
పోటెత్తిన ‘ప్రజావాణి’
కన్నవారి కాఠీన్యం
ఈ వృద్ధురాలి పేరు పెద్ది రుక్కవ్వ. కొత్తపల్లి మండలం బావుపేట. ఈమెకు ఇద్దరు కుమారులు. చిన్నకొడుకు శంకరయ్య మరణించగా పెద్దకొడుకు రాజయ్య వద్ద కొంతకాలం వరకు ఉంది. మొదటి నుంచి చిన్న కోడలు పట్టించుకోకపోగా ప్రస్తుతం పెద్దకొడుకు పట్టించుకోవడం లేదని రోదించింది. తన భర్త గంగారాం పేరున 8ఎకరాలు ఉందని, అతను మరణించినందున సదరు భూమిని తనపేరుపై మార్చాలని కలెక్టర్‌తో వాపోయింది. ఇల్లు లేకపోగా పెద్దకొడుకు ఇంటి మెట్ల కింద తలదాచుకుంటున్నానని, రూ.కోట్ల ఆస్తి ఉండి తనకిదేం దుస్థితని చెమ్మగిల్లిన కళ్లతో గోడు వెల్లబోసుకుంది.
కరీంనగర్ అర్బన్: ‘ప్రజావాణి’కి అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ కార్యాలయం జన జాతరను మరిపించింది. సోమవారం అర్జీలు వెల్లువలా వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల తదుపరి 300లకు పైగా అర్జీలు రావడం ఇదే తొలిసారి. 312మంది తమ సమస్యలను విన్నవించారు. కలెక్టర్ పమేలా సత్పతి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. దాదాపు అన్ని సమస్యలు మండలస్థాయిలో పరిష్కరించే అంశాలే కాగా అలవిమాలిన నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లకు అర్జీలు అందజేశారు.
ఆర్డీవో ఆదేశాలను పట్టించుకుంటలేరు
గ్రామంలోని 268/ఇలో 11గుంటల భూమి ఉంది. సదరు భూమి నా ఇస్సాగా రావాల్సి ఉండగా నా ప్రమేయం లేకుండా నా సోదరులు అమ్మేశారు. ఈ విషయమై రెవెన్యూ కోర్టులో కేసు వేయగా నా పేరున భూ వివరాలను నమోదు చేయాలని తీర్పు ఇచ్చారు. సదరు తీర్పును అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు.
– బోకూరి పతి, నగునూరు, కరీంనగర్ రూరల్
కలెక్టరేట్‌లో ఎటు చూసినా జనమే
తొలిసారి 312 అర్జీల స్వీకరణ
అత్యధికం భూ సమస్యలే
ప్రజావాణిలో ఒక్కొక్కరిది ఒక్కోగాథ
వచ్చిన దరఖాస్తులు: 312
నగరపాలక : 47, డీపీవో: 25
డీఈవో: 14, సీపీ ఆఫీస్: 11
కరీంనగర్ ఆర్డీవో: 14
కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 24
మానకొండూరు, గంగాధర, తిమ్మాపూర్ తహసీల్దార్: 20, వారిధి సొసైటీ: 13
ఇతర: 144

పోటెత్తిన ‘ప్రజావాణి’