Neera tanden
-
బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయురాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియన్ అమెరికన్‌కు మరోసారి తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ విధానాల్లో నిపుణురాలైన భారత సంతతికి చెందిన నీరా టాండన్‌ను తన దగ్గర దేశీయ విధాన సలహాదారుగా నియమించారు. బైడెన్ ప్రభుత్వ విధానాలు రచించడం, వాటిని అమలు పరిచే బాధ్యతల్ని ఆమెకు అప్పగించారు. శ్వేత సౌధం విధాన మండలిలో ఒక ఆసియన్ అమెరికన్‌కు చోటు లభించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటి సారి. ‘‘ఆర్థిక విధానాల దగ్గర్నుంచి జాతి సమానత్వం వరకు ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఆరోగ్యం, విద్య, వలస విధానాలను రూపొందించడం, వాటిని పక్కాగా అమలు జరిగేలా చూడడానికి టాండన్‌ను డొమెస్టిక్ పాలసీ అడ్వయిజర్‌గా నియమిస్తున్నాను’’ అని బైడెన్ ప్రకటించారు. టాండన్ ప్రస్తుతం అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా ఉన్నారు. గతంలో ఒబామా, క్లింటన్ ప్రభుత్వాల్లో కూడా ఆమె పని చేశారు. -
వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నీరా టాండన్
వాషింగ్టన్: భారత సంతతి అమెరికన్ నీరా టాండన్ (51)కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే సీని యర్ అడ్వైజర్ హోదాలో ఉన్న ఆమెను వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమించినట్లు వైట్‌హౌస్ వర్గాలను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. అధ్యక్ష భవనం స్టాఫ్ సెక్రటరీగా అధికార యంత్రాంగం, ఫెడరల్ ప్రభుత్వం నుంచి అధ్యక్షుడికి అందే అన్ని రకాల ఫైళ్ల బాధ్యతలను నీరా టాండన్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్కు ఆమె తన విభాగం తరఫున నివేదికలను అందజేస్తారు. అందుకే, వైట్‌హౌస్‌కు సంబంధించి ఈ పోస్టును అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఈ నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు. జో బైడెన్ 8 నెలల క్రితం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్, బడ్జెట్ డైరెక్టర్ పదవికి ఆమెను నామినేట్ చేయగా రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించారు. దీంతో, ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. -
బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా
వాషింగ్టన్: భారతీయ–అమెరికన్, విధాన నిపుణురాలు నీరా టాండన్(50)కు అగ్రరాజ్యం అమెరికాలో కీలక పదవి దక్కింది. అధ్యక్షుడు బైడెన్‌కు ఆమె సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. నీరా రెండు నెలల క్రితమే డైరెక్టర్ ఆఫ్ ద వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ) పదవికి నామినేట్ అయ్యారు. అయితే ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు వ్యతిరేకించడంతో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ బైడెన్ తన ప్రభుత్వంలో ఆమె సేవలు అవసరమని భావించారు. దాంతో మరో కీలక పదవి దక్కింది. అధ్యక్షుడి సీనియర్ సలహాదారుగా నీరా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. యూఎస్ డిజిటల్ సర్వీసు, కేర్ యాక్ట్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. నీరా ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) పనిచేస్తున్నారు. సమాజాభివృద్ధి కోసం సంస్థ కృషి చేస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించే నీరా టాండన్ గతంలో పలువురు రాజకీయ నాయకులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. యూఎస్ హెల్త్ డిపార్డ్మెంట్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సీనియర్ అడ్వైజర్‌గానూ సేవలందించారు. బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన అఫర్డబుల్ కేర్ యాక్ట్ విధివిధానాలను ఖరారు చేయడానికి అమెరికా పార్లమెంట్‌తో కలిసి పనిచేశారు. ఒబామా, బైడెన్ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు వారి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. -
ట్వీట్లతో సీటుకి చేటు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. బడ్జెట్ చీఫ్‌గా భారతీయ అమెరికన్ నీరా టాండన్(50) నియామకంపై మద్దతు కూడగట్టడంలో అధికార పార్టీ , ఆయన కేబినెట్ విఫలమైంది. నీరా టాండన్ నియామకాన్ని ధ్రువీకరించడానికి అవసరమైన ఓట్లు సెనేట్‌లో పొందడం అసాధ్యమని తేలిపోవడంతో ఆమె నియామకంపై బైడెన్ వెనక్కి తగ్గారు. చేసేదేమిలేక నీరా టాండన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) డైరెక్టర్ పదవికి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టుగా మంగళవారం బైడెన్‌కు లేఖ రాశారు. టాండన్ గతంలో ఎందరో ప్రజాప్రతినిధులపై ట్వీట్ల దాడి చేశారు. వారిని వ్యక్తిగతంగా కించపరుస్తూ ఎన్నో ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు ఇప్పుడు ఆమె అదవికి ఎసరు తెచ్చిపెట్టాయి. ఆమె మాటల దాడిని ఎదుర్కొన్న వారిలో రిపబ్లికన్లతో పాటుగా సొంత పార్టీకి చెందిన డెమొక్రాట్లు ఉన్నారు. దీంతో నీరా వెయ్యికి పైగా ట్వీట్లను తొలగించి సెనేటర్లకి క్షమాపణ చెప్పినప్పటికీ వారి ఆగ్రహం చల్లారలేదు. మొత్తం 23 కేబినెట్ హోదా పదవులకుగాను 11 పదవులకి అధ్యక్షుడి నామినేషన్‌తో పాటుగా కాంగ్రెస్‌లో ఉభయ సభల అనుమతి ఉండాలి. ఆమె నియామకంపై సొంత పార్టీలో వ్యతిరేకత రావడంతో బైడెన్ వెనక్కి తగ్గారు. ‘నీరా టాండన్ విజ్ఞప్తి మేరకు నామినేషన్ బడ్జెట్ చీఫ్‌గా ఆమె నామినేషన్‌ను ఉపసంహరణకు అంగీకరిస్తున్నా’ అంటూ బైడెన్ ప్రకటన విడుదల చేశారు. అయితే నీరా ప్రతిభ, అనుభవంపై తనకు ఎనలేని గౌరవం ఉందన్న బైడెన్ ఆమెకు మరో పదవి ఇస్తామని చెప్పారు. అంతకు ముందు నీరా టాండన్ అధ్యక్షుడికి రాసిన లేఖలో ‘‘నా మీద మీరు ఉంచిన నమ్మకం జీవితంలో నాకు దక్కిన అపురూపమైన గౌరవం’ అని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో వివాదాల్లో నీరా నీరా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఏ అంశంపైన అయినా సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటారు. అదే ఆమెకు ఎందరు అభిమానుల్ని తెచ్చిపెట్టిందో అంత మంది శత్రువుల్ని చేసింది. ఒబామా హయాంలో ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన ఒబామా హెల్త్ కేర్ రూపకర్తల్లో నీరా ముఖ్యభూమిక పోషించారు. బిల్ క్లింటన్, హిల్లరీల తరఫున ఎన్నికల ప్రచారాన్ని చేశారు. హిల్లరీ క్లింటన్ సహాయకురాలిగా ఉన్నారు. నీరా తల్లిదండ్రులు భారతీయులు. ‘ప్రభుత్వం పంపిణీ చేసే ఆహార కేంద్రాల్లో తినీ తినక నా తల్లి నన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు అలాంటి ప్రభుత్వ పథకాల అమలు నా చేతుల మీదుగా జరుగుతుంది’ అని ఆమె ట్వీట్ చేశారు. గత నాలుగేళ్లలో నీరా టాండన్ తనకి నచ్చని వారిపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. రిపబ్లికన్ సెనేటర్ కాలిన్స్ని ‘ది వరస్ట్’ అని, మరో సెనేటర్ మిచ్ మెక్‌కన్నెల్‌ను ‘మాస్కో మిచ్’, ‘వోల్డ్‌మార్ట్’ అని నిందిస్తూ ట్వీట్లు చేశారు. 100 సీట్లు ఉండే సెనేట్‌లో చెరి 50 స్థానాలతో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు సరిసమానమైన బలంతో ఉండడం, సొంత పార్టీకి చెందిన డెమొక్రాట్లు ఆమెకు మద్దతు తెలపడానికి నిరాకరించడంతో పదవి అందలేదు. -
బైడెన్ టీం: మనకే అగ్ర తాంబులం
వాషింగ్టన్: అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే తన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇక ఉపాధ్యాక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎన్నుకున్న బైడెన్.. తన టీమ్‌లో పలువురు భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. బైడెన్ యంత్రాంగంలో 20 మంది భారత సంతతి అమెరికన్లకు చోటు దక్కగా.. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. వీరిలో 17 మంది వైట్‌హౌస్‌లో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషించనున్నారు. అమెరికా జనాభాలో భారత సంతతి వాటా ఒకశాతం కంటే తక్కువే అయినా, అగ్రరాజ్యం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ వర్గానికి బైడెన్ తన బృందంలో పెద్దపీట వేశారు. అలాగే, తన టీమ్‌లో వివిధ మూలాలున్న వ్యక్తులకు అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యం కలిగిన పాలకవర్గాన్ని సమకూర్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనే భారతీయ అమెరికన్లకు తన బృందంలో పెద్దపీట వేయనున్నట్లు బైడెన్ సంకేతాలిచ్చారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపికచేసి, అందర్నీ బైడెన్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఎంపిక ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం భారతీయ అమెరికన్లే కాదు, ఆసియా సంతతి మొత్తం బైడెన్ వెంట నిలిచింది. ఇక నూతన అధ్యక్షుడి యంత్రాంగంలోని భారత సంతతి వ్యక్తులు ఎవరు.. ఏ బాధ్యతలు నిర్వహించనున్నారో ఓ సారి చూడండి.. (చదవండి: చరిత్ర సృష్టించిన జో బైడెన్) 1. నీరా టాండన్ అమెరికా నూతన అధ్యక్షుడు ఎంపిక చేసుకున్న బడ్జెట్ చీఫ్ నీరా టాండన్ భారతీయ మూలాలు కలిగిన మహిళ. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్, అమెరికన్ ప్రోగ్రెస్ యాక్షన్ ఫండ్‌కు ఈమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2008లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హిల్లరీ క్లింటన్‌కు సహాయకురాలిగా, ఆమెతో కలిసి పనిచేశారు నీరా. ఇక ఆమె బడ్జెట్ తయారీ, అమలు, నియంత్రణ విధానం పర్యవేక్షణ, అధ్యక్ష ఆదేశాలు, కార్యనిర్వాహక ఆదేశాల అమలు మొదలైన బాధ్యతలను నిర్వర్తిస్తారు. 2. వివేక్‌మూర్తి డాక్టర్ వివేక్ మూర్తి. అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితులవుతున్నారు. ఆరోగ్యరంగ నిపుణుడిగా ఆయన వ్యాక్సినేషన్ విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు. 3. చొల్లేటి వినయ్ రెడ్డి తెలంగాణ మూలాలు ఉన్న చొల్లేటి వినయ్ రెడ్డి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డి నారాయణరెడ్డి విజయారెడ్డి దంపతుల కుమారుడే వినయ్ రెడ్డి. వృత్తిరీత్యా వైద్యుడైన నారాయణరెడ్డి 1970లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ముగ్గురు కుమారుల్లో వినయ్ రెడ్డి ఒకరు. అమెరికాలోని ఒహియా రాష్ట్రంలో ఉన్న డేటన్లో పుట్టి పెరిగిన వినయ్ రెడ్డి మియామీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, హారిస్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీనియర్ అడ్వైజర్‌గా, స్పీచ్ రైటర్‌గా పని చేశారు. (చదవండి: వినయ్‌రెడ్డి మనోడే!) 4.వనితా గుప్తా అమెరికాలో అత్యంత గౌరవప్రదమైన మానవహక్కుల న్యాయవాది, భారతీయ వలస తల్లితండ్రులు గర్వించదగిన కుమార్తె అని జో బైడెన్ కొనియాడిన భారతీయ మహిళ వనితా గుప్తా. సెనేట్‌కు నామినేట్ అయిన మొట్టమొదటి ఇండియన్ అమెరికన్ అసోసియేట్ అటార్నీ జనరల్ కూడా వనితానే! లీగల్ డిఫెన్స్ ఫండ్‌లో ఉద్యోగిగా కెరీర్‌ను మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఒబామా- బైడెన్ ప్రభుత్వంలో జస్టిస్ డిపార్ట్మెంట్లో మానవహక్కుల డివిజన్‌లోకి అడుగుపెట్టారు. అమెరికన్ ప్రజలను ఏకం చేసే సమానత్వం, స్వేచ్ఛకోసం ఆమె ఎంతో కృషి చేశారు. 5. ఉజ్రా జేయా పౌరభద్రత, ప్రజాస్వామ్యం, మానవహక్కుల శాఖకు నామినేట్ అయిన కశ్మీరీ మహిళ ఉజ్రా జేయా. స్టేట్ డిపార్ట్మెంట్లో ముప్పై ఏళ్ల అనుభవం కలిగిన ఉజ్రా ఉత్తరాసియా, దక్షిణాసియా, ఐరోపా మానవహక్కులు, బహుపాక్షిక అంశాలలో నిపుణురాలు. గతంలో జేయా 2014 నుంచి 2017 వరకూ ప్యారిస్‌లోని యూఎస్ ఎంబసీలో చార్జ్ అఫైర్స్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ బాధ్యతలు నిర్వహించారు. మస్కట్, డమాస్కస్, కైరో, కింగ్స్టన్లలో యూఎస్ మిషన్స్‌లో సేవలు అందించారు. 6. మాలా అడిగా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు మాలా పాలసీ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. జిల్కు సీనియర్ సలహాదారుగా, బైడెన్-కమలా హారిస్ బృందంలో సీనియర్ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ షికాగో లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాలా కొంతకాలంపాటు న్యాయవాదిగా పనిచేశారు. 2008లో ఒబామా ప్రచార బృందంలో చేరారు. ఇల్లినాయిస్కు చెందిన మాలా ఒబామా హయాంలో అసోసియేట్ అటార్నీ జనరల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా కూడా బాధ్యతలు చేపట్టారు. తర్వాత బైడెన్ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా పనిచేశారు. (చదవండి: సొంతూరు వీడుతూ బైడెన్ కంటతడి) 7. గరిమా వర్మ భారత సంతతికి చెందిన గరిమా వర్మ అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు డిజిటల్ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. భారతదేశంలో జన్మించిన గరిమా తల్లితండ్రులతో కలిసి అమెరికా వలస వెళ్లారు. గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్-కమలా హారిస్‌తో కలసి పనిచేశారు. వారికి మీడియా స్ట్రాటజిస్ట్‌గా సేవలు అందించారు. 8. గౌతమ్ రాఘవన్ గతంలో వైట్‌హౌజ్‌లో పని చేసిన గౌతమ్ రాఘవన్.. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 9. భరత్ రామ్మూర్తి వైట్ హౌస్‌లోని యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ) భరత్ రామ్మూర్తి అనే మరో ఇండో అమెరికన్ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. 10. సోనియా అగర్వాల్ బైడెన్ అధికార యంత్రాంగంలో కీలకమైన పర్యావరణ విధాన సీనియర్ సలహాదారు పదవికి ఎంపికైన భారతీయ-అమెరికన్ సోనియా అగర్వాల్ కుటుంబానిది పంజాబ్ ప్రాంతం. అమెరికాలోని ఓహాయో ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. పర్యావరణ, ఆర్థిక, ప్రజా ఆరోగ్య అంశాల మీద వాతావరణ, ఇంధన విధానాల ప్రభావంపై విశ్లేషణ జరిపి, ఇంధన విధానాన్ని, దేశీయ క్లైమెట్ పాలసీనీ రూపుదిద్దే బృందానికి ఆమె నాయకత్వం వహిస్తారు. అలాగే వైట్ హౌస్‌లోని జాతీయ వాతావరణ పాలసీ ఆఫీస్‌లో ఇన్నోవేషన్ విభాగం బాధ్యతలు కూడా చూసుకుంటారు. 11.సుమోనా గుహా వైట్‌హౌస్‌కు కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికైన ముగ్గురు భారతీయ అమెరిన్లలో సుమోనా గుహా ఒకరు. గుహ అమెరికా విదేశీ విధానం, జాతీయ భద్రత అంశాల్లో కీలక భూమిక పోషించబోతున్నారు. బైడెన్ - హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ పని చేశారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్లో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా సేవలందించారు. ఒబామా ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడైన బైడెన్‌కు జాతీయ భద్రతా వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా కూడా వ్యవహరించారు. తాజాగా బైడెన్ అధ్యక్ష హయాంలో గుహ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ హోదా పొందబోతున్నారు. (చదవండి: అమెరికా అధ్యక్షుల పెంపుడు జంతువులు ఇవే..) 12.శాంతి కలతిల్ శాంతి కలతిల్‌ది కాలిఫోర్నియాలో స్థిరపడ్డ మలయాళ కుటుంబం. ప్రస్తుతం 'నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ'లోని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ డెమొక్రటిక్ స్టడీస్‌లో సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మానన హక్కులపై తన గళాన్ని గట్టిగా వినిపించే శాంతికి చైనీస్, మాండరిన్ భాషలు క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు అగ్రరాజ్య విదేశాంగ విభాగంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాల సమన్వయకర్తగా నియమితురాలయ్యారు. 13. తరుణ్ చబ్రా జో బైడెన్ టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సీనియర్ డైరెక్టర్‌గా తరుణ్ చబ్రాని నియమించారు. 14.వేదాంత్ పటేల్ వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ప్రవాస భారతీయుడు వేదాంత్ పటేల్‌ను నియమితులయ్యారు. బైడెన్ ప్రచారవర్గంలో రీజనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గాను, అంతకుముందు నెవాడా-వెస్టర్న్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా వేదాంత్ పనిచేశారు. అంతకుముందు ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ కు కూడా ఇదే హోదాలో డైరెక్టర్ గా ఆయన వ్యవహరించారు. ఇండియాలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగిన వేదాంత్ పటేల్.. ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. 15.సమీరా ఫాజిలీ బైడెన్ యంత్రాంగంలో జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన సమీర తల్లితండ్రులది కశ్మీర్. ఆమె పుట్టక ముందు, 1970లో అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. యేల్ లా స్కూల్, హార్వర్డ్ కళాశాలల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న సమీర అట్లాంటాలో ఎంగేజ్మెంట్ ఫర్ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కు డైరెక్టర్‌గా, ఒబామా హయాంలో... శ్వేత సౌథంలో సీనియర్ పాలసీ అడ్వయిజర్‌గా పని చేశారు. 16.అయేషా షా శ్వేత సౌథంలోని డిజిటల్ వ్యూహ కార్యాలయంలో పార్టనర్షిప్ మేనేజర్‌గా బాధ్యతలు చేపడుతున్న అయేషా కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లోని గగ్రిబల్‌లో పుట్టారు. ఆమె బాల్యమంతా అమెరికాలోని లూసియానాలో గడిచింది. ఆమె తండ్రి డాక్టర్ అమిర్ షా. శ్రీనగర్‌లోని ప్రముఖ కుటుంబాల్లో వారిది ఒకటి. 1993లో, అయేషా చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమె తల్లితండ్రులు అమెరికాకు వలస వెళ్ళారు. నార్త్ కరోలినాలోని డేవిడ్సన్ కాలేజీలో అయేషా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జాన్ ఎఫ్.కెనడీ సెంటర్ ఫర్ పెర్పార్మింగ్ ఆర్ట్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్‌లో అడ్వాన్స్మెంట్ స్పెషలిస్ట్‌గా ఉన్నారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జో బైడెన్- కమలా హారిస్ తరఫున పార్టనర్ షిప్స్మేనేజర్గా వ్యవహరించారు. 17. సబ్రీనా సింగ్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి అమెరికన్ సబ్రిన సింగ్ నియమితులయ్యారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్‌కు సబ్రిన్ ప్రెస్ సెక్రటరీగా వ్యవహరించారు. 18. రీమా షా భారతసంతతి రీమా షా పుట్టిందీ, పెరిగిందీ కాలిఫోర్నియాలో. హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యేల్ లా స్కూల్లో న్యాయవాద విద్యను పూర్తి చేసిన రీమా కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికా సుప్రీం కోర్టు... ఇలా అనేక న్యాయ సంస్థల్లో వివిధ ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు శ్వేత సౌధంలో డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. (చదవండి: ఫలించిన మూడు దశాబ్దాల కల) 19. రోహిత్ చోప్రా భారతీయ అమెరికన్ రోహిత్ చోప్రాను కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో(సీఎఫ్‌పీబీ) చీఫ్‌గా నియమించారు. కాథ్లీన్ లౌరా క్రానింగర్ స్థానంలో రోహిత్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రోహిత్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కమిషనర్‌గా ఉన్నారు. 2018లో సెనేట్ ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయడం విశేషం. తాజాగా కీలక పరిపాలన స్థానాలకు పలువురిని నియమించిన బైడెన్.. రోహిత్‌కు సీఎఫ్‌పీబీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. 20.విదుర్ శర్మ కొవిడ్ టెస్టింగ్ విభాగం వ్యవహారాలను చూసే బాధ్యతను డాక్టర్ విదుర్ శర్మకు అప్పగించారు. -
నీరా నియామకాన్ని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు
వాషింగ్టన్: యూఎస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా ఇండో అమెరికన్ నీరాటాండన్ నియామకాన్ని రిపబ్లికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. సెనేట్‌లో కీలక సభ్యులు బహిరంగంగానే ఆమె నియామకంపై అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. గతంలో పలువురు సెనేటర్లకు వ్యతిరేకంగా ఆమె అనేక అవమానాస్పద వ్యాఖ్యలు చేసిందంటున్నారు. టాండన్ నియామకానికి సెనేట్ ఆమోద ముద్ర తప్పనిసరి. ఈనేపథ్యంలో రిపబ్లికన్ సెనేటర్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. నీరా నియామకం బైడెన్ ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో అత్యంత చెత్త నిర్ణయమని కీలకమైన సెనేటర్ జాన్ కార్నిన్ మండి పడ్డారు. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గమనిస్తే, ఆమెతో కలిసి పనిచేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. పాత వ్యాఖ్యలు బయటపడకుండా ఉండేందుకు ఆమె ఇటీవల తన పాత ట్వీట్లను చాలావరకు డిలీట్ చేసిందన్నారు. రిపబ్లికన్లను విమర్శిస్తూ చేసిన దాదాపు 1000 ట్వీట్లను ఆమె తొలగించిందన్నారు. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 50 సీట్లున్నాయి. డెమొక్రాట్లకు 48 సీట్లున్నాయి. కీలకమైన రెండు సీట్లకు జనవరి 5న ఎన్నిక జరగనుంది. నీరా పాత ట్వీట్లను పరిశీలిస్తే ట్రంప్‌పై, సెనేట్ మెజార్టీ లీడర్ మెక్కనెల్పై పలు విమర్శలున్నాయి. మెక్కనెల్ను ఆమె మాస్కో మిచ్ అని సంబోధించారు. అప్పుడప్పుడు డెమొక్రాట్లకు మద్దతు పలికే రిపబ్లికన్ సెనేటర్ కాలిన్స్‌ను పాథటిక్గా ఆమె వర్ణించారు. దీనికితోడు గతంలో ఆమె నిర్వహించిన పదవుల్లో వివక్షతో వ్యవహరించారని కొందరు సెనేటర్లు విమర్శించారు. అయితే టాప్ డెమొక్రాట్ సెనేటర్లలో కొందరు మాత్రం ఆమె నియామకాన్ని సమర్థించారు. ట్రంప్ కామెంట్లతో పోలిస్తే ఆమె కామెంట్లు చాలా సరళంగా ఉన్నాయన్నారు. బైడెన్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. -
యూఎస్: బడ్జెట్ చీఫ్‌గా నీరా టాండన్!
వాషింగ్టన్: ఇండో-అమెరికన్, సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీరా టాండన్‌ను జో బైడెన్ బడ్జెట్ చీఫ్‌గా నామినేట్ చేయనున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఈ మేరకు ఆమెకు మెనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొంది. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో నీరా హెల్త్‌కేర్ అడ్వైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆనాటి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు సలహాదారుగా కూడా పనిచేశారు. ఇదిలా ఉండగా.. ప్రముఖ ఎకనమిస్ట్ సిసిలా రౌజ్‌నును ఆర్థిక వ్యవహారాల సలహాదారుల మండలి చైర్‌పర్సన్‌గా నియమించనున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ఇక ఒబామా హయాంలో ఆర్థిక సలహాదారుగా పనిచేసిన( అంతర్జాతీయ) పని చేసిన వాలీ అడెయోమోను కూడా బైడెన్ తన టీంలోకి తీసుకోనున్నట్లు పేర్కొంది. కోశాగార కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ప్రఖ్యాత ఆర్థికవేత్త జానెట్ ఎల్. యెలెన్కు వాలీని డిప్యూటీగా అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అత్యంత సన్నిహితుడు, ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనకు ఆర్థిక సలహాదారుగా ఉన్న జారేద్ బెర్న్‌స్టీన్ సహా హైదర్ బౌషీలకు కూడా ఆర్థిక సలహాదారుల మండలిలో స్థానం కల్పించేందుకు బైడెన్ సుముఖంగా ఉన్నారని పేర్కొంది. (చదవండి: స్వల్ప అస్వస్థతకు గురైన బైడెన్) కాగా కరోనా సంక్షోభం, నిరుద్యోగిత పెరిగిన నేపథ్యంలో అమెరికాలో 2009 నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. ఆనాడు దేశాన్ని ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించడంలో ఒబామా టీంలో ఉన్న ఆర్థికవేత్తలు కీలక పాత్ర పోషించారు. కోవిడ్-19తో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం తలెత్తడం, ఉద్దీపన ప్యాకేజీలు, వాక్సిన్ కొనుగోలు- పంపిణీ తదితర సవాళ్లు ముందున్న వేళ బైడెన్ సైతం మెరికల్లాంటి, ప్రతిభ గల ఎకనమిస్టులను తన టీంలోకి తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టవచ్చనే యోచనలో బైడెన్ ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇప్పటికే విదేశాంగ విధానంపై దృష్టి సారించిన బైడెన్.. సెక్రటరీ ఆఫ్ స్టేట్- అంటోనీ బ్లింకెన్, ప్రెసిడెన్షియల్ ఎన్వాయ్ ఫర్ క్లైమేట్(పర్యావరణ అంశాల ప్రతినిధి)- జాన్ కెర్రీ, సెక్రటరీ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీగా అలెజాండ్రో మయోర్కస్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్- అవ్రిల్ హెయిన్స్, ఐరాసలో యూఎస్ దౌత్యవేత్త- లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లివన్,చీఫ్ ఆఫ్ స్టాఫ్- రాన్ క్లెయిన్కు నియమించిన విషయం తెలిసిందే.(చదవండి: జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగ) -
హిల్లరీ సక్సెస్ మేట్‌గా నీరా టాండన్
-
నా కేబినెట్లో సగం మహిళలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీచేస్తున్న హిల్లరీ క్లింటన్ తాను అధికారంలోకి వస్తే కేబినెట్లో సగం మహిళలే ఉంటారని అన్నారు. అమెరికాలో 50 శాతం మంది మహిళలే ఉన్నారు, కనుక నా కేబినెట్లో కూడా 50 మంది మహిళలు ఉంటారని ఆమె ఎంఎస్ఎన్బీసీ టౌన్ హాల్లో చెప్పారు. మేరీల్యాండ్, డెలావర్, పెన్సిల్వేనియా, కనెక్టికట్, రోడే ఐలాండ్ ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ ప్రచార మేనేజర్ జాన్ పోడేస్ట భారతీయ అమెరికన్ నీరా టాండెన్‌ను ఆమె కేబినెట్లో చూడాలని ఒక సందర్భంలో అన్నారు. నీరా ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగెస్లో పనిచేస్తున్నారు.