
రత్నగిరి..చివరాఖరికి..
● భక్తుల సేవల్లో వెనుకబాటు
● రాష్ట్రంలోని ఏడు పుణ్యక్షేత్రాలకు ర్యాంకులు
● అన్నవరం దేవస్థానానికి ఆఖరి స్థానం
అన్నవరం: కోరిన కోర్కెలు తీర్చే సత్యదేవుడు వెలసిన అన్నవరం దేవస్థానానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తూంటారు. ఆదాయం కూడా బాగానే వస్తూంటుంది. కానీ, భక్తులకు అవసరమైన సేవలు అందించడంలో మాత్రం అన్నవరం దేవస్థానం పూర్తి స్థాయిలో వెనుకబడింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై దేవదాయ శాఖ ఇటీవల ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) ద్వారా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అనంతరం ప్రకటించిన ర్యాంకుల్లో అన్నవరం వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానం చిట్టచివరి స్థానం పొందింది. భక్తులకు సేవలందించడం, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లలో వెనుకబడింది. వరుసగా కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, విశాఖపట్నం సింహాచలం, శ్రీశైలం మొదటి ఆరు స్థానాల్లో నిలవగా, అన్నవరం దేవస్థానం ఆఖరి ర్యాంకుతో సరిపెట్టుకుంది.
ర్యాంకులు ఇలా..
● దేవాలయాల్లో మౌలిక వసతులు, తాగునీరు, వాష్ రూములు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు తదితర అంశాల్లో అన్నవరం దేవస్థానానికి ఆరో ర్యాంకు వచ్చింది. ఇందులో కాణిపాకం దేవస్థానం మొదటి ర్యాంకు సాధించింది.
● ఇతర దేవస్థానాల కన్నా అన్నవరం దేవస్థానంలో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోందని ఎక్కువ మంది భక్తులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అన్నవరానికి ఆరో ర్యాంకు వచ్చింది. ఇందులో విజయవాడ కనకదుర్గ గుడి మొదటి ర్యాంకు పొందింది.
● సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యతను భక్తులందరూ ప్రశంసిస్తూంటారు. కానీ, ఆశ్చర్యకరంగా ప్రసాదం విషయంలో సత్యదేవుని ఆలయానికి ఐదో ర్యాంకు వచ్చింది. ఈ విషయంలో శ్రీకాళహస్తి మొదటి ర్యాంకు సాధించింది.
● ప్రసాదం విషయంలో 50 శాతం, దర్శనానికి సంబంధించి 30 శాతం, మౌలిక వసతులపై 20 శాతం మంది భక్తుల అభిప్రాయాలు తీసుకున్నట్లు దేవదాయ శాఖ తెలిపింది.
ఇవీ లోపాలు
ఒకప్పుడు రాష్ట్రంలో తిరుపతి తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు, ఆదాయం, భక్తుల రాకపోకలతో వెలుగొందిన అన్నవరం దేవస్థానం పరిస్థితి మిగిలిన దేవస్థానాల కన్నా దిగువన ఉండటం గమనార్హం. దేవస్థానానికి ఏడో ర్యాంకు వచ్చే అంతగా పరిస్థితి దిగజారిందా అనే అభిప్రాయాన్ని సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు దేవస్థానానికి అన్ని విధాలా ఇబ్బందికరంగా మారాయి. ఒకవైపు ఆర్థిక సమస్యలు దేవస్థానాన్ని కుంగదీస్తున్నాయి. ప్రతి నెలా సిబ్బంది జీతాలు, పెన్షన్లకే నిధులు పోగేయాల్సి వస్తోంది. నిర్మాణాలు, ఇతర వ్యయాలు చాలా వరకూ కుదించాల్సి వచ్చింది.
● దేవస్థానంలో వివాదాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. దేవస్థానంలోని ఉచిత కల్యాణ మండపంలో ఒక సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమానికి అనుమతించడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. దీనికి సంబంధించి నిర్వాహకులు ధార్మిక కార్యక్రమం అని చెప్పి అనుమతి తీసుకున్నారని దేవదాయ శాఖకు ఈఓ నివేదిక పంపించారు.
● సెల్‌ఫోన్ భద్రపరిచేందుకు దేవస్థానంలో రూ.5 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.10 వసూలు చేశారని ఒక భక్తుడు ఆధారాలతో వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. దీనిపై విచారణ అనంతరం రూ.5 లక్షల పరిహారం, మనోవేదనకు గురైన ఆ బాధితునికి ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని ఫోరం ఆదేశించింది. ఇది కూడా చర్చనీయాంశమైంది.
● వీటికి తోడు దేవస్థానంలో పరిపాలన కూడా గతంలో అంత చురుకుగా లేదనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం ఈఓగా డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును రెండు నెలల క్రితం ప్రభుత్వం నియమించింది. ఆయన దేవదాయ శాఖకు కొత్త కావడంతో సిబ్బందిపై ఆధారపడి పాలన సాగించాల్సి వస్తోంది. కొంత అవగాహన వచ్చినప్పటికీ ఇంకా పట్టు పెంచుకోవల్సిన అవసరం ఉంది.
మొదటి ర్యాంకు సాధిస్తాం
దేవస్థానంలో ప్రత్యేక ప్రణాళికతో ఏర్పాట్లు చేసి, మొదటి ర్యాంకు వచ్చేలా కృషి చేస్తాం. సత్రాల గదుల్లో దుప్పట్ల కొనుగోలు, పారిశుధ్యం మెరుగుదల, మౌలిక వసతుల కల్పన, ప్రసాదం నాణ్యత మరింత పెంచడం వంటి చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు నిబంధనల ప్రకారం భక్తులతో మెలిగేలా చర్యలు తీసుకుంటాం.
– వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం

రత్నగిరి..చివరాఖరికి..
Comments
Please login to add a commentAdd a comment