
లేడీ రిపోర్టర్ అత్యుత్సాహం
కోపంగా లుక్కిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: ఓ లేడీ రిపోర్టర్ అత్యుత్సాహం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెట్టింది. శుక్రవారం వాషింగ్టన్ డీసీలో గాజాపై మీడియా ప్రశ్నలకు బదులిస్తుండగా ఒక రిపోర్టర్ తన మైక్‌ను ట్రంప్‌కు మరీ దగ్గరగా పెట్టేందుకు ప్రయత్నించింది. దాంతో అది కాస్తా అనుకోకుండా ఆయన మూతికి తాకింది. దాంతో అధ్యక్షుడు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆమెకేసి ఆగ్రహంగా చూడటమే గాక ఇదేం పని అన్నట్టుగా కనుబోమ్మలు ఎగరేశారు.
‘ఏం చేశావ్ నువ్వు!’ అంటూ నిలదీశారు. తర్వాత మీడియా ప్రశ్నలకు బదులిస్తూ, ‘ఈ రాత్రి ఆమె టీవీ షోగా, బిగ్ స్టోరీగా మారిపోయింది’ అంటూ తనదైన శైలిలో స్పందించారు. ఈ ఉదంతంపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. వారి జోకులు, కామెంట్లతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. ‘‘ఇందులోనూ కుట్ర కోణముందేమో! మైక్‌కు ప్రాణాంతక ఆంత్రాక్స్ పొడి, ఫెంటానిల్ డ్రగ్ వంటివేమైనా రుద్దారేమో. ఏమైనా దీన్నంత తేలిగ్గా తీసుకోరాదు’’ అని ఒక ఎక్స్ యూజర్ చెణుకు విసిరాడు.
‘ట్రంప్ గనుక మరికొన్ని గంటల్లో అనుమానాస్పదంగా మరణిస్తే అందుకు ఆ లేడీ రిపోర్టరే కారకురాలు’ అని మరొకరు, ‘‘మైక్‌పై విషం పూసి ఉండొచ్చు. కాస్త అతిగా అనిపించినా సరే, దీనిపై లోతైన విచారణ జరగాల్సిందే’’ అని ఇంకొకరు రాసుకొచ్చారు. ఇది క్షమించరాని భద్రతా లోపమంటూ ట్రంప్ మద్దతుదారులు ఆగ్రహిస్తున్నారు. రిపోర్టరైనా సరే, మైక్‌తో అంత దగ్గరికి ఎలా రానిస్తారని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment