
సీతారాములకు ఘనంగా శ్రీపుష్పయాగం
రత్నగిరిపై ముగిసిన శ్రీరామనవమి వేడుకలు
అన్నవరం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో చివరగా తొమ్మిదో రోజు ఆదివారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీసీతారాములకు శ్రీపుష్పయాగం కార్యక్రమం నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో రాత్రి ఎనిమిది గంటలకు నవదంపతులు సీతారాములను వెండి సింహాసనంపై , పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రత్యేక సింహాసనంపై ప్రతిష్టించి పండితులు పూజలు చేశారు. అనంతరం సీతారాములను సుగంధ భరిత పుష్పాలతో పూజించారు. సీతారాములకు వివిధ రకా ల పిండివంటలు నివేదించారు. అనంతరం వేదపండితులు ఆశీస్సులందజేశారు. రామాలయంలో పూలమాలలతో అలంకరించిన ఊయల మీద సీతారాములను పవళింపు చేసి మంత్రాలు చదువుతూ మూడుసార్లు ఊపారు. అనంతరం ఆ ఊయలకు అమర్చిన అద్దంలో సీతారాములను పండితులు దర్శించారు. అనంతరం పండితులకు దంపత తాంబూలాలు బహూకరించారు. భక్తులకు ప్రసాదాలను, ముత్తయిదువులకు జాకెట్టు ముక్కలను పంపిణీ చేశారు. భక్తు లు సీతారాములను అద్దంలో తిలకించి పులకించారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో రత్నగిరి పై శ్రీరామ నవమి మహోత్సవాలు ముగిసాయి.

సీతారాములకు ఘనంగా శ్రీపుష్పయాగం