పొంగిన నందిని పాల ధర
లీటరుపై రూ. 2 పెంపు
ఇక నుంచి 50 మి.లీ అదనం
శివాజీనగర: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరికొన్ని నిత్యావసరాల ధరలను భగ్గున మండించింది. రాష్ట్ర పాల సమాఖ్య (కేఎంఎఫ్) నందిని బ్రాండ్ పాల ధరను లీటర్‌పై రూ. 2 పెంచింది, బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది. కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఇప్పటినుంచి అర్ధ, 1 లీటర్ పాల ప్యాకెట్‌లో అదనంగా 50 మి.లీ.పాలను చేర్చి విక్రయిస్తామన్నారు. 50 మిల్లీలీటర్ల పాల విలువ 2 రూపాయల 10 పైసలు అవుతుందన్నారు. ఇది అదనపు పాల ధర తప్ప పెంపు కాదని చెప్పారు.
లీటరుకు రూ. 44కు చేరిక
ప్రస్తుతం నందిని నీలిరంగు ప్యాకెట్ పాల ధర లీటర్ రూ.42 ఉండగా, బుధవారం నుంచి రూ.44 అవుతోంది. అర్ధ లీటర్ పాల ధర రూ.22 నుంచి రూ. 24కు చేరుతుంది. పెరుగు, ఇతర నందిని ఉత్పత్తుల ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని తెలిపారు. కొన్నిరోజుల పాటు పాల ప్యాకెట్లపై పాత ఉన్నా కొత్త రేటును వసూలు చేస్తారని ప్రజలు గమనించాలని కోరారు.
పోరాడుతాం: బీజేపీ
పాల ధరపై బీజేపీ నేతలు బీ.వై.విజయేంద్ర, ఆర్.అశోక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే పాల ధరను 2 సార్లు పెంచారు. పేదలు, మద్య తరగతి ప్రజలపై కొంచైమెనా కనికరం ఉంటే తక్షణమే పాల ధరను తగ్గించాలన్నారు. పెట్రోల్–డీజిల్ ధరల పెరుగుదల, కూరగాయలతో ప్రజలు కంగారు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో పేదలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ధరల పెంపుపై నిరంతరం ఆందోళనలు చేస్తామని తెలిపారు.
నాకు తెలియదే: సీఎం సిద్దు
కేఎంఎఫ్ పాల ధర పెంపు తన దృష్టికి రాలేదని సీఎం సిద్దరామయ్య చెప్పడం గమనార్హం. మంగళవారం తన నివాస కార్యాలయం కృష్ణాలో అఖిల భారత సాహిత్య సమ్మేళనం నిర్వహణపై సాహితీవేత్తలతో చర్యలు జరిపారు. ఆపై విలేకరులతో మాట్లాడుతూ పాల ధర పెంపు నాకు తెలియదు. కేఎంఎఫ్‌తో మాట్లాడుతాను. ధరల విషయం ప్రభుత్వ పరిధిలో ఉండదు అని అన్నారు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పాల ధర తక్కువగా ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment