వందలాది నివాస గృహాలు, చెట్లు దహనం
సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న వేలాది మంది జనం
మంటల్లో కాలి బూడిదైన వాహనాలు
5,700 ఎకరాల భూమిపై కార్చిచ్చు ప్రభావం
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో కార్చిచ్చు రగలింది. వేగంగా విరుచుకుపడిన దావానలం ధాటికి వందలాది నివాస గృహాలు కాలి బూడిదయ్యాయి. ఇద్దరు మృత్యువాత పడ్డారు. నాలుగు వైపుల నుంచి మంటలు దూసుకొస్తున్నాయి. వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం లాస్‌ఏంజెలెస్‌కు ఈశాన్య ప్రాంతంలోని ఇన్‌లాండ్ ఫూట్‌హిల్స్‌లో ఉన్న చిట్టడవిలో మంటలు చెలరేగాయి.
క్రమంగా నగరం వైపు దూసుకొచ్చాయి. బలమైన ఈదురు గాలులు వీచడంతో మంటల తీవ్రత మరింత పెరిగినట్లు తెలిసింది. బుధవారం ఉదయం కల్లా పరిస్థితి విషమించింది. మరికొన్ని ప్రాంతాల నుంచి మంటలు వ్యాప్తి చెందాయి. సముద్ర తీరం వెంబడి హాలీవుడ్ నటులు, సంపన్నులు నివాసం ఉండే పసిఫిక్ పాలీసేడ్స్ ఏరియాలోనూ మంటలు వ్యాపించాయి. ఈటాన్ కెన్యాన్ సమీపంలోని అల్టాడెనా, సిల్మార్ సబర్బ్ వరకు విస్తరించాయి.
మొత్తానికి లాస్‌ఏంజెలెస్ సిటీని మంటలు చుట్టుముట్టాయి. 5,700 ఎకరాలకుపైగా భూమిపై కార్చిచ్చు ప్రభావం ఉండడం గమనార్హం. 1,400 మంది అగి్నమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆరి్పవేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసుపత్రుల్లోని రోగులను బయటకు తరలించారు. నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్ద సంఖ్యలో చెట్లు అగి్నకి ఆహుతయ్యాయి. మరోవైపు జనమంతా ఒక్కసారిగా బయటకు రావడంతో రోడ్లపై రాకపోకలు స్తంభించాయి.
వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్స్‌లకు దారి లేకపోవడంతో బుల్డోజర్ల సాయంతో కార్లను పక్కకు తప్పించారు. గంటకు 97 కిలోమీటర్ల వేగంతో మంటలు వ్యాపించడం గమనార్హం. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని అగ్ని మాపక సిబ్బంది చెప్పారు. కొండల దిగువ ప్రాంతాల్లో మంటలు మరింత చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చాలారోజులుగా వర్షాలు పడకపోవడంతో గడ్డి, చెట్లు ఎండిపోయాయి. దాంతో మంటల తీవ్రత అధికంగా ఉంది.
లాస్ ఏంజెలెస్ కార్చిచ్చుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అందోళన వ్యక్తంచేశారు. ఇన్‌లాండ్ రివర్‌సైడ్ కౌంటీ పర్యటనను రద్దు చేసుకొని, కార్చిచ్చుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆయన లాస్ ఏంజెలెస్‌లోని ఓ హోటల్‌లో మకాం వేశారు. హోటల్ గది నుంచి పొగలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరిస్థితిని ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కార్చిచ్చు వల్ల ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న సంగతి ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. 13 వేలకుపైగా నివాసాలకు ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు అందాయి. కాలిఫోరి్నయా గవర్నర్ గవిన్ న్యూసమ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కార్చిచ్చును స్వయంగా పరిశీలించారు. చాలా ఇళ్లు దహనమయ్యాయని ప్రకటించారు. హాలీవుడ్ థీమ్ పార్క్, యూనివర్సల్ సిటీవాక్‌ను మూసివేసినట్లు యూనివర్సల్ స్టూడియో ప్రకటించింది.
మంటల్లో చార్టర్ హైసూ్కల్
లాస్ ఏంజెలెస్‌లోని పసిఫిక్ పాలీసేడ్స్ ప్రాంతంలోని ప్రఖ్యాత చార్టర్ హైసూ్కల్ వరకు మంటలు వ్యాపించాయి. ధనవంతుల బిడ్డలు ఈ పాఠశాలలో విద్య అభ్యసిస్తుంటారు. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ ఈ స్కూల్‌ను చూడొచ్చు. కార్చిచ్చు కారణంగా పాఠశాలల్లో కొంత భాగానికి మంటలు అంటుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ సమయంలో స్కూల్‌లో కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. మంటలు వ్యాపించగానే వారిని బయటకు పంపించారు. స్కూల్‌ను వెంటనే మూసివేశారు. ఇటువైపు రావొద్దని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సూచించింది.
ఇక్కడ క్రీడాపరికరాలు, బోధనా పరికరాలు కాలిపోయాయి. చార్టర్ హైసూ్కల్‌కు సమీపంలోనే ఉన్న పాలీసేడ్స్ చార్టర్ ఎలిమెంటరీ స్కూల్ సైతం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిసింది. లాస్ ఏంజెలెస్‌కు శివారు లాంటి పసిఫిక్ పాలీసేడ్స్ ప్రాంతంలో టామ్ హాంక్స్, జెన్నీఫర్ అనిస్టన్ వంటి హాలీవుడ్ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. లాస్‌ఏంజెలెస్ సిటీ కాలిఫోరి్నయా రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ప్రతిఏటా జనవరిలో బలమైన ఈదురు గాలులు వీస్తుంటాయి. ఆగి్నకి ఆజ్యం తోడైనట్లు ఈ గాలులకు నిప్పు తోడైతే కార్చిచ్చుగా మారుతూ ఉంటుంది.
కళ్ల ముందే విధ్వంసం
లాస్ ఏంజెలెస్‌లో మంటల ధాటికి నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు కుప్పకూలాయి. కళ్ల ముందే జరుగుతున్న విధ్వంసాన్ని చూసి జనం భయంతో వణికిపోయారు. ప్రాణాలు దక్కించుకొనేందుకు పరుగులు తీశారు. తరుముకొస్తున్న మంటల నుంచి తప్పించుకోవడానికి కాలినడకనే ముందుకు కదిలారు. ఇళ్లలో ఉన్న కార్లు బయటకు తీసే వీల్లేకుండాపోయిందని బాధితులు చెప్పారు. చేతికందిన వస్తువులు తీసుకొని బయటకు వచ్చామని అన్నారు. వందలాది కార్లకు నిప్పంటుకుంది. అవి బూడిద కుప్పలుగా మారిపోయాయి. ఇళ్లలోని పెంపుడు జంతువులు సైతం మరణించాయి. దట్టమైన పొగ అలుముకుంది. లాస్ ఏంజెలెస్‌లో గవర్నర్ గవిన్‌న్యూసమ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంటలను అదుపు చేయడానికి అగి్నమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అగ్ని మాపక యంత్రాలు, సిబ్బందిని రప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment