెరికా విదేశీ విధానం, జాతీయ భద్రత అంశాల్లో కీలక భూమిక పోషించబోతున్నారు. బైడెన్ - హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ పని చేశారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా సేవలందించారు. ఒబామా ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడైన బైడెన్‌కు జాతీయ భద్రతా వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా కూడా వ్యవహరించారు. తాజాగా బైడెన్ అధ్యక్ష హయాంలో గుహ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ హోదా పొందబోతున్నారు. (చదవండి: అమెరికా అధ్యక్షుల పెంపుడు జంతువులు ఇవే..)
12.శాంతి కలతిల్
శాంతి కలతిల్‌ది కాలిఫోర్నియాలో స్థిరపడ్డ మలయాళ కుటుంబం. ప్రస్తుతం 'నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ'లోని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ డెమొక్రటిక్ స్టడీస్‌లో సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మానన హక్కులపై తన గళాన్ని గట్టిగా వినిపించే శాంతికి చైనీస్, మాండరిన్ భాషలు క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు అగ్రరాజ్య విదేశాంగ విభాగంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాల సమన్వయకర్తగా నియమితురాలయ్యారు.
13. తరుణ్ చబ్రా
జో బైడెన్ టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సీనియర్ డైరెక్టర్‌గా తరుణ్ చబ్రాని నియమించారు.
14.వేదాంత్ పటేల్
వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ప్రవాస భారతీయుడు వేదాంత్ పటేల్‌ను నియమితులయ్యారు. బైడెన్ ప్రచారవర్గంలో రీజనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గాను, అంతకుముందు నెవాడా-వెస్టర్న్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా వేదాంత్ పనిచేశారు. అంతకుముందు ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ కు కూడా ఇదే హోదాలో డైరెక్టర్ గా ఆయన వ్యవహరించారు. ఇండియాలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగిన వేదాంత్ పటేల్.. ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు.
15.సమీరా ఫాజిలీ
బైడెన్ యంత్రాంగంలో జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన సమీర తల్లితండ్రులది కశ్మీర్. ఆమె పుట్టక ముందు, 1970లో అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. యేల్ లా స్కూల్, హార్వర్డ్ కళాశాలల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న సమీర అట్లాంటాలో ఎంగేజ్‌మెంట్ ఫర్ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌కు డైరెక్టర్‌గా, ఒబామా హయాంలో... శ్వేత సౌథంలో సీనియర్ పాలసీ అడ్వయిజర్‌గా పని చేశారు.
16.అయేషా షా
శ్వేత సౌథంలోని డిజిటల్ వ్యూహ కార్యాలయంలో పార్టనర్‌షిప్ మేనేజర్‌గా బాధ్యతలు చేపడుతున్న అయేషా కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లోని గగ్రిబల్‌లో పుట్టారు. ఆమె బాల్యమంతా అమెరికాలోని లూసియానాలో గడిచింది. ఆమె తండ్రి డాక్టర్ అమిర్ షా. శ్రీనగర్‌లోని ప్రముఖ కుటుంబాల్లో వారిది ఒకటి. 1993లో, అయేషా చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమె తల్లితండ్రులు అమెరికాకు వలస వెళ్ళారు. నార్త్ కరోలినాలోని డేవిడ్సన్ కాలేజీలో అయేషా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జాన్ ఎఫ్.కెనడీ సెంటర్ ఫర్ పెర్పార్మింగ్ ఆర్ట్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం స్మిత్‌సోనియన్ ఇనిస్టిట్యూట్‌లో అడ్వాన్స్‌మెంట్ స్పెషలిస్ట్‌గా ఉన్నారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జో బైడెన్- కమలా హారిస్ తరఫున పార్టనర్ షిప్స్‌మేనేజర్‌గా వ్యవహరించారు.
17. సబ్రీనా సింగ్
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి అమెరికన్ సబ్రిన సింగ్ నియమితులయ్యారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్‌కు సబ్రిన్ ప్రెస్ సెక్రటరీగా వ్యవహరించారు.
18. రీమా షా
భారతసంతతి రీమా షా పుట్టిందీ, పెరిగిందీ కాలిఫోర్నియాలో. హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యేల్ లా స్కూల్‌లో న్యాయవాద విద్యను పూర్తి చేసిన రీమా కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికా సుప్రీం కోర్టు... ఇలా అనేక న్యాయ సంస్థల్లో వివిధ ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు శ్వేత సౌధంలో డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. (చదవండి: ఫలించిన మూడు దశాబ్దాల కల)
19. రోహిత్ చోప్రా
భారతీయ అమెరికన్ రోహిత్ చోప్రాను కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో(సీఎఫ్‌పీబీ) చీఫ్‌గా నియమించారు. కాథ్లీన్ లౌరా క్రానింగర్ స్థానంలో రోహిత్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రోహిత్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కమిషనర్‌గా ఉన్నారు. 2018లో సెనేట్ ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయడం విశేషం. తాజాగా కీలక పరిపాలన స్థానాలకు పలువురిని నియమించిన బైడెన్.. రోహిత్‌కు సీఎఫ్‌పీబీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు.
20.విదుర్ శర్మ
కొవిడ్ టెస్టింగ్ విభాగం వ్యవహారాలను చూసే బాధ్యతను డాక్టర్ విదుర్ శర్మకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment