విద్యుత్‌ తీగలు తగిలి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగలు తగిలి వ్యక్తి మృతి

Jun 25 2024 12:12 AM | Updated on Jun 25 2024 12:12 AM

విద్య

విద్యుత్‌ తీగలు తగిలి వ్యక్తి మృతి

కోరుట్ల రూరల్‌: కోరుట్ల మండలం సర్పరాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన కొక్కు నడిపి గంగారం(50) విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం నడిపి గంగారాం కిరాణం నడుపుకొంటూ జీవిస్తున్నాడు. తన ఇంటిముందు గల రేకుల పైకప్పు వర్షానికి ఉరుస్తుండటంతో సరి చేసేందుకు సోమవారం ఇంటిపైకి వెళ్లాడు. పైనున్న 11కేవీ విద్యుత్‌ తీగలను గమనించకపోవటంతో తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్‌ అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చేపలు పట్టేందుకు వెళ్లి వృద్ధుడు

ధర్మపురి: చేపల వేట కోసం వెళ్లి.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై ఉదయ్‌కుమార్‌ తెలిపారు. పట్టణంలోని బోయవాడకు చెందిన నర్ముల రాజనర్సు (65) సోమవారం సాయంత్రం స్థానిక తమ్మళ్లకుంటలో చేపలు పట్టడానికి థర్మకోల్‌ తెప్పపై వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి మునిగిపోయాడు. రోడ్డువై వెళ్తున్న కొందరు గమనించి పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాజనర్సును బయటకు తీయగా అప్పటికే మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

రాయికల్‌(జగిత్యాల): రాయికల్‌ మండలం క ట్కాపూర్‌కు చెందిన ఆవుల పోశవ్వ (60) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఏఎస్సై దేవేందర్‌ తెలిపారు. కట్కాపూర్‌కు చెందిన పోశవ్వ ఈనెల 19న పెన్షన్‌ డబ్బులు తీసుకుంటానని ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం తాట్లవాయి గ్రామ శివారులోని అటవీప్రాంతంలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం కావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్సై పరిశీలించారు. మృతురాలి ఒంటిపై ఉన్న దుస్తుల ఆధారంగా పోశవ్వ అని ఆమె కూతురు కుర్ర లక్ష్మీ గుర్తించింది. పోశవ్వ అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు పడిపోవడంతోనే మృతిచెందినట్లు ఆమె కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మృతి

కొత్తపల్లి(కరీంనగర్‌): గీత వృత్తినే నమ్ముకొని 30 ఏళ్లుగా ఉపాధి పొందుతున్న గీతకార్మికుడు సోమవారం సాయంత్రం తాటిచెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి రేకుర్తి (18వ డివిజన్‌)లో జరిగింది. పోలీసుల వివరాలు.. రేకుర్తికి చెందిన బత్తిని సత్తయ్యగౌడ్‌ (54) రోజూలాగానే తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు. కల్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికుడి మృతి పట్ల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్వార్‌తో బెదిరింపులు

యువకుడిపై కేసు

కోరుట్ల: కోరుట్ల పట్టణంలో ఓ యువకుడు కత్తితో బెదిరిస్తూ తీసిన వీడియో వైరల్‌ కావడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం పేయింటర్స్‌ అసోషియేషిన్‌లో వివాదాలు నెలకొనడంతో ఆ గ్రూపులో ఉన్న ప్రేమ్‌సాగర్‌ తల్వార్‌తో కొందరిని బెదిరిస్తూ పోస్ట్‌ చేశాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న అభియోగంతో సదరు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విద్యుత్‌ తీగలు తగిలి వ్యక్తి మృతి1
1/1

విద్యుత్‌ తీగలు తగిలి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement