కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను గట్టున పడేసే నాయకుడి కోసం యావత్ దేశం చూస్తోంది. ఆ దేశ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా అంత సులభమేమీ కాదు. ఈ క్రమంలో దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ఇటీవలే ప్రారంభించింది ఆ దేశ పార్లమెంట్. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స స్థానాన్ని బర్తి చేసేందుకు మంగళవారం ముగ్గురు నామినేట్ అయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్ నేత అనురా దిస్సనాయకేలు పోటీ పడుతున్నట్లు పార్లమెంట్ మంగళవారం ప్రకటించింది. బుధవారం ఎన్నిక జరగనుంది. భారీ భద్రత మధ్య మంగళవారం సమావేశమైన పార్లమెంట్‌లో చట్టసభ్యులు ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ సభ కేవలం 10 నిమిషాల్లోనే ముగియటం గమనార్హం.
నేతల మధ్య ఒప్పందం..!
పార్లమెంట్ సమావేశానికి కొద్ది సమయం ముందు విపక్ష నేత సాజిత్ ప్రేమదాస పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలహప్పెరుమాకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు.. రాత్రికి రాత్రే ఇరువురు నేతలు ఓ ఒప్పందానికి వచ్చారనే వాదనలు వినపడుతున్నాయి. ఒకరు అధ్యక్షుడు, మరొకరు ప్రధానిగా బాధ్యతులు చేపట్టి ప్రభుత్వాన్ని నడపాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
విక్రమ సింఘేకే అవకాశం..
73 ఏళ్ల విక్రమ సింఘేకు అపార అనుభవం ఉంది. ఆరుసార్లు ప్రధానిగా చేశారు. ఎస్‌ఎల్‌పీపీ పార్టీ నాయకత్వం ఆయనకు మద్దతు ఇస్తోంది. దీంతో ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 225 సభ్యులు గల పార్లమెంట్‌లో ఎస్‌ఎల్‌పీపీనే అతిపెద్ద పార్టీగా ఉంది. మూడో అభ్యర్థి, జేవీపీ, పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ నేత, 53 ఏళ్ల అనురా దిస్సనాయకే పార్టీకి పార్లమెంట్‌లో మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి. మరోవైపు.. అధ్యక్ష బరిలో నిలవాలని భావించిన ఆర్మీ మాజీ చీఫ్ శరత్ ఫొన్సెకా చట్టసభ్యుల మద్దతు కూడగట్టటంలో విఫలమయ్యారు. కొత్తగా బాధ్యతులు చేపట్టే అధ్యక్షుడు 2024, నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
ఇదీ చదవండి: Sri Lanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment