తీవ్ర సంక్షోభంలో ఊగిసలాడుతున్న శ్రీ లంకలో.. నిరసనకారులపై మొదటిసారి తుటా పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. లంక గడ్డపై ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి నిరసనకారులపై కాల్పులు జరపడం ఇదే తొలిసారి.
నిరసనకారులు రాళ్లు రువ్వి హింసకు పాల్పడడంతోనే తాము కాల్పులకు దిగినట్లు ఓ పోలీస్ అధికారి ధృవీకరించారు. సోమవారం రాజధాని కొలంబోకు వంద కిలోమీటర్ల దూరంలోని రామ్‌బుక్కన్న దగ్గర చమురు కొరత, అధిక ధరలను వ్యతిరేకిస్తూ కొందరు నిరసనకారులు హైవేని దిగ్బంధించారు. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఒకరు మృతి చెందగా, పదిమందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన నిరసనకారులు రెచ్చిపోయి.. మరిన్ని దాడులకు తెగపడ్డారు.
ఇదిలా ఉండగా.. పెట్రో ధరలను ఇవాళ ఏకంగా 64 శాతం ధరను పెంచేసింది సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్. దీనికి నిరసనగానే ప్రదర్శనలు జరుగుతున్నాయి. చాలాచోట్ల వాహనదారులు.. తమ బైక్ టైర్లను కాల్చేసి రహదారుల్ని మూసేసి నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభం లంకలో కొనసాగుతోంది. ఆహార ఉత్పత్తులు, మందులు, చమురు కొరత తీవ్రంగా కొనసాగుతోంది అక్కడ. ఇన్నిరోజుల పాటు నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు, ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లగా.. ఇప్పుడు ఏకంగా ప్రాణ నష్టం సంభవించింది.
ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర(ఇవాళ్టి పెంపుతో) రూ. 338కి చేరుకుంది. ఆ దేశానికి చెందిన లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్ఐఓసీ) చమురు ధరలను పెంచింది. దీనికి అనుగుణంగా నిన్న అర్ధరాత్రి సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ 92 ఆక్టేన్ పెట్రోల్ ధరనే ఏకంగా రూ. 84 మేర పెంచేసింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 338కి చేరుకుంది. భారీగా పెరిగిన పెట్రోల్ ధరలపై లంక ప్రజలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment