ట్వీట్లతో సీటుకి చేటు | Neera Tanden Withdraws Nomination to Lead Budget Office | Sakshi
Sakshi News home page

ట్వీట్లతో సీటుకి చేటు

Published Thu, Mar 4 2021 3:55 AM | Last Updated on Thu, Mar 4 2021 8:41 AM

Neera Tanden Withdraws Nomination to Lead Budget Office - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. బడ్జెట్‌ చీఫ్‌గా భారతీయ అమెరికన్‌ నీరా టాండన్‌(50) నియామకంపై మద్దతు కూడగట్టడంలో అధికార పార్టీ , ఆయన కేబినెట్‌ విఫలమైంది. నీరా టాండన్‌ నియామకాన్ని ధ్రువీకరించడానికి అవసరమైన ఓట్లు సెనేట్‌లో పొందడం అసాధ్యమని తేలిపోవడంతో ఆమె నియామకంపై బైడెన్‌ వెనక్కి తగ్గారు. చేసేదేమిలేక నీరా టాండన్‌ వైట్‌ హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ (ఓఎంబీ) డైరెక్టర్‌ పదవికి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టుగా మంగళవారం బైడెన్‌కు లేఖ రాశారు. టాండన్‌ గతంలో ఎందరో ప్రజాప్రతినిధులపై ట్వీట్ల దాడి చేశారు. వారిని వ్యక్తిగతంగా కించపరుస్తూ ఎన్నో ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు ఇప్పుడు ఆమె అదవికి ఎసరు తెచ్చిపెట్టాయి.

ఆమె మాటల దాడిని ఎదుర్కొన్న వారిలో రిపబ్లికన్లతో పాటుగా సొంత పార్టీకి చెందిన డెమొక్రాట్లు ఉన్నారు. దీంతో నీరా వెయ్యికి పైగా ట్వీట్లను తొలగించి సెనేటర్లకి క్షమాపణ చెప్పినప్పటికీ వారి ఆగ్రహం చల్లారలేదు. మొత్తం 23 కేబినెట్‌ హోదా పదవులకుగాను 11 పదవులకి అధ్యక్షుడి నామినేషన్‌తో పాటుగా కాంగ్రెస్‌లో ఉభయ సభల అనుమతి ఉండాలి. ఆమె నియామకంపై సొంత పార్టీలో వ్యతిరేకత రావడంతో బైడెన్‌ వెనక్కి తగ్గారు. ‘నీరా టాండన్‌ విజ్ఞప్తి మేరకు నామినేషన్‌ బడ్జెట్‌ చీఫ్‌గా ఆమె నామినేషన్‌ను ఉపసంహరణకు అంగీకరిస్తున్నా’ అంటూ బైడెన్‌ ప్రకటన విడుదల చేశారు. అయితే నీరా ప్రతిభ, అనుభవంపై తనకు ఎనలేని గౌరవం ఉందన్న బైడెన్‌ ఆమెకు మరో పదవి ఇస్తామని చెప్పారు. అంతకు ముందు నీరా టాండన్‌ అధ్యక్షుడికి రాసిన లేఖలో ‘‘నా మీద మీరు ఉంచిన నమ్మకం జీవితంలో నాకు దక్కిన అపురూపమైన గౌరవం’ అని లేఖలో పేర్కొన్నారు.

ఎన్నో వివాదాల్లో నీరా
నీరా సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఏ అంశంపైన అయినా సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటారు. అదే ఆమెకు ఎందరు అభిమానుల్ని తెచ్చిపెట్టిందో అంత మంది శత్రువుల్ని  చేసింది. ఒబామా హయాంలో ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన ఒబామా హెల్త్‌ కేర్‌ రూపకర్తల్లో నీరా ముఖ్యభూమిక పోషించారు. బిల్‌ క్లింటన్, హిల్లరీల తరఫున ఎన్నికల ప్రచారాన్ని చేశారు. హిల్లరీ క్లింటన్‌ సహాయకురాలిగా ఉన్నారు. నీరా తల్లిదండ్రులు భారతీయులు. ‘ప్రభుత్వం పంపిణీ చేసే ఆహార కేంద్రాల్లో తినీ తినక నా తల్లి నన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు అలాంటి ప్రభుత్వ పథకాల అమలు నా చేతుల మీదుగా జరుగుతుంది’ అని ఆమె ట్వీట్‌ చేశారు. గత నాలుగేళ్లలో నీరా టాండన్‌ తనకి నచ్చని వారిపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. రిపబ్లికన్‌ సెనేటర్‌ కాలిన్స్‌ని ‘ది వరస్ట్‌’ అని, మరో సెనేటర్‌ మిచ్‌ మెక్‌కన్నెల్‌ను ‘మాస్కో మిచ్‌’, ‘వోల్డ్‌మార్ట్‌’ అని నిందిస్తూ ట్వీట్లు చేశారు. 100 సీట్లు ఉండే సెనేట్‌లో చెరి 50 స్థానాలతో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు సరిసమానమైన బలంతో ఉండడం, సొంత పార్టీకి చెందిన డెమొక్రాట్లు ఆమెకు మద్దతు తెలపడానికి నిరాకరించడంతో పదవి అందలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement