● నర్సరీ దగ్ధం.. కాలిపోయిన బోరుమోటారు
● తృటిలో తప్పిన పెను ప్రమాదం
జనగామ: జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రాంగణం హెలీప్యాడ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెక్యూరిటీ గార్డు గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఎస్టేట్ ఆఫీసర్ డి.మౌనిక, అదనపు కలెక్టర్ సహాయకులు సత్యపాల్, సూపర్‌వైజర్ రాజశేఖర్ అగ్ని మాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అప్పటికే సీఐ దామోదర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నా రు. హెలీప్యాడ్ ప్రాంతం నుంచి మంటలు వ్యాపించి అటవీశాఖ నర్సరీని చుట్టేసాయి. దీంతో మొక్కలు, డ్రిప్ పరికరాలు, పైపులు, బోరు, కరెంటు వైర్లు కాలిపోయాయి. మంటలు 33/11కేవీ సబ్‌స్టేషన్ వైపు దూసుకు వచ్చాయి. డీఎఫ్‌ఓ రేమండ్‌బాబు పర్యవేక్షణలో ఎల్‌ఎఫ్ వి.సుధాకర్, ఫైర్‌మెన్లు కరుణాకర్, రాజశేఖర్‌రెడ్డి, డ్రైవర్ ఆపరేటర్ ఎస్‌కే.రఫీ చేరుకుని గంట పాటు కష్టపడి మంటలను అదుపులోకి తేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మందు బాబులకు అడ్డాగా మారిన హెలీప్యాడ్ ఏరియాలో ఎవరైనా సిగరేట్ అంటించే క్రమంలో నిప్పు రవ్వ పడి మంటలు చెలరేగవచ్చని భావిస్తున్నారు.
కలెక్టరేట్ ప్రాంగణంలో మంటలు