భవనం కట్టాలంటే లంచం ఇవ్వాలి
● కర్ణాటకలో పాలన అస్తవ్యస్తం
● కేంద్ర మంత్రి శోభ నిప్పులు
శివాజీనగర: బెంగళూరులో ఒక భవనం నిర్మించాలంటే ఒక్కో అడుగుకు రూ.100 లంచం ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ట్యాక్స్ వ్యవస్థ నడుస్తోంది అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగటం లేదు. శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పశువుని పొడిచిన వ్యక్తిని మానసిక అస్వస్థుడని అంటున్నారు. పోలీస్ స్టేషన్‌పై దాడులు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో బాలింతలు చనిపోతున్నారు. అన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే చేస్తే సిద్దరామయ్య అధికారంలో ఎందుకు ఉండాలని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తొమ్మిది విశ్వవిద్యాలయాలను మూసేస్తున్నారు, పాత విశ్వవిద్యాలయాలకు నిధులు ఇవ్వలేదు, ఇలాగైతే విద్యార్థుల గతేమిటని ఆమె ప్రశ్నించారు. సీఎం సిద్దరామయ్య సిఫార్సు వల్లే బెంగళూరులో నమ్మ మెట్రో టికెట్ చార్జీలు పెరిగాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
కారు–లారీ ఢీ.. కుటుంబం బలి
బనశంకరి: కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర తాలూకాలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. కొప్పళకు చెందిన వెంకటేశ్, భార్య చైత్ర, ఏడేళ్ల కుమారుడు శ్రీహన్, డ్రైవరు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి కారులో బయలుదేరారు. యల్లాపుర తాలూకా అరబైలు వద్ద కారును లారీ డీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు, కుమారుడు తీవ్ర గాయాలతో చనిపోయారు, డ్రైవరు శ్రీకాంత్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. యల్లాపుర పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.
లోయలోకి బస్ పల్టీ..
25 మందికి గాయాలు
బనశంకరి: కేఎస్ ఆర్టీసీ బస్ లోయలోకి పడిన ఘటనలో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన కాగవాడ తాలూకా మైశాళ గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం కాగవాడ మైశాళ గ్రామం మీరజ్ నుంచి విజయపుర కు వెళుతున్న ఆర్‌టీసీ బస్ అదుపుతప్పి 25 అడుగుల కందకంలోకి పడిపోయింది. బస్సులో 40 మంది ఉండగా, 25 మంది గాయపడ్డారు. బస్సులో చిక్కుకున్న వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. మీరజ్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆస్పత్రిలో చేరిన కుమార
శివాజీనగర: కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి అనారోగ్యంతో బాధపడుతూ చైన్నెలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. కేంద్ర మంత్రి అయిన తరువాత నిరంతరం పర్యటనలలో ఉండడం వల్ల విశ్రాంతి లేక అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. చైన్నె అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స ముగిసిన తరువాత బెంగళూరుకు వెనుతిరిగి వస్తారు. అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment