Scientists Discovered World Largest Bacterium In Caribbean Mangrove Swamp - Sakshi
Sakshi News home page

World Largest Bacterium: మానవాళి భవిష్యత్తు ‘గుట్టు’ నేనే..

Published Sun, Jun 26 2022 8:50 AM | Last Updated on Sun, Jun 26 2022 10:23 AM

The Pictorial Organism Was Recently Discovered By Scientists - Sakshi

జీవుల్లో మొక్కలు, జంతువులు పూర్తిగా వేర్వేరు. కణాల నిర్మాణం నుంచి బతికే తీరుదాకా రెండూ విభిన్నమే. కానీ మొక్కలు, జంతువుల మధ్య విభజన గీతను చెరిపేసే చిత్రమైన జీవిని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. అది ఇటు జంతువులా ఆహారాన్ని ఆరగిస్తూనే.. మరోవైపు మొక్కల్లా శరీరంలోనే ఆహారాన్ని తయారు చేసుకుంటోందని గుర్తించారు. దాని గుట్టు తెలిస్తే మానవాళి భవిష్యత్తే మారిపోతుందని అంటున్నారు. ఆ విశేషాలేమిటో తెలుసుకుందామా.. మొక్కలకు.. జంతువులకు మధ్య.. 

అదో సముద్రపు నత్త (సీ స్లగ్‌). చూడటానికి ఆకుపై పాకుతున్న నత్తలా ఉంటుంది. కానీ దాని శరీరమే అచ్చం ఆకులా ఉంటుంది. అలా కనిపించడమే కాదు.. నిజంగానే
అది సగం జంతువులా, మరో సగం మొక్కలా బతికేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా తూర్పు తీరంలో మాత్రమే  కనిపించే ఈ సముద్రపు నత్తలకు ‘ఎలిసియా క్లోరోటికా’ అని పేరుపెట్టారు. 

నాచు నుంచి పత్ర హరితాన్ని సంగ్రహించి.. మొక్కలు భూమి నుంచి నీరు, పోషకాలనుగ్రహించి.. సూర్యరశ్మి సాయంతో ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో మొక్కల ఆకుల్లో ఉండే ‘పత్ర హరితం (క్లోరోప్లాస్ట్‌)’ చాలా కీలకం. ఈ క్లోరోప్లాస్ట్‌ కణాల వల్లే ఆకులకు ఆకుపచ్చ రంగు వస్తుంది. సాధారణంగా ‘ఎలిసియా క్లోరోటికా’ నత్తలు సముద్రాల్లో ఉండే నాచు (ఆల్గే)ను తిని బతుకుతుంటాయి. ఈ క్రమంలో నత్తలు నాచులోని క్లోరోప్లాస్ట్‌లను తమ శరీరంలో విలీనం చేసుకుంటున్నాయని.. వాటి సాయంతో ఆహారాన్ని ఉత్పత్తి (ఫొటో సింథసిస్‌) చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

రెండు అంగుళాల పరిమాణంలో ఉండే ఈ సముద్ర నత్తలు తమ శరీరాన్ని కూడా ఒక ఆకు ఆకారంలోనే అభివృద్ధి చేసుకోవడం గమనార్హం.      శాస్త్రవేత్తలు వీటిపై ల్యాబ్‌లో పరిశోధన చేయగా.. ఏకంగా 9 నెలల పాటు తినడానికి ఏమీ లేకున్నా బతకగలిగాయి. ఆ సమయంలో క్లోరోప్లాస్ట్‌ల సాయంతో సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. నాచు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని తింటున్నాయని.. దానిలోని క్లోరోప్లాస్ట్‌లను సంగ్రహించి నిల్వ చేసుకుంటున్నాయని
గుర్తించారు. 

ఆ ‘గుట్టు’ తేల్చితే ఎన్నో అద్భుతాలు
‘ఎలిసియా క్లోరోటికా’ నత్తలు క్లోరోఫిల్‌ను ఎలా సంగ్రహించగలుగుతున్నాయి, ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయనేది తేల్చితే..ఎన్నో అద్భుత టెక్నాలజీలను రూపొందించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సౌరశక్తిని ఉపయోగించి నేరుగా ఆహారం తయరుచేయగల సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని అంటున్నారు. అడవుల
నరికివేత తగ్గిపోతుందని, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని.. పర్యావరణాన్ని కాపాడవచ్చని పేర్కొంటున్నారు. చంద్రుడు, ఇతర గ్రహాలపైకి వెళ్లే మనుషులకు ఆహారం సమస్య ఉండదని అంటున్నారు. 

తేల్చాల్సిన అంశాలెన్నో! 

‘ఎలిసియా క్లోరోటికా’ నత్తలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. వాటి సంఖ్య చాలా తక్కువని, అంతరించిపోయే దశలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే వాటి ‘గుట్టు’ తేల్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కొన్ని అంశాలపై దృష్టి సారించారు. 
మొక్కలు, జంతువులు కణాలు పూర్తిగా వేరుగా ఉంటాయి.
అలాంటిది వీటి మధ్య జీవ, రసాయనపరంగా అనుసంధానం ఎలా కుదిరింది? 

మొక్కల క్లోరోప్లాస్ట్‌లను ఈ నత్తలు ఎలా వినియోగించుకో గలుగుతున్నాయి?  
ఏదైనా తిన్నప్పుడు కడుపులో జీర్ణమైపోతాయి.
అలాంటప్పుడు ఈ నత్తల కడుపులో క్లోరోప్లాస్ట్‌లు దెబ్బతినకుండా ఎలా ఉంటున్నాయి?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement