డొంకేశ్వర్: మండలంలోని నూత్‌పల్లి పాతూరు గడి కోటకు చరిత్రాత్మక చరిత్ర ఉంది. ఈ పురాతన కోటను రాజులు పరిపాలించారని చరిత్రకారులు చెబుతున్నారు. రాజులు ఇక్కడి నుంచి వెళ్తూ గడీని పోలీస్‌పటేల్‌గా ఉన్న తమ తాతగారైన పొద్దుటూరి నర్సింహారెడ్డికి అప్పగించినట్లు ఆయన మనువడు రాంచందర్‌రెడ్డి వెల్లడించారు. గడీని అప్పగించిన తర్వాత ఇక్కడ ఇళ్లు నిర్మించుకొని నివాసమున్నట్లు ఆయన చెప్పారు.
ఐతే, ఎత్తయిన ఈ గడీని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వచ్చేవారు. 1982లో ఎస్సారెస్సీ ప్రాజెక్టును నిర్మించడంతో పాత నూత్‌పల్లి గ్రామంతో పాటు కోట కూడా ముంపునకు గురైంది. ప్రస్తుతం ప్రతీ వర్షాకాలంలో గడీ కొంతమేర ముంపునకు గురై ఎండాకాలంలో తేలుతుంది. ఇప్పుడు గడీ చుట్టూ చెట్లు, చెలము పెరిగి నిర్మానుష ప్రాంతంగా మారింది.
ముఖద్వారం కోట గట్టిదనం..
సుమారు 400 ఏళ్ల క్రితం నిర్మించిన గడీ కోట ముఖద్వారం ఇప్పటికీ గట్టిదనంతో కనిపిస్తోంది. ఎత్తయిన ముఖద్వారం బురుజును పెద్దరాతి బండలు, పొడవైన ఇటుకలతో నిర్మించారు. అగంతకులు కోటలోకి చొరబడకుండా చుట్టూ ప్రహారి ఉండేది. అది ప్రస్తుతం కూలిపోయింది. కాగా నలుదిక్కులా నూతులు(బావులు) కూడా ఉన్నాయి. కోటకు కాపాలాదారులు ఉండేవారు. కోటలోనే మైసమ్మ గుడి కూడా ఉంది. దొంగలను బంధించడానికి కోటలో రాతితో కట్టిన ‘కొటేరు’ ఉంది. కోట నుంచి గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు సొరంగం కూడా ఉంది. ఇవన్నీ చూసిన పోలీస్ పటేల్ మనువళ్లు రాంచందర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబం ప్రస్తుతం జిల్లా కేంద్రంలో నివాసం ఉంది. నాటి కాలంలో గడీలో గడిపిన క్షణాలను రాంచందర్ ‘సాక్షి’తో పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment