
ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం
ఆలమూరు: వేసవి తాపాన్ని అధిగమించేందుకు, శరీరంలో సంభవించే అనేక రుగ్మతలను నివారించి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన తాటిముంజలు ఐస్ యాపిల్‌గా విశేష ప్రాచుర్యం పొందాయి. ఈ తాటిముంజల సీజన్ ఇప్పుడే ప్రారంభం కావడంతో, వీటికి విపరీతమైన డిమాండు ఏర్పడింది. తాటికాయలు ముంజల దశలో జెల్లీ మాదిరిగా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. మరో మూడు నెలల్లో తాటిముంజలు తాటిపండ్లుగా మారడంతో పాటు, ఆరోగ్యకరమైన తేగలనూ ఇస్తాయి. ఈ తాటిముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేసే లక్షణం కలిగి ఉన్నందున వీటికి విపరీతమైన డిమాండు ఉంటుంది.
కాలక్రమంలో..
గ్రామీణ ప్రాంతాల్లో తాటి చెట్లు అధికంగా ఉండేవి. తాటిముంజల లభ్యత ఎక్కువగా ఉన్నా.. చెట్లు ఎక్కి ముంజకాయలు దింపే కార్మికుల కొరత ఏర్పడడంతో వీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ఎలుకల బెడద కారణంగా పొలాల్లో, రియల్ ఎస్టేట్ కారణంగా మారుమూల గ్రామాల్లో సైతం తాటిచెట్లను నరికేస్తుండటంతో భవిష్యత్తులో ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్న ఆందోళన ఉంది.
ఆరోగ్య ప్రదాయినిగా..
ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే ఈ తాటిముంజలు కల్తీ లేని, స్వచ్ఛమైనవి కావడంతో ఆరోగ్య ప్రదాయినిగా భావిస్తుంటారు. జిల్లాలో తాటిముంజలు సేకరించే వారు కరవయ్యారు. దీంతో మైదాన ప్రాంతాల్లో ఉన్న డిమాండును దృష్టిలో ఉంచుకుని కొందరు మెట్ట, చాగల్నాడు ప్రాంతాలకు చెందిన రైతు కూలీలు తాటిముంజలను పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తాటిముంజల సీజన్ ప్రారంభమైంది. తాటిముంజుల పరిమాణాన్ని బట్టి డజను రూ.80 నుంచి రూ.120 వరకూ విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నా తాటిముంజల ప్రియులు దీనిని లెక్కచేయడం లేదు. లేలేతగా ఉండే తాటిముంజలు అద్భుత రుచితో నోరూరిస్తున్నాయి.
ఆరోగ్య రక్షణకు దోహదం
వేసవి నుంచి వర్షాకాలం ప్రారంభం వరకూ లభ్యమయ్యే తాటిముంజలను తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్య రక్షణ లభిస్తుంది. పోషకాలు అధికంగా ఉండటంతో పాటు, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. సీజన్ సమయంలో ప్రతి ఒక్కరూ భుజించాల్సిన అవసరం ఉంది.
– ఏవీవీ రాజా అక్కుల, హెల్త్ ఎడ్యుకేటర్,
పెదపళ్ల, ఆలమూరు మండలం
చక్కని ఆరోగ్యం లభిస్తుంది
తాటిముంజలు తింటే చక్కని ఆరోగ్యం లభిస్తుంది. ఐస్ యాపిల్‌గా పిలిచే తాటిముంజలను ఏడాదికి ఒకసారైనా తినాలని కోరిక ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే లభ్యమవుతుండటం వల్ల తాటిముంజలను కొనుగోలు చేయకతప్పడం లేదు,
– ఎ.రామసీత, గృహిణి, ఆలమూరు
ప్రయోజనాలివే..
● తాటిముంజల్లో విటమిన్లు, ఫాస్పరస్, థయామిన్, బీ–కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియంతో పాటు, సోలెబుల్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
● వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవితాపం, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. వికారం, వాంతులను నివారిస్తుంది.
● తాటిముంజలను తినడం వల్ల శరీరంలో పేరుకున్న హానికర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంతో పాటు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
● వేసవిలో ఏటా సీజన్‌లో క్రమం తప్పకుండా తాటిముంజలను తినడం ద్వారా చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించుకుని, మంచి కొలస్ట్రాల్‌ను వృద్ధి చేసుకోవచ్చు. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
● వీటిలో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో పోషకాలుండటం వల్ల అలసట, నిర్జలీకరణం నుంచి ఉపశమనం కలిగించి, శరీర బరువు పెరగకుండా చేస్తుంది.
● వీటిలో ఉండే పోషకాలు జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించి, జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి.
● ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, ఉదర సంబంధ సమస్యల నివారణకు దోహదపడుతుంది.
● మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
● తాటిముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పూతలా వేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
● చర్మానికి కావాల్సినంత తేమను అందించి చెమటకాయల్ని నివారిస్తుంది. ఎండ వేడిమికి ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.
తాటిముంజలతో
శరీరానికి విటమిన్లు పుష్కలం
ప్రస్తుత సీజన్‌లో విపరీతమైన డిమాండ్
ఐస్ యాపిల్‌గా ప్రాచుర్యం

ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం

ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం

ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం

ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం