
- అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లో ఘోర ప్రమాదం
- ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన ప్రయాణికుల విమానం
- పొటోమాక్ నదిలో కూలిన రెండు లోహ విహంగాలు.. 67 మంది మృతి
- 28 మృతదేహాలు వెలికితీత... మరో 39 మంది జాడ గల్లంతు
- ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని ట్రంప్ ప్రకటన
అర్లింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి. సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండవుతున్న సమయంలో ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దాంతో వెంటనే అవి రెండూ నదిలో కూలిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది, హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారు. ఇప్పటిదాకా 28 మంది మృతదేహాలను నది నుంచి వెలికితీయగా, మిగతా ప్రయాణికుల జాడ తెలియరాలేదు.
వారంతా మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అమెరికా చరిత్రలో అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌కు, క్యాపిటల్ భవనానికి కేవలం మూడు మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానాన్ని పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తోంది. కాన్సాస్‌లోని విషిటా నుంచి బయలుదేరిన విమానం వాషింగ్టన్ డి.సి. సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ల్యాండయ్యేందుకు సిద్ధమవుతూ అమెరికా రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్–60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను గగనతలంలో ఢీకొట్టింది. దాంతో పెద్ద శబ్దం చేస్తూ రెండు లోహ విహంగాలు పొటోమాక్ నదిలో కూలిపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి, నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశారు. విమానం, హెలికాప్టర్ చాలావరకు నీటిలో మునిగిపోయాయి.
ఇప్పటిదాకా 28 మృతదేహాలను నది నుంచి వెలికితీసినట్లు ప్రకటించారు. మిగిలిన వారు జీవించి ఉంటారన్న నమ్మకం తమకు లేదని అగ్నిమాపక శాఖ అధికారి జాన్ డాన్లీ చెప్పారు. విమాన ప్రయాణికుల్లో చాలామంది ఫిగర్ స్కేటింగ్ క్రీడాకారులు, వారి కోచ్‌లు, కుటుంబ సభ్యులే ఉన్నారు. వీరంతా విషిటాలో శిక్షణా తరగతుల్లో పాల్గొని తిరిగి వస్తున్నారు. ఇద్దరు కోచ్‌లను రష్యాకు చెందిన ఎవ్‌గెనియా సిస్కోవా, వాదిమ్ నౌమోవ్‌గా గుర్తించారు. వీరు 1994లో ఫిగర్ స్కేటింగ్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్స్ పెయిర్స్ టైటిల్ గెలుచుకున్నారు. రెండు సార్లు ఒలింపిక్ క్రీడల్లో పోటీపడ్డారు.
దర్యాప్తు ప్రారంభం
ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన బాంబార్డియర్ సీఆర్‌జే–701 ట్విన్ ఇంజన్ విమానం 2004లో కెనడాలో తయారయ్యింది. ఇందులో 70 మంది ప్రయాణించవచ్చు. ప్రమాద సమయంలో విమానం భూమి నుంచి 400 అడుగుల ఎత్తులో ఉంది. గంటకు 140 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. రీగన్ ఎయిర్‌పోర్టులోని రన్‌వే 33పై ల్యాండ్ చేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సూచించగా, పైలట్ అంగీకరించాడు. రన్‌వేపై దిగడానికి విమానం సిద్ధమైంది.
సరిగ్గా పొటోమాక్ నది మధ్య భాగంపై గగనతలానికి చేరుకున్న సమయంలో హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. రన్‌వేకు 2,400 అడుగుల దూరంలో విమానంలోని రేడియో ట్రాన్స్‌పాండర్ నుంచి సమాచారం ఆగిపోయింది. విమానం ప్రయాణిస్తున్న మార్గంలోకి హెలికాప్టర్ ఎందుకు వచ్చిందన్నది తెలియరాలేదు. ప్రమాదం జరిగినప్పుడు వాషింగ్టన్‌లో గడ్డకట్టేంత చలి ఉంది. పొటోమాక్ నదిలో నీళ్లు అత్యంత చల్లగా ఉన్నాయి. తాజా దుర్ఘటన నేపథ్యంలో 1982లో జరిగిన విమాన ప్రమాదాన్ని వాషింగ్టన్ ప్రజలు గుర్తుచేసుకున్నారు. 1982 జనవరి 13న ఎయిర్ ఫ్లోరిడా విమానం పొటోమాక్ నదిలో కూలిపోయింది. 78 మంది మరణించారు. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. వాషింగ్టన్ డి.సి.కి దక్షిణ భాగంలో పొటోమాక్ నది పక్కనే రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు ఉంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించడానికి ప్రయాణికులు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే విమానంలో ఉన్నవారికి వైట్‌హౌస్, వాషింగ్టన్ మాన్యుమెంట్, లింకన్ మెమోరియల్, నేషనల్ మాల్, యూఎస్ క్యాపిటల్ వంటి ప్రఖ్యాత కట్టడాలు చక్కగా కనిపిస్తాయి.
హెలికాప్టర్ ఎందుకు తప్పించుకోలేదు?: ట్రంప్
రాజధాని జరిగిన దుర్ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగలలేదన్నారు. గగనతలంలో విమానం స్పష్టంగా కనిపిస్తున్నప్పకీ ఆర్మీ హెలికాప్టర్ ఎందుకు తప్పించుకోలేకపోయిందని ట్రంప్ ప్రశ్నించారు. విమానం ఢీకొట్టకుండా పక్కకు మళ్లడమో లేదా పైకి లేదా కిందికు వెళ్లడమో ఎందుకు జరగలేదని అన్నారు. ఇది నివారించదగ్గ ప్రమాదమేనని స్పష్టంచేశారు. 2001 నవంబర్ 12 తర్వాత అమెరికాలో ఒక విమాన ప్రమాదంలో మొత్తం ప్రయాణికులు, సిబ్బంది మృతిచెందడం ఇదే మొదటిసారి. 2001 నవంబర్ 12న కెన్నడీ ఎయిర్‌పోర్టు నుంచి వచి్చన విమానం న్యూయార్క్‌ని బెల్లీ హార్బర్‌లో కూలిపోయింది. ఆ ప్రమాదంలో విమానంలోని మొత్తం 260 మంది దుర్మరణం పాలయ్యారు.

VIDEO OF CRASH
A video showing the crash between a Blackhawk helicopter and American Airlines flight below.
pic.twitter.com/fqYlUTqXD3— Life Lessons Academy (@LifeLessonsAcad) January 30, 2025
పెరిగిన విమాన ప్రమాదాలు.. అన్నీ ఈ నెలలోనే..
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. వాతావరణంలో మార్పులు, సాంకేతిక లోపాలు వీటికి కారణంగా నిలుస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని విమాన ప్రమాదాలు..

హియాలియా (ఫ్లోరిడా)
2025, జనవరి 25న ఇంజిన్‌లో తలెత్తిన సమస్య కారణంగా సెస్నా 172 విమానం హియాలియా సమీపంలోని ఎవర్‌గ్లేడ్స్‌లో ఒక మట్టి రోడ్డుపై కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనపై ఎఫ్‌ఏఏ దర్యాప్తు(FAA investigation) చేస్తోంది.

నెవార్క్ (న్యూజెర్సీ)
2025, జనవరి 25న విమానం డెక్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం 2143.. నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి వచ్చింది.
ఎలోయ్ (అరిజోనా)
2025, జనవరి 24న, ఎలోయ్ మున్సిపల్ విమానాశ్రయం సమీపంలో స్కైడైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం చోటుచేసుకుంది.

క్లీవ్‌ల్యాండ్ (ఒహియో)
2025, జనవరి 24న, డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం 621 టైర్ పేలిపోయింది. దీంతో ఈ విమానం క్లీవ్‌ల్యాండ్ హాప్కిన్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
మయామి (ఫ్లోరిడా)
2025 జనవరి 24న క్యాబిన్‌లో విద్యుత్ కాలిన వాసన వచ్చిందని సిబ్బంది గుర్తించడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం 1300 మయామి అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి వచ్చింది.
కొలంబియా (కాలిఫోర్నియా)
2025, జనవరి 23న సెస్నా 172 విమానం కొలంబియాలోని ఒక పొలంలో కూలిపోయింది. ఈ ఘటనలపై ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment