నీరా నియామకాన్ని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు | Republicans Opposing Neera Appointment | Sakshi
Sakshi News home page

నీరా నియామకాన్ని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు

Published Wed, Dec 2 2020 5:11 AM | Last Updated on Wed, Dec 2 2020 5:45 AM

Republicans Opposing Neera Appointment - Sakshi

వాషింగ్టన్‌: యూఎస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా ఇండో అమెరికన్‌ నీరాటాండన్‌ నియామకాన్ని రిపబ్లికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. సెనేట్‌లో కీలక సభ్యులు బహిరంగంగానే ఆమె నియామకంపై అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. గతంలో పలువురు సెనేటర్లకు వ్యతిరేకంగా ఆమె అనేక అవమానాస్పద వ్యాఖ్యలు చేసిందంటున్నారు. టాండన్‌ నియామకానికి సెనేట్‌ ఆమోద ముద్ర తప్పనిసరి. ఈనేపథ్యంలో రిపబ్లికన్‌ సెనేటర్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. నీరా నియామకం బైడెన్‌ ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో అత్యంత చెత్త నిర్ణయమని కీలకమైన సెనేటర్‌ జాన్‌ కార్నిన్‌ మండి పడ్డారు. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గమనిస్తే, ఆమెతో కలిసి పనిచేయడం కష్టమని అభిప్రాయపడ్డారు.

పాత వ్యాఖ్యలు బయటపడకుండా ఉండేందుకు ఆమె ఇటీవల తన పాత ట్వీట్లను చాలావరకు డిలీట్‌ చేసిందన్నారు. రిపబ్లికన్లను విమర్శిస్తూ చేసిన దాదాపు 1000 ట్వీట్లను ఆమె తొలగించిందన్నారు. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 50 సీట్లున్నాయి. డెమొక్రాట్లకు 48 సీట్లున్నాయి. కీలకమైన రెండు సీట్లకు జనవరి 5న ఎన్నిక జరగనుంది. నీరా పాత ట్వీట్లను పరిశీలిస్తే ట్రంప్‌పై, సెనేట్‌ మెజార్టీ లీడర్‌ మెక్‌కనెల్‌పై పలు విమర్శలున్నాయి. మెక్‌కనెల్‌ను ఆమె మాస్కో మిచ్‌ అని సంబోధించారు. అప్పుడప్పుడు డెమొక్రాట్లకు మద్దతు పలికే రిపబ్లికన్‌ సెనేటర్‌ కాలిన్స్‌ను పాథటిక్‌గా ఆమె వర్ణించారు. దీనికితోడు గతంలో ఆమె నిర్వహించిన పదవుల్లో వివక్షతో వ్యవహరించారని కొందరు సెనేటర్లు విమర్శించారు. అయితే టాప్‌ డెమొక్రాట్‌ సెనేటర్లలో కొందరు మాత్రం ఆమె నియామకాన్ని సమర్థించారు. ట్రంప్‌ కామెంట్లతో పోలిస్తే ఆమె కామెంట్లు చాలా సరళంగా ఉన్నాయన్నారు. బైడెన్‌ ప్రభుత్వంలో ఆమె కీలకంగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement