వైఎస్సార్ సీపీ అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలిగా లక్ష్మ
రౌతులపూడి: వైఎస్సార్ సీపీ అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా రౌతులపూడి మండలం ఎ.మల్లవరం గ్రామానికి చెందిన అంగూరి లక్ష్మీ శివకుమారి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులందాయి. దళిత వర్గానికి చెందిన లక్ష్మీ శివకుమారి గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలిగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పదవులు చేపట్టారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం వైఎస్సార్ సీపీ అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా పదవి ఇచ్చింది.
ఆక్టోపస్ శిక్షణ పూర్తి
కాకినాడ క్రైం: ఉగ్ర చర్యల నిరోధక సంస్థ ఆక్టోపస్ ప్రత్యేక శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల(ఆర్‌ఎంసీ)లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో 40 మంది కమాండోలు శిక్షణ పొందారు. ఆక్టోపస్ అదనపు ఎస్పీ సి.రాజారెడ్డి పర్యవేక్షణలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ఎస్.మురళీకృష్ణ, కె.మహేష్‌ల ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్, రెక్కీలపై శిక్షణ నిర్వహించారు. ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం ఆదేశాలతో వైస్ ప్రిన్సిపాల్ శశి, ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫణికిరణ్, లైబ్రేరియన్ లక్ష్మణరెడ్డి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు
సహకరించాలి
కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ జె.వెంకటరావు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిక నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 98 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లూ చేశామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కాకినాడ మెక్లారిన్ హైస్కూల్, పెద్దాపురం ఆర్‌డీఓ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి పంపిణీ జరుగుతుందన్నారు. సమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
23న గ్రూప్–2 మెయిన్ పరీక్ష
కాకినాడ సిటీ: ఏపీపీఎస్సీ ఈ నెల 23న నిర్వహిస్తున్న గ్రూప్–2 మెయిన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లూ చేయాలని జాయింట్ కలెక్టర్, ఏపీపీఎస్సీ పరీక్షల జిల్లా కో ఆర్డినేటర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. గ్రూప్–2, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన గురువారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. గ్రూప్–2 పేపర్–1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ జరుగుతుందని తెలిపారు. ఉదయం 9.45 గంటల తర్వాత, మధ్యాహ్నం 2.45 గంటల తర్వాత అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ పరీక్షకు జిల్లాలో 9,379 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, వీరి కోసం 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. 12 మంది లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించామన్నారు. వీరు ఆయా కేంద్రాలను తనిఖీ చేసి, అభ్యర్థులు తమ వెంట తీసుకువచ్చిన ఫోన్లు, బ్యాగులు, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించాలని జేసీ రాహుల్ మీనా ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో వెంకటరావు, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎన్.వెంకటరావు, సీపీవో పి.త్రినాథ్, జిల్లా వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖల అధికారులు ఎన్.విజయకుమార్, ఎస్.సూర్యప్రకాశరరావు, కె.కరుణాకర్‌బాబు, రెవెన్యూ, విద్యుత్, వైద్య, ఆరోగ్యం, ప్రజా రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో
హద్దులు దాటితే చర్యలు
కాకినాడ క్రైం: సోషల్ మీడియాలో హద్దులు దాటి వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు, మార్ఫింగ్ వీడియోలు, సున్నిత అంశాలపై అసంబద్ధ ప్రస్తావనలు, కులమతాలు, ఓ వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన పోస్టులు, వ్యక్తిగత దూషణలకు దిగితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నెటిజన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment