హుబ్లీ: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన పౌష్టికాహార పదార్ధాలను అక్రమంగా గోదాములో నిల్వ చేసిన కేసులో ధార్వాడ జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ హులిగవ్వ కుకునూర, హుబ్లీ సీడీపీఓ ముత్తన్నలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలను వెల్లడించింది. కేసును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం శాఖా విచారణలో ఉండగానే ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి పాల్పడినట్లు తేలడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారనే ఆరోపణలతో మహిళా, బాలల కళ్యాణ అభివృద్ధి శాఖా ఉప కార్యదర్శి సీ.బలరామ గురువారం ఈ ఉత్తర్వులను వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రం లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని సమకూర్చడంలో డీడీ, సీడీపీఓ విఫలయ్యారు. కాలానుగుణంగా గోదాముల్లోని నిల్వలను పరిశీలించకుండా విధి నిర్వహణలో విఫలం కావడమేగాకుండా ఆహార పదార్ధాల అక్రమ నిల్వలకు అవకాశం కల్పించారు. ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. దీంతో లబ్ధిదారులు పౌష్టికాహారం నుంచి వంచితులయ్యే ప్రమాదం ఉన్న కారణాన్ని చూపుతూ ఆదేశాలు వెల్లడించినట్లు ఓ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment