
వాషింగ్టన్: భారతీయ–అమెరికన్, విధాన నిపుణురాలు నీరా టాండన్(50)కు అగ్రరాజ్యం అమెరికాలో కీలక పదవి దక్కింది. అధ్యక్షుడు బైడెన్‌కు ఆమె సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. నీరా రెండు నెలల క్రితమే డైరెక్టర్ ఆఫ్ ద వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ) పదవికి నామినేట్ అయ్యారు. అయితే ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు వ్యతిరేకించడంతో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ బైడెన్ తన ప్రభుత్వంలో ఆమె సేవలు అవసరమని భావించారు. దాంతో మరో కీలక పదవి దక్కింది. అధ్యక్షుడి సీనియర్ సలహాదారుగా నీరా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు.
యూఎస్ డిజిటల్ సర్వీసు, కేర్ యాక్ట్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. నీరా ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) పనిచేస్తున్నారు. సమాజాభివృద్ధి కోసం సంస్థ కృషి చేస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించే నీరా టాండన్ గతంలో పలువురు రాజకీయ నాయకులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. యూఎస్ హెల్త్ డిపార్డ్‌మెంట్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సీనియర్ అడ్వైజర్‌గానూ సేవలందించారు. బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన అఫర్డబుల్ కేర్ యాక్ట్ విధివిధానాలను ఖరారు చేయడానికి అమెరికా పార్లమెంట్‌తో కలిసి పనిచేశారు. ఒబామా, బైడెన్ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు వారి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment