
నవాజ్ (ఫైల్)
బొమ్మనహాళ్: బళ్లారిలోని హెచ్చెల్సీ కాలువలో సరదాగా స్నానానికి వెళ్లిన ఓ బాలుడు గురువారం గల్లంతై శుక్రవారం బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు వద్ద శవమై తేలాడు. బళ్లారి రూరల్ ఏఎస్‌ఐ హనుమంతప్ప, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు.. బళ్లారిలోని మిల్లర్ పేటకు చెందిన సాజిదాబాను, దాదాపీర్ దంపతుల కుమారుడు నవాజ్ (16) అనే బాలుడు పట్టణంలోని గుగ్గరహట్టిలో నివాసం ఉంటున్న తన స్నేహితుడు ఫరూక్‌తో కలిసి గుగ్గరహట్టి సమీపంలోని హెచ్చెల్సీ కాలువలో స్నానానికి వెళ్లాడు. అయితే నవాజ్ ప్రమాదవశాత్తు కాలువ నీటిలో గల్లంతయ్యాడు. దీంతో ఫరూక్ వెంటనే నవాజ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు బళ్లారి రూరల్ పోలీసుల సాయంతో గాలించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం మండలంలోని ఉంతకల్లు గ్రామ శివారులోని హెచ్చెల్సీ 1వ డిస్ట్రిబ్యూటరీ వద్ద నవాజ్ శవమై కనిపించాడు. అక్కడి స్ధానికులు గమనించి ఇచ్చిన సమాచారంతో బళ్లారి రూరల్ పోలీసులు, బంధువులు వెళ్లి నవాజ్ శవాన్ని పరిశీలించి గుర్తించారు. బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం బళ్లారి విమ్స్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి తండ్రి దాదాపీర్ గత కొంతకాలంగా పక్షపాతంతో బాధపడుతున్నాడు. మృతుడు నవాజ్ టైల్స్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.