
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టుగా సామాజిక మాధ్యమం ట్విట్టర్ ప్రకటించింది. ఒక దేశాధినేత అకౌంట్‌ని శాశ్వతంగా తొలగించడం ఇదే తొలిసారి. అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడికి దిగిన రెండు రోజుల తర్వాత ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ట్రంప్ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ తెలిపింది. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ట్రంప్ అధ్యక్షుడి హోదాలో ఉన్నంతవరకు ఆయన అకౌంట్‌ని బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ‘కొద్ది రోజులుగా ట్రంప్ అకౌంట్ నుంచి వచ్చే ట్వీట్లను సమీక్షిస్తున్నాం. అవి ఎలా ప్రజల్లోకి వెళుతున్నాయి, ఏ విధంగా వాటిని అర్థం చేసుకునే అవకాశం ఉంది వంటి అంశాలను పరిశీలించాక అవి మరింతగా హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని తేలింది’అని ట్విట్టర్ తెలిపింది.
చూస్తూ ఊరుకోం: ట్రంప్
ట్విట్టర్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం తాను ఊహించిందేనని ట్రంప్ అన్నారు. ఈ విషయంలో తాను కానీ, తన మద్దతుదారులు కానీ చూస్తూ మౌనంగా ఊరుకోమని హెచ్చరించారు. తన అకౌంట్ నిషేధించాక ఆయన అమెరికా అధ్యక్షుడి హోదాలో అధికారిక ఖాతా ద్వారా వరస ట్వీట్లు చేశారు. ‘ట్విట్టర్‌లో స్వేచ్ఛగా భావాలను ప్రకటించే అవకాశం లేదు. రాడికల్ వామపక్ష భావజాలం కలిగిన వారినే ఆ సంస్థ ప్రోత్సహిస్తూ ఉంటుంది. వాక్ స్వాతంత్య్రాన్ని ఎప్పుడూ అడ్డుకుంటూ ఉంటుంది. అందుకే ఈ సారి కొత్త సామాజిక మాధ్యమం ద్వారా వస్తాను. వివిధ వెబ్‌సైట్లతో సంప్రదింపులు జరుపుతున్నాను’’అని ట్రంప్ తన ట్వీట్లలో పేర్కొన్నారు. ట్విట్టర్ చర్య నమ్మశక్యంగా లేదని ఇండియన్ అమెరికన్ పొలిటీషియన్ నిక్కీ హేలీ అన్నారు.
11న అభిశంసన?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసనకు రంగం సిద్ధం అవుతోంది. క్యాపిటల్ హిల్‌పై దాడి ఘటన నేపథ్యంలో రాజీనామా చేయా లంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను ట్రంప్ పెడచెవిన పెడుతుండటంపై డెమోక్రాట్లు ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండగా అంతకు ముందే అభిశంసనతో ట్రంప్‌ను సాగనంపే ప్రయత్నాలను వేగిరం చేశారు. తిరుగు బాటును ప్రేరేపించారనే కారణంతో చేపట్టే అభిశంసనకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. హౌస్‌లో అభిశంసన తీర్మానాలను ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు సోమవారం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సీఎన్‌ఎన్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment