
వాషింగ్టన్: అమెరికన్లు మాస్కు ధరించాల్సిన అవసరం లేని రోజులు త్వరలో వస్తాయని ఆ దేశ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి జోస్యం చెప్పారు. అది రెండు నెలల్లో, ఆర్నెల్లలో, లేదా ఓ ఏడాదిలో కావచ్చన్నారు. అలాగని వ్యక్తిగత జాగ్రత్తలను పక్కన పెట్టడం అంత మంచిది కూడా కాదని ఆయన హెచ్చరించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
‘‘కరోనా వంటి పెను మహమ్మారి రాత్రికి రాత్రే మాయమైపోదన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. పాత, లేదా కొత్త వేరియంట్లు మళ్లీ తెరపైకి రావచ్చు. కానీ దానికి భయపడకుండా మళ్లీ స్వేచ్ఛగా జీవితాన్ని ఆస్వాదించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కరోనాపై పోరాడేందుకు ఏడాదిగా మనం తయారు చేసుకున్న నాణ్యతతో కూడిన వ్యాక్సిన్లు, బూస్టర్లు అందరికీ సరిపడ సంఖ్యలో అందుబాటులో ఉండాలి. అప్పుడు కరోనా మరణాలను దాదాపుగా తగ్గించుకోవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు.
యువతపై ప్రభావం
యువత మానసిక ఆరోగ్యంపై కరోనా చాలా ప్రభావం చూపుతోందని భారత సంతతికి చెందిన మూర్తి ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయమిది. మానసిక ఆరోగ్య నిపుణుల సాయంతో వారికి దన్నుగా నిలవడం చాలా అవసరం’’ అన్నారు. కరోనా తెరపైకి వచ్చిన తొలి నాళ్లలో అమెరికాలో నల్ల జాతీయులకు, లాటిన్, నేటివ్ అమెరికన్లకు వ్యాక్సిన్ల లభ్యత అంతగా ఉండేది కాదన్నారు. తర్వాత పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment