రాయచూరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రాయచూరు, యాదగిరి జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు రంగం సిద్ధమైంది. ఈ జిల్లాల్లో అన్ని విధాలుగా మౌలిక సౌకర్యాలు, వనరులు సమృద్ధిగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల జోన్‌గా ప్రకటించడంతో భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. రాయచూరు జిల్లాలో చిక్కసూగూరు, వడ్లూరు, ఏగనూరు, కుకనూరు వంటి ప్రాంతాల్లో 1744.75 ఎకరాల భూమిని అభివృద్ధి పరచడానికి గెజెట్ నోటిఫికేషన్ వెల్లడించింది. యాదగిరి జిల్లాలో 3284.27 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. పరిశ్రమల కేంద్రంలో రోడ్లు, మురుగు కాలువలు, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పిస్తారు. రాయచూరు, యాదగిరి జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. బెంగళూరు–ముంబై, చైన్నె –ముంబై, బెంగళూరు–న్యూఢిల్లీ, కన్యాకుమారి–చైన్నె, మైసూరు–వారణాసి రైళ్ల సౌకర్యం, విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, తుంగభద్ర, కృష్ణా నదులు, హట్టి బంగారు గనుల కంపెనీలు ఉండటంతో పాటు పత్తి, వరి, మిరప ప్రధాన పంటలు పండిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment